ఫాస్ట్‌ఫుడ్‌లకు ‘పరీక్షా’కాలం
నెస్లే, ఐటీసీ, ఇండో నిసాన్ సహా ఏడు కంపెనీల ఉత్పత్తులపై పరీక్షలకు ఆదేశం
♦ అన్ని రాష్ట్రాలకు ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ సర్క్యులర్
♦ ఈనెల 19 కల్లా నివేదిక సమర్పించాలని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: మ్యాగీ వివాదం నేపథ్యంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) మరిన్ని కంపెనీలకు చెందిన నూడుల్స్, పాస్తా తదితర పదార్థాలపై దృష్టి సారించింది. నెస్లే, ఐటీసీ, ఇండో నిసాన్, గ్లాక్సోస్మిత్‌క్లిన్ తదితర ఏడు కంపెనీలకు చెందిన 32 బ్రాండ్ల ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలని సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
మ్యాగీ, టాప్ రామెన్, వాయ్ వాయ్, యమ్మీ, మాకరోనీ వంటి ప్రముఖ బ్రాండ్లు వీటిలో ఉన్నాయి. అలాగే ఎలాంటి ఆమోదం లేకుండా మార్కెట్లో చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్న తక్షణ తయారీ ఆహార పదార్థాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని స్పష్టంచేసింది. లేకుంటే అలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నెస్లేకు చెందిన మ్యాగీపై పరీక్షలు నిర్వహించగా హానికారకాలు ఉన్నట్టు తేలిందని, అందుకే అలాంటి ఇతర ఉత్పత్తులపై పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
‘మార్కెట్లో చాలా బ్రాండ్ల ఉత్పత్తులకు మా ఆమోదం లేదు. అవి ఆహారంగా తీసుకోదగిన పదార్థాలు కావు’ అంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో వైఎస్ మాలిక్ అన్ని రాష్ట్రాల ఆహార భద్రత కమిషనర్లకు ఒక సర్క్యులర్ పంపారు. నూడుల్స్, పాస్తా, మాకరోనీ, కేకులతోపాటు రుచిని పెంచేందుకు వాడే ఉత్పత్తులపై ఎలాంటి పరీక్షలు నిర్వహించాలో కూడా అందులో వివరించారు. నివేదికలను జూన్ 19కల్లా ఇవ్వాలని పేర్కొన్నారు.
ఈ కంపెనీల ఉత్పత్తులపై పరీక్షలు
నెస్లే ఇండియా, ఐటీసీ, ఇండోనిసాన్ ఫుడ్ లిమిటెడ్, జీఎస్కే కన్స్యూమర్ హెల్త్‌కేర్, సీజీ ఫుడ్స్,రుచి ఇంటర్నేషనల్, ఏఏ న్యూట్రిషియన్
ఏయే ఉత్పత్తులపై పరీక్షలు?
వాయ్ వాయ్ నూడుల్స్, సీజీ ఫుడ్స్‌కు చెందిన భుజియా చికెన్ స్నాక్స్, కోకా ఇన్స్టంట్ నూడుల్స్(రుచి ఇంటర్నేషనల్), ఫూడుల్స్(జీఎస్కే కన్స్యూమర్ హెల్త్‌కేర్), నెస్లే మ్యాగీకి చెందిన తొమ్మిది రకాల నూడుల్స్ ఉత్పత్తులు, మ్యాగీ న్యూటిలిషియస్ పజ్టాకు చెందిన నాలుగు ఉత్పత్తులు, టాప్ రామెన్ ఆటా మసాలా(ఇండో నిసిన్స్), ఐటీసీకి చెందిన 3 రకాల ఇన్స్టంట్ నూడుల్స్, యమ్మీ చికెన్ నూడుల్స్, యమ్మీ వెజ్ నూడుల్స్(ఏఏ న్యూట్రిషియన్స్).
కాగా, భారత్‌లో తయారైన మ్యాగీ న్యూడుల్స్ తమ దేశ భద్రతా ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని, ఆరోగ్యానికి ముప్పులేదని సింగపూర్ తెలిపింది.