కొత్త పాలకవర్గం ప్రమాణమెన్నడో...?
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్, జిల్లా పరిషత్ చెర్మైన్ పాలక వర్గ ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది తేదీలు ఖరారు కాకపోవడంతో ఫలితాలు వెల్లడైనా అభ్యర్థుల్లో మరో నెల రోజుల వరకు నిరీక్షించక తప్పేలా లేదు. సాధారణ ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెల్లడి కావడమే కాకుండా వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాకే చెర్మైన్, జెడ్పీ చెర్మైన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిసింది. చెర్మైన్లను ఎన్నుకోవాలంటే సంబంధిత ఎమ్మెల్యేలు ఆయా మున్సిపల్ చెర్మైన్ అభ్యర్థికి ఓటు వెయ్యాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు ఓటు వెయ్యాలంటే వారు ముందుగా ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేస్తేనే ఓటు వేసే హక్కు ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో మున్సిపల్, జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడించినా పాలకవర్గ ఎంపిక మాత్రం జూన్ 2 తర్వాతనే ఉంటుందని తెలుస్తోంది.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలతో పాటు గజ్వేల్, అందోల్ నగర పంచాయతీలకు మార్చి 30న పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 2న మున్సిపల్ ఫలితాలను వెల్లడించి 5న చైర్మన్‌ను ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ మున్సిపల్ ఫలితాలను వెల్లడించకుండా నిలిపివే యాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మే 12 వరకు ఫలితాలు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. కానీ చెర్మైన్ ఎన్నిక మాత్రం ఏ రోజు ఎంపిక చేయాలనేది ఎన్నికల కమిషన్ చెప్పకపోవడంతో తదుపరి నోటిఫికేషన్ వెలువడినాకే చెర్మైన్, వైస్ చెర్మైన్ ఎన్నిక ఉంటుందని సంబంధిత అధికారులు న్యూస్‌లైన్‌కు వివరించారు.
ఇదిలా ఉంటే జిల్లా పరిషత్ చెర్మైన్ ఎన్నిక సైతం వాయిదా పడే ఆవకాశం ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఏప్రిల్ 6, 11న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఫలితాలను ఈ నెల 13న ప్రకటించనున్నారు. కానీ జెడ్పీ చైర్మన్ ఎన్నికను ఏ రోజు నిర్వహించేది చెప్పలేదు. సాధారణ ఎన్నికల ఫలితాలు ఈ నెల 16న వెల్లడికానున్నాయి. ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రమాణ స్వీకారం చేసే వరకు ఓటు వేసే ఆవకాశం ఎమ్మెల్యేలకు లేదు. దీంతో జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే మున్సిపల్, జెడ్పీ చెర్మైన్ ఎన్నికల్లో ఓటు వేసే ఆవకాశం ఉంటుంది.