బతుకు–భవిత ‘మేలు’కుంటేనే!
సమకాలీనం
రెండు తెలుగు రాష్ట్రాలైనా, మొత్తం భారతదేశమైనా... ఇప్పుడున్న వాతావరణ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి సుస్థిరాభివృద్ధి సాధించడానికి నిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలి. ‘ఎస్డీజీల సాధనలో కేంద్రంతో పాటు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలది కీలక పాత్ర. 17లో 15 అంశాలు రాష్ట్రాలు, వాటి కింద ఉండే స్థానిక సంస్థల పరిధిలోకే వస్తాయి. పైగా భాగస్వాములుగా ప్రజల్ని ముందుంచి, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా కార్యాచరణ ఏక కాలంలో, అన్ని స్థాయిల్లో జరిపించడానికి రాష్ట్రాల చొరవే ముఖ్యం.
‘నిద్రపట్టక తన భర్త అర్థరాత్రి మంచమ్మీద కూర్చొని బలవంతంగా ఊపిరి పీలుస్తుంటాడు. ఖళ్ళు..ఖళ్ళు మని దగ్గొకటి... మందులు వాడినా ఫలితం ఉండట్లే! చిన్న వయసులో ఎందుకీ దురవస్థ?’ బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు హైదరాబాద్ బోరబండలో నివసించే సౌమ్యకు. ‘పటెలా! మీరు చిన్నగున్నపుడు ఆయిటి పూని మిర్గం (మృగశిర) రాంగనె వానలొచ్చేవి, తుకాలు అలికి దుక్కులు దున్నుకుందుము, ఇప్పు డేంది రెన్నెళ్ల మొఖమైతుంది ఇంకా వానళ్లేవు, ఎందుకిట్ల?’ తన అరవయ్యేళ్ల అనుభవాన్నంతా రంగరించి ఆలోచించినా మెదక్ జిల్లా పల్లెటూరి పోశ య్యకు మర్మమేమిటో అర్థం కాదు.
‘మా తాతల తరం నుంచి మాకీ సముద్రుడే దిక్కు, ఎంత కోపమొచ్చినా అలలతో కొట్టేవాడే కాని, మా ఊరిని ముట్టుకోలేదయ్యా! ఇప్పుడేమయిందో రెండు మూడేళ్ల నుంచి చూస్తున్నాం, ఊరు ఊరునే మింగేస్తున్నడు, ఇదో ఇక్క డ్దాకా నేలను కోసింది సంద్రం. ఎటూ దిక్కులేక మేమే యెనక్కి జరుగు తున్నం’ గోదావరి జిల్లా సాగరతీర గ్రామంలో ఓ పల్లెకారుడు ఓదెలు మనో వేదన!
వీటన్నిటికీ కారణం.. కాలుష్యం వల్ల భూతాపం పెరిగి వాతావరణంలో వస్తున్న మార్పులే అంటే, అంత తేలిగ్గా బోధపడదు. ప్రత్యక్షంగా లంకె ఎక్క డుందో అర్థం కాక చదువుకున్న వాళ్లు కూడా సందేహిస్తారు. ఇంకొందరయితే, ‘అన్నిటికీ మీరు అదే కారణమంటారు! హు!!’ అని అడ్డంగా వాది స్తారు. ఇది విడమర్చి, ప్రజలకు వివరించి, వారి సహకారం– భాగస్వా మ్యంతో విపత్తును అడ్డుకునే ప్రయత్నానికి పౌర సంఘాలూ ముందుకు రావు, ప్రభుత్వాలూ పూనుకోవు. సమస్య జఠిలమైందే! ముంచుకొస్తున్న విపత్తును గ్రహించారు కనుకే ప్రపంచ దేశాధీశులంతా (189 దేశాలు) ఏకమై సమస్యపై లోతుగా పరిశీలన చేశారు. గడచిన యాౖభై ఏళ్లలో స్టాక్‌హోమ్ (స్వీడన్), రియో (బ్రెజిల్), క్యూటో (జపాన్), బ్యాసెల్ (స్విట్జర్లాండ్), జోహనస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా), పారిస్ (ఫ్రెంచ్) ఇలా చాలా చోట్ల పెద్ద పెద్ద సభలు, సమావేశాలు పెట్టి పరిష్కారాలు అన్వేషించారు.
