విస్తరణ దిశగా డీసీబీ బ్యాంక్
- తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 25 శాఖలు
- డీసీబీ బ్యాంక్ ఎండీ, సీఈవో మురళీ ఎన్ నటరాజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రయివేటు రంగ బ్యాంక్ డీసీబీ పేర్కొంది. ఇందులో భాగంగా వచ్చే రెండు మూడేళ్లలో శాఖల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయించినట్లు తెలియజేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 12గా ఉన్న శాఖల సంఖ్యను 30కి, ఆంధ్రప్రదేశ్లో శాఖల సంఖ్యను 5 నుంచి 15కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీసీబీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో మురళీ ఎన్ నటరాజన్ చెప్పారు. విస్తరణ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో సొంతంగా రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఖమ్మం జిల్లాలో కొత్తగా ఒక శాఖను ప్రారంభించినట్లు తెలిపారు.
గురువారం హైదరాబాద్లో ఆయనవిలేకరులతో మాట్లాడుతూ డీసీబీ మొత్తం వ్యాపారంలో 7% తెలంగాణ నుంచే వస్తోందని, రానున్న కాలంలో దీన్ని 10%కి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి వెంబడి కొత్త శాఖలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇప్పటికే సర్వే పూర్తయింది. త్వరలోనే వీటిని ప్రారంభిస్తాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 157 శాఖలతో బ్యాలెన్స్ షీటు రూ. 16,000 కోట్లుగా ఉంది. దీన్ని మూడేళ్లలో రెట్టింపు చేయాలనేది మా లక్ష్యం’ అని వివరించారు. కొత్తగా వస్తున్న పేమెంట్ బ్యాంకులు, ఇతర బ్యాంకుల వల్ల పోటీ పెరిగి ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు లభిస్తాయన్నా రు. వ్యాపార విస్తరణకు అదనంగా ఎలాంటి నిధులు అక్కర్లేదని, 2017 మార్చి తర్వాతే మూలధనం అవసరమవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.