Council for the Green Revolution
-
తూర్పు కనుమల పరిరక్షణకు జాతీయ ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ: తూర్పు కనుమల పరిరక్షణకు జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్) సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అపార ఖనిజ, వృక్ష, జంతు, ఆయుర్వేద, జల సంపద కలిగి ఉన్న తూర్పు కనుమలు విధ్వంసానికి గురవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీజీఆర్ సంస్థ ఆరేళ్లుగా పర్యావరణం కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ సంస్థ జస్టిస్ కుల్దీప్ సింగ్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డును సీజీఆర్ సంస్థ శనివారం ఢిల్లీలో అందుకోనుంది. ఈ సందర్భంగా సంస్థ స్థాపకుడు లక్ష్మారెడ్డి, అధ్యక్షురాలు లీలా లకా్ష్మరెడ్డి, సీఈవో నారాయణరావు, గ్రేస్ సంస్థ చైర్మన్ ఆర్. దిలీప్‌రెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త ప్రొ.పురుషోత్తంరెడ్డి శుక్రవారం ఇక్కడి ఏపీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఆరేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు సీజీఆర్ చేస్తున్న కృషికి క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డు ప్రకటించడం అభినందనీయం. ఈ ఏడాది వ్యక్తిగత అవార్డు విభాగంలో ఏపీ, తెలంగాణ నుంచి ఫ్లోరోసిస్ విమోచనా సమితిని స్థాపించి నల్లగొండ జిల్లాలో విశేష కృషి చేసిన డా.కె.గోవర్దన్‌రెడ్డికి లభించింది’ అని ప్రొ.పురుషోత్తంరెడ్డి తెలిపారు. లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ‘జస్టిస్ కుల్దీప్సింగ్ అవార్డుకు సీజీఆర్‌ను ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ఆరేళ్లుగా సీజీఆర్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా స్కూల్ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నాం. సుమారు ఆరు లక్షల మంది విద్యార్థుల సాయంతో ఇప్పటి వరకు 30 లక్షల మొక్కలు నాటాం. విద్యార్థులు నాటిన మొక్కకి రాఖీ పండుగ రోజున రాఖీ కట్టించడం, మొక్కనాటి ఏడాది పూర్తై దానికి పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. ఈ కృషికి గుర్తింపుగా అవార్డు లభించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. తూర్పు కనుమల పరిరక్షణకు కృషి దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సీజీఆర్ ఆరు సంవత్సరాలుగా చేసిన కృషికి తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర స్థాయిలో ‘హరిత మిత్ర’ అవార్డు ప్రదానం చేసింది. సీజీఆర్ ఆధ్వర్యంలోనే ఐదేళ్ల క్రితం గ్రీన్స్ అలయన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్ట్రన్ ఘాట్స్(గ్రేస్) అనే ఉమ్మడి వేదికను ఏర్పాటు చేశాం. 