పది రోజుల్లో 4వేల చెరువులకు పరిపాలనా అనుమతులే లక్ష్యం అనుమతులు లభించినవి 480 చెరువులు మాత్రమే అనుమతుల కోసం ఆర్థిక శాఖ వద్ద మరో 678 చెరువుల అంచనాలు నేటి నుంచి పుంజుకోనున్న ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం ఆరంభానికి ఓ పక్క గడువు ముంచుకొస్తుం డగా, మరో పక్క ముందుకు కదలని పనులు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. తొలి ఏడాది పునరుద్ధరించనున్న తొమ్మిది వేల చెరువుల్లో సగానికిపైగా పనులను జనవరి మూడో వారంలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఇప్పటివరకు కేవలం ఐదు వందల చెరువులకు మాత్రమే పరిపాలనా అనుమతు లు లభించడం, ఇంకా చాలా పనులు పెండిం గ్‌లో ఉండటం చిన్న నీటి పారుదల శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
పనుల సర్వే పూర్తయిన వాటికి, పరిశీలన(స్క్రూటినీ) పూర్తికాకపోవడం, పరిశీలన పూర్తయిన వాటికి పరిపాలనా అనుమతులు లభించకపోవడం, అనుమతులు లభించిన వాటికి టెండర్లు పిలవకపోవడం ఆ శాఖను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పది రోజుల్లో సగానికి పైగా చెరువుల పనులను ప్రారంభించాలని భావిస్తున్న ప్రభుత్వం అధికారుల సెలవు దినాలను సైతం కత్తరించి ప్రక్రియను వేగిరం చేసేలా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.
ఆటంకాలు అనేకం..
సమగ్ర చెరువుల సర్వే ద్వారా గుర్తించిన 46,531 చెరువుల్లో ప్రస్తుత ఏడాది 9,305 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ మూడోవారం నుంచే పనులను ప్రారంభించి జూన్‌లో వ ర్షాలు కురిసే సమయానికి పునరుద్ధరణ ప్రక్రియ ముగించాలని అంచనాలు సిద్ధం చేసుకుంది. అయితే పనుల అంచనాలు, పరిశీలన, పనుల అనుమతుల ఆమోదంలో జరిగిన ఆలస్యం మొత్తం ప్రక్రియనే జాప్యం చేసింది.
అదీగాక అడ్డదిడ్డంగా వచ్చిన పనుల అంచనాలను పునఃపరిశీలన చేయాల్సి రావడం సైతం ప్రక్రియ జాప్యానికి కారణమైంది. ఇప్పుడు కూడా నీటిపారుదల శాఖ రాష్ట్ర కార్యాలయానికి చేరిన మొత్తం అంచనాల్లో 213 అంచనాలను తిరిగి సూపరింటెండెంట్ ఇంజనీర్ పరిశీలనకు తిప్పిపంపారు. ఈ కారణాల దృష్ట్యా ఇప్పటివరకు కేవలం 1,158 చెరువుల అంచనాలు మాత్రమే అన్ని దశలు దాటుకొని పరిపాలనా అనుమతుల కోసం ఆర్థిక శాఖను చేరాయి.
ఇందులో రూ.190.17కోట్ల విలువ ఉన్న 480 చెరువుల పనులకు మాత్రం ఆమోదం లభించగా, మరో 678 చెరువుల అంచనాలు ఇంకా ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. ఇక చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలకు రూ.1,076కోట్ల అంచనా వ్యయంతో చేరిన 2,036 చెరువుల పనులను పూర్తిస్థాయిలో స్క్రూటినీ చేయాల్సి ఉండగా, స్క్రూటినీ చేసిన మరో రూ.880.33కోట్ల అంచనాలతో కూడిన 1,729 చెరువు పనుల నివేదికను ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంది.
ఇలా ఒకదానితో ఒకటి ముడిపడిఉన్న ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి జనవరి మూడో వారానికి సుమారు 4వేల చెరువుల పనులను ఆరంభించాలని భావిస్తున్నారు. మొదటగా పరిపాలనా ఆమోదం దక్కిన చెరువులకు టెండర్ల ప్రక్రియలో ఇదివరకున్న 15 రోజుల గడువును వారం రోజులకు కుదించి ప్రక్రియ ముగించేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు.
ఇప్పటికే దీనిపై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రత్యేకంగా అధికారులతో అనునిత్యం సమావేశాలు నిర్వహిస్తూ పనుల్లో వేగం పెం చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఆర్థిక శాఖకు చేరుతున్న అంచనాలకు వెంటనే అనుమతులు లభించేలా సచివాలయంలో ప్రత్యేక లైజనింగ్ అధికారిని నియమించి పర్యవేక్షణ చేస్తున్నారు. సోమవారం నుంచి మిషన్ కాకతీయ పనులు మరింత వేగంగా జరుగుతాయని, అవసరమైతే ఆదివారాలు, సంక్రాంతి సెలవు దినాల్లోనూ అధికారులు తమ విధులను కొనసాగిస్తారని నీటి పారుదల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
‘కాకతీయ’కు ముంచుకొస్తున్న గడువు!
Published Mon, Jan 12 2015 2:31 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement