వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీల్లో జిల్లా నేతలు
►సీజీసీ సభ్యులుగా పాలవలస, ధర్మాన
►పార్టీ అధికార ప్రతినిధులుగా ధర్మాన, తమ్మినేని
►కార్యదర్శిగా పిరియా సాయిరాజ్
►పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రకటన
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి కీలక కమిటీల్లో శ్రీకాకుళం జిల్లాకు సముచిత ప్రాధాన్యం లభించింది. శుక్రవారం పార్టీ జరిపిన పలు కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురు నేతలకు చోటు దక్కింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయం ఈ కమిటీల వివరాలతో కూడిన ప్రకటనను విడుదల చేసింది. వీటిలో జిల్లా నుంచి నలుగురు నేతలకు చోటు లభించింది.
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతోపాటు, జిల్లాపరిషత్ మాజీ అధ్యక్షుడు పాలవలస రాజశేఖరం పార్టీ కేంద్ర పాలకమండలి(సీజీసీ) సభ్యులుగా నియమితులయ్యారు. ధర్మాన ఇప్పటికే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా పార్టీ అధికార ప్రతినిధులుగా ధర్మాన ప్రసాదరావుతోపాటు మాజీ మంత్రి తమ్మినేని సీతారాం నియమించారు. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ను పార్టీ కార్యదర్శి పదవి వరించింది. పార్టీ ప్రధాన కమిటీల్లో భాగంగా వైఎస్సార్సీపీ జిల్లా నేతలకు చోటు దక్కడంతో కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.