టెస్లా మోడల్-3 ఎలక్ట్రిక్ కారు, రెండులక్షల బుకింగ్స్
న్యూఢిల్లీ
పెనుభూతంలా తరుముకొస్తున్న వాయుకాలుష్య భయంతో ఎకో కార్లకు, ఎలక్ట్రిక్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన టెస్లా మోటార్స్ కంపెనీ మోడల్-3 ఎలక్ట్రిక్ కారును విడుదలచేసింది. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలకోసం పరిశోధనలు చేస్తూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టెస్లా తమ ఎలక్ట్రిక్ సెన్సేషన్ కారును మార్కెట్ లో లాంచ్ చేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టెస్లా మోడల్-3 ఎలక్ట్రిక్ కారు విడుదల కాగానే దీనికోసం టెక్నాలజీ ప్రియులు, కారు ప్రియులు క్యూ కట్టారు.
తాజాగా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కార్ మోడల్ 3 బేసిక్ మోడల్ ధర ఇంతకుముందెన్నడూ లేని అందుబాటు ధరలో 35వేల డాలర్ల(సుమారు రూ.23లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 346 కి.మీ.లు ప్రయాణించవచ్చు. 2017 చివరిలో ఈ కారు డెలివరీలు ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఏడాదికి 5లక్షల వాహనాలు ఉత్పత్తి చేయాలన్నది తమ లక్ష్యమని తెస్లా సీఈవో ఎలోన్ మస్క చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ రోడ్లపై కనిపించే టూ అండ్ త్రి సీట్ల కార్లలో ఇది చవకైనదనీ 6 సెకన్లలో60కి.మీ వేగంతో దూసుకెళుతుందని తెలిపారు. ఇప్పటికే 2 లక్షల 32 వేల ముందస్తు ఆర్డర్లు వచ్చినట్టు మస్క తెలిపారు. కంపెనీ నుంచి విడుదలైన అతి తక్కువ ధర ఎలక్ట్రిక్ కారు ఇదే. .