పర్యావరణ పరి రక్షణకు మొదట ఎనిమిదంశాలతో ‘మిలీనియం డెవలప్మెంట్ గోల్స్’ (ఎమ్డీజీ) అని లక్ష్యాలు నిర్దేశించుకొని, పదిహేనేళ్లకు సమీక్షించుకున్నారు. సాధించిన మంచి కొంత ఉన్నా, ఫలితాలకన్నా ఎన్నో రెట్ల వేగంతో సమస్య బలపడుతున్న తీరు ఆందోళన కలిగించింది. అభివృద్ధి ముసుగులో ఎదుర వుతున్న అవరోధాలు చూశాక మేధావి వర్గం తమ వ్యూహం దిశ మార్చింది. తాజాగా పదిహేడు అంశాలతో ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని’ (ఎస్డీజీ) ఏర్పాటు చేసుకున్నారు. 2030 నాటికి ఏయే విషయాల్లో ఏమి సాధించాలో స్పష్టమైన అవగాహన, కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ సజావుగా సాధించినపుడే మనిషి మనుగడ, భవిష్యత్తరాలకో అవకాశం సాధ్యమని నిర్ధా రణ అయింది.
కార్యాచరణకు కదిలితేనే...!
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలకు భారత్ కూడా భాగస్వామి. ఇటీవల జరిగిన ప్యారిస్ భాగస్వాముల సదస్సులో మన దేశం కీలక భూమిక నిర్వహించింది. ఎమ్డీజీల్లో ప్రపంచమంతటా ఆకలి లేకుండా చూడటం, పేద రిక నిర్మూలన ఎజెండాగా ఉండేది. కానీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)కు వచ్చేసరికి ఎజెండా విస్తృతితో పాటు మరింత స్పష్టత సంతరించుకుంది. అభి వృద్ధిని సరైన మార్గంలో నిర్వచించడమే కాక సుస్థిరత అంశాన్ని జోడించారు. ఈ 17 లక్ష్యాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రపంచ సమకాలీన సమస్యలన్నింటికీ దాదాపు ఇందులో పరిష్కారాలు లభిస్తాయనిపిస్తుంది.
పాలకుల్లో, అధికా రుల్లో, పౌరుల్లో ఆచరణకు అవసరమైన చిత్తశుద్ధి ప్రధానాంశం.
1) ప్రపంచ వ్యాప్తంగా అన్ని రూపాల్లోని పేదరిక నిర్మూలన.
2) అందరికీ ఆహార భద్రత, పౌష్ఠికాహారం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం.
3) అన్ని వయసుల వారికీ ఆరోగ్యాన్ని, సంతోషకర జీవనాన్ని అందించడం.
4) అందరికీ సమ– నాణ్యమైన విద్యను అందించడం, జీవిత పర్యంతం అవకాశ కల్పన.
5) స్త్రీ– పురుష సమానత్వ సాధన, మహిళలు, బాలికలకు సాధికారత.
6) అందరికీ స్వచ్ఛమైన నీరు, సంపూర్ణ పారిశుధ్య కల్పన.
7) నాణ్యమైన, చవకైన, ఆధు నిక, సుస్థిర విద్యుత్తును అందరికీ అందించడం.
8) అందరికీ సంపూర్ణ– గౌరవప్రద ఉపాధి అవకాశాల కల్పనతో సమ్మిళిత–సుస్థిర ఆర్థిక ప్రగతికి బాటలు వేయడం.
9) నవకల్పనలతో ఉపయుక్త మౌలిక సదుపాయాలు, సమ్మిళిత–సుస్థిర పారిశ్రామికాభివృద్ధి సాధన.
10) దేశాల్లో ప్రాంతాల నడుమ, దేశాలమధ్య సామాజిక–ఆర్థిక అంతరాలు లేని సమసమాజ స్థాపన.
11) నగరాలు, పట్టణాలు, గ్రామాలు, ఇతర అన్ని జనావాసాల్ని ఆవాస యోగ్యంగా, సౌఖ్య, సురక్షిత, సుస్థిరమైనవిగా తీర్చిదిద్దడం.
12) సుస్థిర, బాధ్యతాయుత ఉత్పత్తి–వినియోగ ఒరవడి పెంచడం.
13) వాతావరణ మార్పు, దాని దుష్ప్రభావాల్ని ఎదుర్కొనే తక్షణ కార్యాచరణ.
14) సము ద్రాలు, సాగరజల వనరుల పరిరక్షణ, సుస్థిరాభివృద్దికి తోడ్పడేలా వాటి వినియోగం.
