‘మొక్క’వోని దీక్షకు పట్టం
* ఆరేళ్లుగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ హరితవిప్లవం
* అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ ఉద్యమం
* ఇప్పటి వరకూ 30 లక్షల మొక్కలు నాటిన సీజీఆర్
సాక్షి, హైదరాబాద్: కనుచూపు మేరలో పచ్చని మొక్కకు నోచక ఎడారి సదృశ్యమవుతున్న పల్లెలు.. వానలు లేక బీడువారిన పంట పొలాలు.. అడుగంటిన భూగర్భ జలాలు.. వారిని కదిలించి కర్తవ్యాన్ని ప్రబోధించాయి. రోజురోజుకూ అంతరించిపోతున్న అడవులు, వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య ప్రతికూల పరిస్థితుల నుంచి భావి తరాలను కాపాడేందుకు గుప్పెడు మంది నడుం కట్టారు. పల్లెలు.. పట్టణాలు.. నగరాల్లో తరిగిపోతున్న వనాలను పెంచి ముంచుకొస్తున్న ముప్పును అధిగమించేందుకు ఆరేళ్ల క్రితం ఉద్యమ బాట పట్టారు.
2010లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్) పేరిట సంస్థను ఏర్పాటు చేసి హరిత విప్లవానికి నాంది పలికారు. పర్యావర ణ ప్రియులు కె.లక్ష్మారెడ్డి సార థ్యంలో ఆవిర్భవించిన సీజీఆర్ సంస్థ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే చేపడుతున్న హరితహారం వంటి కార్యక్రమాలను నాలుగైదేళ్ల క్రితమే చేపట్టి సుమారు 30 లక్షల మొక్కలను నాటింది. వాటిలో 70 శాతానికిపైగా మొక్కలను పెంచి మహావృక్షాలుగా తీర్చిదిద్దింది.
వినూత్న కార్యక్రమాలు..
సీజీఆర్ ఈ ఆరేళ్లలో 9.23 లక్షల మంది విద్యార్థులను ఉద్యమ భాగస్వాములుగా తీర్చిదిద్ది.. 31.98 లక్షల మొక్కలను నాటింది. ప్రతి విద్యార్థి తాను నాటిన మొక్కలను తానే సంరక్షించేలా విస్తృత చర్యలు చేపట్టింది. ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి, శ్రీశైలం టైగర్స్ ప్రాజెక్టు కన్జర్వేటర్‌గా పనిచేసిన తులసీరావు, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీంద్ర వంటి ప్రముఖులు ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన హరిత హారంలో 2 లక్షల మంది విద్యార్థులతో కలసి హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
‘వనచైతన్య యాత్ర’, ‘హరితగ్రామం’, ‘ప్రకృతి-సంస్కృతి’, ‘స్మృతివనం’ వంటి వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టింది. ఏటా రక్షాబంధన్ వేడుకలను వృక్షాబంధన్‌గా నిర్వహిస్తున్నారు. ‘నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష’ అనే స్ఫూర్తితో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యార్థి తన పుట్టినరోజున ఓ మొక్కను నాటుతాడు. పిల్లలతో పాటే మొక్కలకు సైతం పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు.
తూర్పు కనుమల పరిరక్షణకు ‘గ్రేస్’...
గ్రీన్స్ అలయన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్(గ్రేస్). తూర్పు కనుమల పరిరక్షణ సమితి. 2011 జూలై 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీజీఆర్ అనుబంధ సంస్థగా గ్రేస్‌ను ఏర్పాటు చేశారు. పర్యావరణ నిపుణులు, మేధావు లు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు గ్రేస్‌లో భాగస్వాములు. సీనియర్ పాత్రికేయులు దిలీప్‌రెడ్డి గ్రేస్‌కు చైర్మన్. తూర్పు కనుమలు విస్తరించి ఉన్న 1,700 కిలోమీటర్ల పరిధిలో ఘాట్‌లు, అడవులు, వనరులు, నదులు, వన్యప్రాణుల సంరక్షణ గ్రేస్ లక్ష్యం. కాగా, సీజీఆర్ కృషి బాలలకు పాఠ్యాంశమైంది. ఐదో తరగతి లోని ‘మనం-మన పరిసరాలు’ పుస్తకం లో ఈ అంశాన్ని చేర్చి బోధిస్తున్నారు. ఈ కృషి ఫలితమే ఈ ఏడాది ప్రతిష్టాత్మక జస్టి స్ కుల్‌దీప్‌సింగ్ అవార్డు వరించింది.