జెడ్పీలో బదిలీలకు బ్రేక్..!
► ఖరారుకు ముగిసిన గడువు
► జెడ్పీ చైర్పర్సన్, సీఈవోల మధ్య కుదరని ఏకాభిప్రాయం!
► పైరవీల ప్రాధాన్యత కోసమేనని ప్రచారం
► ఒక్కో పోస్టుకు నాలుగు సిఫారసులు
అరసవిల్లి(శ్రీకాకుళం) :జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ పడిందా.. అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ ప్రాధాన్యం ఉన్న జిల్లా పరిషత్లో బదిలీల పర్వం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిబంధనల ప్రకారం ఈ నెల 24 నాటికి బదిలీల ఖరారు పూర్తి కావాల్సి ఉంది.
అయితే మితిమీరిన రాజకీయ జోక్యంతో బదిలీలపై ఇంకా స్పష్టత రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అనుకూల పోస్టింగులకు ప్రత్యేక ధర పలుకుతుండటంతో కొందరు ఉద్యోగులు ఇదే బాటలో రాజకీయ ఒత్తిళ్లు పెంచారనే ప్రచారం జోరందుకుంది. దీంతో బదిలీల ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగకుండా నిలిచిపోయింది. ఈ నెల 22న జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ జరిగింది. ఈ ప్రక్రియలో మొత్తం 206 మంది ఉద్యోగులు బదిలీలకు అర్హత సాధించగా, వీరిలో ఆప్షన్లు ఇవ్వకుండా గైర్హాజరైన వారు 66 మంది ఉన్నారు. మిగిలిన వారి బదిలీల జాబితాతో కూడిన ప్రత్యేక ఫైలు మాత్రం ఈ నెల 23 నాటికే సిద్ధమైంది.
ఈ ఫైలుపై జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి ఆమోదముద్ర పడాల్సి ఉంది. అయితే ఈ విషయంలో జెడ్పీ సీఈఓ నగేష్ తీసుకుంటున్న పలు నిర్ణయాలతో చైర్పర్సన్ కొంత మేరకు విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ ధనుంజయరెడ్డికి ఈ బదిలీ ఫైలు పంపించే విషయంలోనూ ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం. అందుకే బదిలీ లకు తాత్కాలికంగా బ్రేక్ పడిందనే వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెడ్పీ ఉద్యోగుల బదిలీల భవిష్యత్ ఎప్పుడు తేలుతుందా అని వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
పైరవీల ప్రాధాన్యతే ప్రధాన ఎజెండా..!
జెడ్పీ యాజమాన్యంలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించి గంటగంటకూ మారిపోతున్న నిర్ణయాలతో జెడ్పీ ప్రాంగణం రెండ్రోజులుగా వేడెక్కిపోయింది. ఇదంతా పైరవీల ప్రాధాన్యతకు పెద్దపీట వేసేందుకే ఇలా జరుగుతుందనే ప్రచారం జోరందుకుంది. రూ.లక్షలు, వేలల్లో చేతులు మారడం, దూరాన్ని బట్టి, ఆదాయ వనరులను బట్టి పోస్టింగులకు ఓ ప్రత్యేక రేట్లు పెట్టడం వంటి అంశాలతో పాటు ప్రధానంగా జిల్లాలో రాజకీయ నేతలు, స్థానిక రాజకీయ పెద్దల సిఫారసులకు ప్రాధాన్యతపై ఆధిపత్య పోరే తాత్కాలిక బదిలీల నిలిపివేతకు కారణమంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి.
ఇదే ప్రధాన ఎజెండాగా బదిలీల పర్వం తుది దశ మెరుగులు దిద్దుకుంటోందని తెలుస్తోంది. జెడ్పీ చైర్పర్సన్కు కూడా జిల్లా నుంచి రాజకీయ నేతల ఒత్తిళ్లు, సామాజిక అంశాలు తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయని సమాచారం. ఈ విషయంలో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి భారీగా సిఫారసులు రావడంతో ఏం చెయ్యాలో తోచక అయోమయంలో పడ్డారని తెలుస్తోంది. దీనికితోడు తన సామాజిక వర్గానికి చెందిన వారికి అనుకూల పోస్టింగులు ఇచ్చేందుకు కూడా చైర్పర్సన్ పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే పలు మండలాల నుంచి ఒకే పోస్టింగుకు రెండు నుంచి నాలుగు సిఫారసు లేఖలు రావడంతో ఎలా సంతృప్తి చెయ్యాలా అన్న సందిద్ధంలో పడ్డారు.
చైర్పర్సన్ ఆమోదం పొందగానే..
జెడ్పీ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఈ నెల 24 నాటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే చైర్పర్సన్ వద్దకు ఫైలు పంపాం. ఆమె ఆమోదం పొందగానే బదిలీలపై ఉత్తర్వులు ఇస్తాం. వెంటనే కొత్త స్థానాల్లో ఉద్యోగులు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇంకా ఆప్షన్లు ఇవ్వని ఉద్యోగులను కచ్చితంగా మిగిలిన స్థానాలకు బదిలీలు చేస్తాం.
– బి.నగేష్, జెడ్పీ సీఈవో, శ్రీకాకుళం