1,700 కిలోమీటర్ల పరిధిలో బెంగాల్, ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న తూర్పు కనుమల పరిరక్షణకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా అన్ని యూనివర్సిటీల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తూర్పు కనుమల పరిధితో అనుసంధానమై ఉన్న 48 మంది ఎంపీలకు లేఖలు రాశాం. వారందరితో డిసెంబర్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఒక సమావేశాన్ని నిర్వహించి వీటి పరిరక్షణపై చర్చిస్తాం. పశ్చిమ కనుమలను ఏవిధంగా అయితే కేంద్ర ప్రభుత్వం గుర్తించిందో.. అదే విధంగా అపారమైన ఖనిజ, జల, వృక్ష సంపదను కలిగి ఉన్న తూర్పు కనుమలను గుర్తించాలి. దీని కోసం జాతీయ స్థాయిలో ఉద్యమిస్తాం. తూర్పు కనుమలను బయోడైవర్సిటీ హాట్ స్పాట్‌గా ఐక్యరాజ్యసమితి గుర్తించేలా భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలి’ అని కోరారు. -
‘మొక్క’వోని దీక్షకు పట్టం
* ఆరేళ్లుగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ హరితవిప్లవం * అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ ఉద్యమం * ఇప్పటి వరకూ 30 లక్షల మొక్కలు నాటిన సీజీఆర్ సాక్షి, హైదరాబాద్: కనుచూపు మేరలో పచ్చని మొక్కకు నోచక ఎడారి సదృశ్యమవుతున్న పల్లెలు.. వానలు లేక బీడువారిన పంట పొలాలు.. అడుగంటిన భూగర్భ జలాలు.. వారిని కదిలించి కర్తవ్యాన్ని ప్రబోధించాయి. రోజురోజుకూ అంతరించిపోతున్న అడవులు, వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య ప్రతికూల పరిస్థితుల నుంచి భావి తరాలను కాపాడేందుకు గుప్పెడు మంది నడుం కట్టారు. పల్లెలు.. పట్టణాలు.. నగరాల్లో తరిగిపోతున్న వనాలను పెంచి ముంచుకొస్తున్న ముప్పును అధిగమించేందుకు ఆరేళ్ల క్రితం ఉద్యమ బాట పట్టారు. 2010లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్) పేరిట సంస్థను ఏర్పాటు చేసి హరిత విప్లవానికి నాంది పలికారు. పర్యావర ణ ప్రియులు కె.లక్ష్మారెడ్డి సార థ్యంలో ఆవిర్భవించిన సీజీఆర్ సంస్థ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే చేపడుతున్న హరితహారం వంటి కార్యక్రమాలను నాలుగైదేళ్ల క్రితమే చేపట్టి సుమారు 30 లక్షల మొక్కలను నాటింది. వాటిలో 70 శాతానికిపైగా మొక్కలను పెంచి మహావృక్షాలుగా తీర్చిదిద్దింది. వినూత్న కార్యక్రమాలు.. సీజీఆర్ ఈ ఆరేళ్లలో 9.23 లక్షల మంది విద్యార్థులను ఉద్యమ భాగస్వాములుగా తీర్చిదిద్ది.. 31.98 లక్షల మొక్కలను నాటింది. ప్రతి విద్యార్థి తాను నాటిన మొక్కలను తానే సంరక్షించేలా విస్తృత చర్యలు చేపట్టింది. ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి, శ్రీశైలం టైగర్స్ ప్రాజెక్టు కన్జర్వేటర్‌గా పనిచేసిన తులసీరావు, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీంద్ర వంటి ప్రముఖులు ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన హరిత హారంలో 2 లక్షల మంది విద్యార్థులతో కలసి హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ‘వనచైతన్య యాత్ర’, ‘హరితగ్రామం’, ‘ప్రకృతి-సంస్కృతి’, ‘స్మృతివనం’ వంటి వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టింది. ఏటా రక్షాబంధన్ వేడుకలను వృక్షాబంధన్‌గా నిర్వహిస్తున్నారు. ‘నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష’ అనే స్ఫూర్తితో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యార్థి తన పుట్టినరోజున ఓ మొక్కను నాటుతాడు. పిల్లలతో పాటే మొక్కలకు సైతం పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు. తూర్పు కనుమల పరిరక్షణకు ‘గ్రేస్’... గ్రీన్స్ అలయన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్(గ్రేస్). తూర్పు కనుమల పరిరక్షణ సమితి. 