ఆమె లక్ష్యం కోటికి చేరింది! | save trees and save the nation | Sakshi
Sakshi News home page

ఆమె లక్ష్యం కోటికి చేరింది!

Published Wed, Apr 30 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM

ఆమె లక్ష్యం కోటికి చేరింది!

ఆమె లక్ష్యం కోటికి చేరింది!

 పర్యావరణం

మనం నాటిన మొక్క నాలుగు చిగుర్లు వేయగానే మనకు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. ఆ ఆనందానికి ఆశయం తోడైతే ఊరంతటినీ ఉద్యానం చేసుకోవచ్చు. అలాంటి ఆలోచనతోనే కె లీలా లక్ష్మారెడ్డి ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్’ని స్థాపించారు. ప్రకృతిని కాపాడుకోవడానికికంటే గొప్ప సేవ మరొకటి లేదంటున్న ఆమెను పలకరిస్తే మన మనసులో ఒక మంచి ఆలోచన చిగురిస్తుంది. నాలుగేళ్లక్రితం లక్ష మొక్కల లక్ష్యంతో బయలుదేరిన లీలా లక్ష్మారెడ్డి ప్రస్తుతం ఇరవైలక్షల దగ్గర తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కోటి మొక్కలు నాటాలన్న కొత్త ఆశయంతో ముందుకు నడుస్తోంది.
 
 మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిలార్‌పల్లి గ్రామానికి వెళితే పచ్చని పల్లెని చూడొచ్చు. ఒక ఇంట్లో ఐదు చెట్లకు తక్కువగా ఉండవు. ఆ ఊళ్లో ఏ యువకుడికైనా ఉద్యోగం వచ్చిందంటే...ముందు చేసే పని...ఓ చెట్టును కొనడం. ఎవరైనా డబ్బులకోసం చెట్లను అమ్మేస్తుంటే అడ్డుపడి ఆ చెట్టును కొని దత్తత తీసుకుంటారన్నమాట. అంతేకాదు...అక్కడ ఎవరింటి మొక్కకు వారే నీళ్లు పోయాలని ఏమీ లేదు. ఏ కుర్రాడికైనా వాడిన మొక్క కనిపించిందంటే చాలు...వెంటనే నీళ్లు పోసేస్తారు. మొక్కలకీ, యువకులకీ ఉన్న బంధమేమిటంటారా? ‘హరిత విప్లవం’ పేరిట ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్’ ఏర్పరచిన అనుబంధం అది. ఇలాంటి అనుబంధం రాష్ట్రవ్యాప్తంగా వంద గ్రామాల్లో కనిపిస్తుంది. పంచ సూత్రాలతో పదిమందిని భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటే ఉద్యమం చేపట్టిన ఆ సంస్థ వ్యవస్థాపకురాలు కె లీలా లక్ష్మారెడ్డి మాటల్లో చెప్పాలంటే మరో పదికాలాలపాటు పుడమి పచ్చగా ఉండాలంటే మొక్కలు నాటాల్సిందే అంటారామె. ‘‘నాలుగేళ్లక్రితం మా అత్తగారు చనిపోయినపుడు మొదటి మొక్కను నాటాను. అదే చేత్తో ఈ సంస్థను కూడా స్థాపించాను. ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తేగాని నా లక్ష్యం నెరవేరదనుకుని ఐదు మార్గాలను ఎంచుకున్నాను’’ అని చెప్పారామె.
 
 మొక్కకు పుట్టినరోజు...
 మొదట రంగారెడ్డి జిల్లా శివార్లలోని ఓ పది పాఠశాలల విద్యార్థులతో మొదలైన ఈ ఉద్యమం ప్రస్తుతం 1350 పాఠశాలలకు చేరింది. ఈ పాఠశాలల్లోని విద్యార్థులంతా కలిసి గత నాలుగేళ్లలో 3, 23, 980 మొక్కలు నాటారు. ఐదు మొక్కలు...రెండు పండ్ల మొక్కలు, మూడు నీడ మొక్కల్ని పాతి వాటిని పెద్దయ్యేవరకూ పెంచడం ప్రతి విద్యార్థి బాధ్యతన్నమాట. దీనికి ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్’సంస్థవాళ్లు పెట్టిన పేరు ‘వన ప్రేరణ’. ఇక్కడ విద్యార్థులు మొక్కలునాటి వదిలేయరు. ఏటా వాటికి పుట్టినరోజులు చేస్తారు. వారి మొక్కల పెరుగుదలకు సంబంధించి రికార్డులు కూడా తయారుచేస్తారు. మొక్కల్ని చక్కగా పెంచిన విద్యార్థులకు ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్’వారు సర్టిఫికెట్లు ఇవ్వడం ఇక్కడ మరో ప్రత్యేకత.
 