15) భూమిపైనున్న సమస్త జీవావరణ వ్యవస్థల్ని, అడవుల్ని పరిరక్షిస్తూ, ఆ వనరుల్ని సుస్థిరాభివృద్ధికి వినియోగించడం. భూసారహీనత, ఎడారీకరణ, జీవవైవిధ్య నష్టాల్ని అరికట్టడం.
16) శాంతియుత, సమ సమాజ స్థాపనతో అందరికీ న్యాయం అందిస్తూ అన్ని స్థాయిల్లోనూ పటిష్ఠ, బాధ్యతాయుత, సమ్మిళిత పాలనావ్యవస్థల్ని ఏర్పరచడం.
17) ఈ అన్ని లక్ష్యాలతో సుస్థిరాభివృద్ధి సాధనకు అనువైన అంతర్జాతీయ సంబంధాల్ని వృద్ధి చేయడం.
జరుగుతున్నదంతా అరాచకమే!
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పట్ల, ఇందుకు గాను ఆయా ప్రభుత్వాలు చేపట్టే పథకాలు–కార్యాచరణ పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వ్యవహారాలేవీ సగటు పౌరులకు తెలియనీకుండా సమకాలీన ప్రభుత్వాలు వ్యవహరిస్తు న్నాయి. వాటికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు విధాన నిర్ణ యాలు–అమలు ఉంటోంది. ఫలితంగా సమస్యలు పరిష్కారం కాకపోగా జఠిలమౌతున్నాయి. భవిష్యత్తరాల ప్రయోజనాల్ని పణంగా పెట్టి య«థేచ్ఛగా ప్రకృతి సహజవనరుల్ని కొల్లగొట్టే తీరు ప్రమాదకరం. సుస్థిరాభివృద్ధి లక్ష్యంతో కాకుండా వరుస ప్రభుత్వాలు, ఎన్నికల్లో తమకు కొల్లలుగా ఓట్లు ఈనే అస్థిరాభివృద్ధి పథకాల్నే రచిస్తున్నాయి. పౌరులు ఎప్పుడూ దీనంగా ప్రభుత్వాల వైపు చూసే పరిస్థితుల్నే అవి కొనసాగిస్తున్నాయి.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సగం సాధించినా దేశ పౌరులు గుడ్డిగా ప్రభుత్వాలపై ఆధార పడాల్సిన దుస్థితి తప్పుతుంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందు తున్న దేశాల్లో పరిస్థితులు మరింత దయనీయంగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక ప్రకృతి వైపరీత్యాల ప్రాంతంగా ఆసియా–పసిఫిక్ జోన్ నమో దైంది. అసాధారణ ఆర్థిక ప్రగతి, కోట్లాది మందిని పేదరికం నుంచి గట్టెక్కిం చిన మాట నిజమే అయినా ప్రతికూలతలు ఎక్కువే! జీవావరణంపై ఒత్తిడి పెరిగింది. ఆర్థిక వృద్ధి క్రమంలో గాలి, నీరు కలుషితమై అపార చెత్త పేరుకుపోయింది. మనిషి–పరిసరాల ఆరోగ్యానికి పెద్ద సవాల్ విసురు తోంది. గత రెండు దశాబ్దాల్లో 41 శాతం ప్రకృతి వైపరీత్యాలు ఈ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. శతాబ్ద కాలంలో 91 శాతం దుర్మరణాలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. 1981–2010 మధ్య రికార్డు స్థాయి వర్షపాతం (56 శాతం వృద్ధి) ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో జరిగింది.
2070 నాటికి ఆసియా నగరాలైన బ్యాంకాక్, ఢాకా, కొల్కత్తా, ముంబాయి, షాంఘైలలో కోట్లాది మంది నిర్వాసితులవుతారనే నివేదికలున్నాయి. 24 గంటల అకాల వర్షాలతో హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి మహానగరాలు నిన్నా, మొన్నా అల్లాడిన తీరు మనం కళ్లారా చూశాం. భూతాపోన్నతి వల్ల హిమాలయాలపై మంచు పొర కరిగిపోతోంది. జీవవైవిధ్య నాశనంతో సూక్ష్మక్రిములు అంతరించి ఆహార గొలుసు అక్కడక్కడ ఛిద్రమౌతోంది. ఈ రెండు పరిణామాలే చాలు ఆహారోత్పత్తిపై పడే పెద్ద దెబ్బకు! సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని సాధించడానికి ఇదే అత్యవసర, అత్యున్నత సమయంగా మేధావి సమాజం భావిస్తోంది. భారత ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కదిలింది. ఎస్డీజీల సాధనకు జాతీయ సూచి కలనేర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమ అమలు విభాగం ఓ ముసాయిదా పత్రాన్ని విడుదల చేసి ప్రజా భిప్రాయ సేకరణ ప్రారంభించింది.