2011 జూలై 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీజీఆర్ అనుబంధ సంస్థగా గ్రేస్‌ను ఏర్పాటు చేశారు. పర్యావరణ నిపుణులు, మేధావు లు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు గ్రేస్‌లో భాగస్వాములు. సీనియర్ పాత్రికేయులు దిలీప్‌రెడ్డి గ్రేస్‌కు చైర్మన్. తూర్పు కనుమలు విస్తరించి ఉన్న 1,700 కిలోమీటర్ల పరిధిలో ఘాట్లు, అడవులు, వనరులు, నదులు, వన్యప్రాణుల సంరక్షణ గ్రేస్ లక్ష్యం. కాగా, సీజీఆర్ కృషి బాలలకు పాఠ్యాంశమైంది. ఐదో తరగతి లోని ‘మనం-మన పరిసరాలు’ పుస్తకం లో ఈ అంశాన్ని చేర్చి బోధిస్తున్నారు. ఈ కృషి ఫలితమే ఈ ఏడాది ప్రతిష్టాత్మక జస్టి స్ కుల్దీప్సింగ్ అవార్డు వరించింది. -
చెరువు కబ్జాలపై ఉక్కుపాదం
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సెమినార్లో మంత్రి హరీశ్‌రావు చెరువులకు కొత్త రూపునిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో కబ్జాలకు గురైన చెరువులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని, కబ్జాదారులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ‘మిషన్ కాకతీయ’లో భాగంగా పారిశ్రామీకరణ వల్ల కాలుష్యంతో నిం డిన చెరువులను పునరుద్ధరించడం ద్వారా కొత్తరూపునిస్తామని వెల్లడించారు. ఆదివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కృష్ణా, గోదావరిలో ఉన్న పూర్తిస్థాయి కేటాయింపులను వినియోగించుకొని రాష్ట్రంలోని 46 వేల చెరువులను నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చెరువు నీటిని ఒడిసిపట్టగలిగితే గ్రామంలోని అన్ని కులాలకు పని దొరుకుతుందని, అదే జరిగితే సుస్ధిర సమగ్రాభివృధ్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. చెరువుల అభివృద్ధితోపాటే హరితహారం పేరిట చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి పారిశ్రామిక వర్గాలు సహకరించాలన్నారు. మిషన్ కాకతీయలో అన్ని జిల్లాలను చేర్చి హైదరాబాద్‌ను విస్మరించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్‌శాఖతో చెరువులను పునరుద్ధరించాలని సూచించారు. ఇదే సమయంలో పర్యావరణ సమతౌల్యత పాటించేం దుకు వీలుగా అడవులు తక్కువగా ఉన్న నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింతగా చేపట్టాలన్నారు. చెరువుల పునరుద్ధరణ జరగాల్సిన తీరు, భూగర్భ జల రక్షణ, జల భద్రత, జల కాలుష్యంపై వంటి అంశాలపై పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, మరో పర్యావరణవేత్త సుబ్బారావు, సీపీఎం ప్రతినిధి వరప్రసాద్, సీపీఐ ప్రతినిధి నరసింహా రావు, సోల్ సంస్థ కన్వీనర్ లుగ్నా, సాక్షి రెసిడెంట్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి ఈ సెమినార్లో ప్రసంగించగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ అధ్యక్షురాలు కె.లీలా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సింహారెడ్డి, గేయ రచయిత అంద్శైపాల్గొన్నారు. -
ఆమె లక్ష్యం కోటికి చేరింది!
