తెరపైకి మరో విద్యుత్ వివాదం
* సీజీఎస్ కోటాను సవరించండి! కేంద్రానికి ఏపీ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాలు మరింతగా రాజుకుంటున్నాయి. మొన్నటివరకు ఏపీజెన్కో ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తామే వినియోగించుకుంటామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... తాజాగా కేంద్ర విద్యుత్ ప్లాంట్ల (సీజీఎస్) కోటా కేటాయింపుల్లో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ కార్యదర్శి తాజాగా లేఖ రాశారు.
‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గత ఐదు సంవత్సరాల వినియోగం ఆధారంగా ఇరు రాష్ట్రాలకు సీజీఎస్ కోటాను పంపిణీ చేయాలని ఉంది. గత ఐదేళ్ల వినియోగం ఆధారంగా లెక్కిస్తే ఆంధ్రప్రదేశ్‌కు వాస్తవానికి 47.88 శాతం విద్యుత్ రావాల్సి ఉంటుంది. అయితే, జీవో నంబరు 20 ప్రకారం ఇరు రాష్ట్రాలకు సీజీఎస్ కోటాను పంపిణీ చేశారు. దీంతో తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ కోటాను పంపిణీ చేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ 1.77 శాతం వాటాను కోల్పోయింది. దీనిని వెంటనే పునరుద్ధరించండి’ అని ఆ లేఖలో ఆయన కోరారు.
అదేవిధంగా గత ఐదేళ్ల వినియోగం ఆధారంగా పంపిణీ చేయడాన్ని ఈ లేఖలో ఆయన తప్పుపట్టారు. ‘హైదరాబాద్ రాజధాని కావడంతో కోతలు లేకుండా సరఫరా చేసేందుకు అధిక విద్యుత్‌ను ఇచ్చారు. తద్వారా తెలంగాణలో అధిక వినియోగం నమోదయ్యింది. ఐదేళ్ల వినియోగం ఆధారంగా కోటాను కేటాయించినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు అధిక విద్యుత్ కోటా రావాలి. ఈ మేరకు కూడా తాజా కేటాయింపుల్లో రాలేదు’ అని ఈ లేఖలో ఆయన వివరించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) రద్దు గొడవ దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ (ఎస్ఆర్పీసీ) జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర విద్యుత్ శాఖ పరిశీలనలో ఉంది. దీనిపై కేంద్రం నుంచి ఇంకా నిర్ణయం రాకముందే మరో వివాదాన్ని ఆంధ్రప్రదేశ్ లేవనెత్తింది.