ఏం చేస్తే బావుంటుంది?
రెండు తెలుగు రాష్ట్రాలైనా, మొత్తం భారతదేశమైనా... ఇప్పుడున్న వాతావ రణ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి సుస్థిరాభివృద్ధి సాధించడానికి నిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలి. ‘ఎస్డీజీల సాధనలో కేంద్రంతో పాటు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలది కీలక పాత్ర. 17లో 15 అంశాలు రాష్ట్రాలు, వాటి కింద ఉండే స్థానిక సంస్థల పరిధిలోకే వస్తాయి. పైగా భాగస్వాములుగా ప్రజల్ని ముందుంచి, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా కార్యాచరణ ఏకకాలంలో, అన్ని స్థాయిల్లో జరిపించడానికి రాష్ట్రాల చొరవే ముఖ్యం. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛభారత్, మేకిన్ ఇండియా, నైపుణ్య భారత్, డిజిటల్ ఇండియా వంటివన్నీ ఎస్డీజీల సాధనకు దోహదపడేవే’ అని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ అన్నారు.
ఆయనతోపాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, ఎ.కె.పట్నా యక్లు పాల్గొన్న ఒక జాతీయ సదస్సు ‘పర్యావరణ పరిరక్షణ–దేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనక్రమం’ అన్న అంశంపై సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సు చర్చల సారంగా పలు ప్రతిపాదనలతో ఓ వినతి పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు సదస్సు నిర్వాహకుల్లో ఒకరైన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్) సన్నాహాలు చేస్తోంది.
భారత రాజ్యాంగ ప్రవేశికలో ‘సుస్థిరాభివృద్ధి’ పదాన్ని, ఆదేశిక సూత్రాల్లో 17 లక్ష్యాలనూ చేర్చేలా సవరణ చేయాలని ప్రతిపాదిస్తోంది. తన అధీనంలోని వివిధ శాఖలు చేపట్టే అన్ని విధాన కార్యక్రమాల్లో విధిగా ఎస్డీజీ అంశాలు ప్రతిబింబించేట్టు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలివ్వాలని కోరుతోంది. పర్యా వరణ పరిరక్షణ ప్రభుత్వాలకు రాజ్యాంగం (అధికరణం 48ఎ) అప్పగించిన బాధ్యత. రాజకీయ పక్షాలన్నీ తమ ఎన్నికల ప్రణాళికలో ఎస్డీజీలను తప్పని సరి అంశం చేయాలనేది మరో ప్రతిపాదన. కార్పొరేట్లు తమ సామాజిక బాధ్యత (సీఎస్సార్)లో భాగంగా ఈ లక్ష్యాల సాధనకు పెద్దపీట వేయాలని సూచిస్తోంది. భారత రాజ్యాంగం నిర్దేశించే పౌర విధుల్లో (అధికరణం 51ఎ– జీ) ప్రకృతి–పర్యావరణ రక్షణ కూడా ఉంది. లక్ష్యాల సాధనలో తన వంతు బాధ్యత ఏమేరకు నిర్వహించగలనని ప్రతి భారత పౌరుడూ ఆలోచించి, కార్యాచరణ చేపట్టాలని దేశ పౌరులకు వినతి చేస్తోంది.
ఇద్దరు పెద్దమనుషుల మాటలు మననం చేసుకుందాం. అభివృద్ధి పేరిట మనం చేస్తున్నదంతా విధ్వంసమే అన్న ఫ్రెంచ్ తత్వవేత్త రూసో, మళ్లీ ప్రకృతిలోకి వెళ్లి పరిష్కారాలు వెతుక్కోవడమే ఏకైక మార్గమన్నాడు. ‘ప్రకృతి లోకి లోతుగా చూడండి..... ఇప్పుడన్ని విషయాలు మరింత మెరుగ్గా అర్థమౌ తాయి’ అన్న సహస్రాబ్ది మేధావి అల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు జోహార్!
దిలీప్ రెడ్డి
ఈమెయిల్: dileepreddy@sakshi.com