పర్యావరణం మనం నాటిన మొక్క నాలుగు చిగుర్లు వేయగానే మనకు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. ఆ ఆనందానికి ఆశయం తోడైతే ఊరంతటినీ ఉద్యానం చేసుకోవచ్చు. అలాంటి ఆలోచనతోనే కె లీలా లక్ష్మారెడ్డి ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్’ని స్థాపించారు. ప్రకృతిని కాపాడుకోవడానికికంటే గొప్ప సేవ మరొకటి లేదంటున్న ఆమెను పలకరిస్తే మన మనసులో ఒక మంచి ఆలోచన చిగురిస్తుంది. నాలుగేళ్లక్రితం లక్ష మొక్కల లక్ష్యంతో బయలుదేరిన లీలా లక్ష్మారెడ్డి ప్రస్తుతం ఇరవైలక్షల దగ్గర తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కోటి మొక్కలు నాటాలన్న కొత్త ఆశయంతో ముందుకు నడుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిలార్పల్లి గ్రామానికి వెళితే పచ్చని పల్లెని చూడొచ్చు. ఒక ఇంట్లో ఐదు చెట్లకు తక్కువగా ఉండవు. ఆ ఊళ్లో ఏ యువకుడికైనా ఉద్యోగం వచ్చిందంటే...ముందు చేసే పని...ఓ చెట్టును కొనడం. ఎవరైనా డబ్బులకోసం చెట్లను అమ్మేస్తుంటే అడ్డుపడి ఆ చెట్టును కొని దత్తత తీసుకుంటారన్నమాట. అంతేకాదు...అక్కడ ఎవరింటి మొక్కకు వారే నీళ్లు పోయాలని ఏమీ లేదు. ఏ కుర్రాడికైనా వాడిన మొక్క కనిపించిందంటే చాలు...వెంటనే నీళ్లు పోసేస్తారు. మొక్కలకీ, యువకులకీ ఉన్న బంధమేమిటంటారా? ‘హరిత విప్లవం’ పేరిట ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్’ ఏర్పరచిన అనుబంధం అది. ఇలాంటి అనుబంధం రాష్ట్రవ్యాప్తంగా వంద గ్రామాల్లో కనిపిస్తుంది. పంచ సూత్రాలతో పదిమందిని భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటే ఉద్యమం చేపట్టిన ఆ సంస్థ వ్యవస్థాపకురాలు కె లీలా లక్ష్మారెడ్డి మాటల్లో చెప్పాలంటే మరో పదికాలాలపాటు పుడమి పచ్చగా ఉండాలంటే మొక్కలు నాటాల్సిందే అంటారామె. ‘‘నాలుగేళ్లక్రితం మా అత్తగారు చనిపోయినపుడు మొదటి మొక్కను నాటాను. అదే చేత్తో ఈ సంస్థను కూడా స్థాపించాను. ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తేగాని నా లక్ష్యం నెరవేరదనుకుని ఐదు మార్గాలను ఎంచుకున్నాను’’ అని చెప్పారామె. మొక్కకు పుట్టినరోజు... మొదట రంగారెడ్డి జిల్లా శివార్లలోని ఓ పది పాఠశాలల విద్యార్థులతో మొదలైన ఈ ఉద్యమం ప్రస్తుతం 1350 పాఠశాలలకు చేరింది. ఈ పాఠశాలల్లోని విద్యార్థులంతా కలిసి గత నాలుగేళ్లలో 3, 23, 980 మొక్కలు నాటారు. ఐదు మొక్కలు...రెండు పండ్ల మొక్కలు, మూడు నీడ మొక్కల్ని పాతి వాటిని పెద్దయ్యేవరకూ పెంచడం ప్రతి విద్యార్థి బాధ్యతన్నమాట. దీనికి ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్’సంస్థవాళ్లు పెట్టిన పేరు ‘వన ప్రేరణ’. ఇక్కడ విద్యార్థులు మొక్కలునాటి వదిలేయరు. ఏటా వాటికి పుట్టినరోజులు చేస్తారు. వారి మొక్కల పెరుగుదలకు సంబంధించి రికార్డులు కూడా తయారుచేస్తారు. మొక్కల్ని చక్కగా పెంచిన విద్యార్థులకు ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్’వారు సర్టిఫికెట్లు ఇవ్వడం ఇక్కడ మరో ప్రత్యేకత. ఒకేరోజు పదిలక్షల మొక్కలు... హరిత విప్లవం, వన ప్రేరణతో పాటు స్మృతివనం, ప్రకృతి- సంస్కృతి, తూర్పు కనుమల సంరక్షణ...