 ఒకేరోజు పదిలక్షల మొక్కలు...
 హరిత విప్లవం, వన ప్రేరణతో పాటు స్మృతివనం, ప్రకృతి- సంస్కృతి, తూర్పు కనుమల సంరక్షణ...అంటూ మరో మూడు ప్రత్యేక కార్యక్రమాలద్వారా ప్రత్యేక దినాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ త్వరగా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థవారు. ‘‘ 2012లో మెదక్‌లో ఒకే రోజున 10 లక్షల మొక్కలు నాటించాం. ఇందులో 503 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మనిషికి ఐదు మొక్కల చొప్పున పాఠశాలల్లో, వీధుల్లో, రహదారుల వెంట సుడిగాలి తిరిగినట్టు తిరుగుతూ పది లక్షల మొక్కలు నాటించాం. అలాంటి రోజులు మళ్లీ మళ్లీ వస్తే చూస్తుండగానే మన చుట్టూ ఉన్న వాతావరణ పచ్చగా మారిపోతుంది’’ అంటూ ఎంతో సంతోషంగా చెప్పారు లీల.
 
 ఓ జ్ఞాపకం... మన సంస్కృతి: పెద్దవాళ్లు చనిపోయినపుడు రకరకాల దానధర్మాలు చేస్తుంటారు. వాటితోపాటు వారి స్మృతిగా ఒక మొక్క నాటితే పచ్చని జ్ఞాపకం మన ముందు ఉంటుంది అంటారు లీలా లక్ష్మారెడ్డి. ‘‘స్మృతివనం కోసం రోజు వార్తాపత్రికల్లో వచ్చే ‘శ్రద్ధాంజలి’ ప్రకటనలను చూసి వారికి ఫోన్ చేసి మాట్లాడుతాం. ఇష్టమైనవారు మొక్కలు నాటుతున్నారు. మరికొందరు మొక్కలకయ్యే ఖర్చుకు ఆర్థికసాయం చేస్తున్నారు. ఇక ‘ప్రకృతి-సంస్కృతి’ పేరుతో నాటే మొక్కల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. దసరా పండగపుడు జమ్మి మొక్కలు, కార్తికమాసంలో ఉసిరి, మారేడు, తులసి మొక్కలు నాటిస్తున్నాం. అంతే కాకుండా ప్రత్యేక దినాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’ అని చెప్పారామె.
 
 మాయమవుతున్న కొండలు...
 తూర్పు కనుమల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా మాయమైపోతున్న పర్వతాలు, కొండలపై దృష్టి పెట్టింది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ‘‘శ్రీశైలం, తిరుపతి, సింహాచలం, మల్లాద్రి... ఇలా ముఖ్యమైన పర్వతాలు, కొండలు కూడా పచ్చదనం నుంచి దూరమైపోతున్నాయి. కొండల్ని, గుట్టల్ని ఆక్రమించేసి ఇళ్ళు కట్టేయడం వల్ల పచ్చదనం కరవైపోవడంతో పాటు వాతావరణం మొత్తం కలుషితమైపోతోంది.
 ఈ సమస్యపై మేం ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఆయా కలెక్టర్లతో మాట్లాడి పర్వతాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేక కౌన్సెలింగ్‌లు ఇస్తున్నాం’’ అని చెప్పారు లీలా లక్ష్మారెడ్డి. ఇలా మొక్కలు నాటుతూ పుడమిని పచ్చగా ఉంచడం కోసం పాటు పడుతోన్న ఈ సంస్థ లక్ష్యం నెరవేరాలని కోరుకుందాం.
 
 పుస్తకంలో ‘పాఠం’గా...

 గత ఏడాది ప్రచురించిన 5వ తరగతి సామాన్యశాస్త్రంలో ‘మనం చెట్లను పెంచుదాం’ అనే పాఠం చదివితే ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్’ గురించి తెలుస్తుంది. 2010 ఏప్రిల్‌లో మొదలైన ఈ సంస్థ తన  మునుపటి లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు కోటి మొక్కల కొత్త లక్ష్యాన్ని చేరుకోవడం కోసం పనిచేస్తున్న తీరును వివరిస్తూ, అందులో విద్యార్థుల భాగస్వామ్యం గురించి చెబుతూ ఎంతో ఆసక్తిగా సాగుతుంది ఆ పాఠం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement