చెరువు కబ్జాలపై ఉక్కుపాదం
- కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సెమినార్‌లో మంత్రి హరీశ్‌రావు
- చెరువులకు కొత్త రూపునిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో కబ్జాలకు గురైన చెరువులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని, కబ్జాదారులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ‘మిషన్ కాకతీయ’లో భాగంగా పారిశ్రామీకరణ వల్ల కాలుష్యంతో నిం డిన చెరువులను పునరుద్ధరించడం ద్వారా కొత్తరూపునిస్తామని వెల్లడించారు. ఆదివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కృష్ణా, గోదావరిలో ఉన్న పూర్తిస్థాయి కేటాయింపులను వినియోగించుకొని రాష్ట్రంలోని 46 వేల చెరువులను నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చెరువు నీటిని ఒడిసిపట్టగలిగితే గ్రామంలోని అన్ని కులాలకు పని దొరుకుతుందని, అదే జరిగితే సుస్ధిర సమగ్రాభివృధ్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. చెరువుల అభివృద్ధితోపాటే హరితహారం పేరిట చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి పారిశ్రామిక వర్గాలు సహకరించాలన్నారు.
మిషన్ కాకతీయలో అన్ని జిల్లాలను చేర్చి హైదరాబాద్‌ను విస్మరించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో మున్సిపల్‌శాఖతో చెరువులను పునరుద్ధరించాలని సూచించారు. ఇదే సమయంలో పర్యావరణ సమతౌల్యత పాటించేం దుకు వీలుగా అడవులు తక్కువగా ఉన్న నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింతగా చేపట్టాలన్నారు.
చెరువుల పునరుద్ధరణ జరగాల్సిన తీరు, భూగర్భ జల రక్షణ, జల భద్రత, జల కాలుష్యంపై వంటి అంశాలపై పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, మరో పర్యావరణవేత్త సుబ్బారావు, సీపీఎం ప్రతినిధి వరప్రసాద్, సీపీఐ ప్రతినిధి నరసింహా రావు, సోల్ సంస్థ కన్వీనర్ లుగ్నా, సాక్షి రెసిడెంట్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి ఈ సెమినార్‌లో ప్రసంగించగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ అధ్యక్షురాలు కె.లీలా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సింహారెడ్డి, గేయ రచయిత అంద్శైపాల్గొన్నారు.