అంటూ మరో మూడు ప్రత్యేక కార్యక్రమాలద్వారా ప్రత్యేక దినాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ త్వరగా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థవారు. ‘‘ 2012లో మెదక్‌లో ఒకే రోజున 10 లక్షల మొక్కలు నాటించాం. ఇందులో 503 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మనిషికి ఐదు మొక్కల చొప్పున పాఠశాలల్లో, వీధుల్లో, రహదారుల వెంట సుడిగాలి తిరిగినట్టు తిరుగుతూ పది లక్షల మొక్కలు నాటించాం. అలాంటి రోజులు మళ్లీ మళ్లీ వస్తే చూస్తుండగానే మన చుట్టూ ఉన్న వాతావరణ పచ్చగా మారిపోతుంది’’ అంటూ ఎంతో సంతోషంగా చెప్పారు లీల. ఓ జ్ఞాపకం... మన సంస్కృతి: పెద్దవాళ్లు చనిపోయినపుడు రకరకాల దానధర్మాలు చేస్తుంటారు. వాటితోపాటు వారి స్మృతిగా ఒక మొక్క నాటితే పచ్చని జ్ఞాపకం మన ముందు ఉంటుంది అంటారు లీలా లక్ష్మారెడ్డి. ‘‘స్మృతివనం కోసం రోజు వార్తాపత్రికల్లో వచ్చే ‘శ్రద్ధాంజలి’ ప్రకటనలను చూసి వారికి ఫోన్ చేసి మాట్లాడుతాం. ఇష్టమైనవారు మొక్కలు నాటుతున్నారు. మరికొందరు మొక్కలకయ్యే ఖర్చుకు ఆర్థికసాయం చేస్తున్నారు. ఇక ‘ప్రకృతి-సంస్కృతి’ పేరుతో నాటే మొక్కల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. దసరా పండగపుడు జమ్మి మొక్కలు, కార్తికమాసంలో ఉసిరి, మారేడు, తులసి మొక్కలు నాటిస్తున్నాం. అంతే కాకుండా ప్రత్యేక దినాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’ అని చెప్పారామె. మాయమవుతున్న కొండలు... తూర్పు కనుమల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా మాయమైపోతున్న పర్వతాలు, కొండలపై దృష్టి పెట్టింది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ‘‘శ్రీశైలం, తిరుపతి, సింహాచలం, మల్లాద్రి... ఇలా ముఖ్యమైన పర్వతాలు, కొండలు కూడా పచ్చదనం నుంచి దూరమైపోతున్నాయి. కొండల్ని, గుట్టల్ని ఆక్రమించేసి ఇళ్ళు కట్టేయడం వల్ల పచ్చదనం కరవైపోవడంతో పాటు వాతావరణం మొత్తం కలుషితమైపోతోంది. ఈ సమస్యపై మేం ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఆయా కలెక్టర్లతో మాట్లాడి పర్వతాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేక కౌన్సెలింగ్‌లు ఇస్తున్నాం’’ అని చెప్పారు లీలా లక్ష్మారెడ్డి. ఇలా మొక్కలు నాటుతూ పుడమిని పచ్చగా ఉంచడం కోసం పాటు పడుతోన్న ఈ సంస్థ లక్ష్యం నెరవేరాలని కోరుకుందాం. పుస్తకంలో ‘పాఠం’గా... గత ఏడాది ప్రచురించిన 5వ తరగతి సామాన్యశాస్త్రంలో ‘మనం చెట్లను పెంచుదాం’ అనే పాఠం చదివితే ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్’ గురించి తెలుస్తుంది. 2010 ఏప్రిల్‌లో మొదలైన ఈ సంస్థ తన మునుపటి లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు కోటి మొక్కల కొత్త లక్ష్యాన్ని చేరుకోవడం కోసం పనిచేస్తున్న తీరును వివరిస్తూ, అందులో విద్యార్థుల భాగస్వామ్యం గురించి చెబుతూ ఎంతో ఆసక్తిగా సాగుతుంది ఆ పాఠం.