CH vidya sagar rao
-
ఆ సిద్ధాంతాల అవసరం ఇప్పుడే ఎక్కువ!
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ జరగబోవడం... రాష్ట్ర, దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకోనుంది. ప్రపంచ మేధావులను, ఆధ్యాత్మికవేత్తలను, పండితులను ఆలోచింపచేస్తుంది. పరంపరాగతమైన భారతీయ తాత్విక చింతన గురించి మరొకసారి విశ్లేషణలు వెల్లివిరుస్తాయి. ఈ మధ్యన జీయర్‌స్వామి రాష్ట్రపతి, ప్రధానమంత్రులను కలసి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించడంతో ఈ కార్యక్రమం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. రామానుజాచార్యుల బోధనల అవసరం వేయి సంవత్సరాల క్రితం సమాజానికి ఎంత ఉండిందో... ఈ కాలానికి అంతకన్నా ఎక్కువ అవసరమైన పరిస్థితి ఏర్పడ్డది. వారు సశాస్త్రీయంగా బోధించిన సామాజిక సమరసా సిద్ధాంతం అన్ని వర్గాల, మతాలకు చెందిన వారికి శిరోధార్యం. ఆనాడు వారు తీసుకున్న భక్తి గమనము, ఎంతోమంది సాధు సంతులను, ప్రజలను, ముఖ్యంగా రామానంద ద్వారా కబీర్ దాస్‌లాంటి వాళ్లను ప్రభావితం చేసి దేశ సమగ్రతకు, సమైక్యతకు తోడ్పడ్డాయి. ఈ సంప్రదాయానికే చిన జీయర్‌స్వామి కొంత సుగం ధాన్ని, మరికొంత సువర్ణాన్ని పూసి సరళమైన భాషలో, స్పష్టమైన భావాలతో చేసిన ప్రసంగాలతో లక్షలమందిని ఆకర్షించారు. ‘‘నీ తల్లిని ప్రేమించు, ఇతరుల తల్లులను గౌరవించు’’ అన్న చిన్న పదాలు– వర్గాలను, కులాలను, మతాలను కలిపి స్వామీజీ ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు బాట వేసి వేలమందికి విద్య, ఉపాధి పొందే అవకాశాలను కల్పిస్తున్నాయి. మరొకవైపు స్వామి భక్తి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ, సాంస్కృతిక జీవనంలో ఒక కొత్త దనాన్ని తెచ్చాయి. ఈ మధ్యన నిర్వహించిన ఒక సర్వేలో 27 శాతం భారతీయులు – హిందువులలో అత్యధి కంగా 30 శాతం, సిక్కులలో 23 శాతం, ముస్లింలలో 18 శాతం మంది అంటరానితనాన్ని పాటిస్తున్నారని ఎన్సీఏఈఆర్ నివేదికలో చెప్పారు. వివిధ నివేదికలను పూర్తిగా లెక్కలోకి తీసుకోలేకున్నా... అంటరానితనం ఇంకా ఉన్నదనేది నిర్వివాదం. ఆది శంకరుడు, రామానుజుడు, బసవేశ్వరుడు, వివేకా నందుడు, నారాయణగురు, బ్రహ్మనాయుడు లాంటి వారెం దరో మన మనస్సులలో సుప్రతిష్ఠితులు. వీరందరూ కులాల, మతాల వివక్షలను నిర్ద్వంద్వంగా ఖండించారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని ఒకవైపు రాజ్యాంగం నిర్దేశించినా... పరువు హత్యలు సమాజానికి సవాలుగా మారాయి. ఈ మధ్యన సుప్రీం కోర్టు ఈ కులరక్కసిని అంతమొందించటానికి ఆదేశాలు జారీ చేసి, వాటి అమలుకు కార్యాచరణను రూపొందించింది. రాజస్థాన్ ప్రభుత్వమైతే మరణ శిక్షను విధిస్తూ చట్టం చేసింది. కానీ కొందరు మతాంతర వివాహమే మరణ శాసనమని భావిస్తూ బ్రతుకుతున్నారు, మరికొందరు మరణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ‘హిందూ’ అన్నపదం, ఇటు రాజకీయాలలో, చట్టసభలల్లో, సమాజంలో కేంద్ర బిందువుగా మారుతున్నది. హిందూ అన్న పదం సాంస్కృ తిక భావన అని దాదాపు అన్ని వర్గాలు ఆలోచించే శుభ పరిణామాన్ని చూస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్, సాంస్కృతిక జాతీయవాదానికి అనుగుణంగానే 1956లో పెద్ద సంఖ్యలో అనుచరులతో కలసి బౌద్ధమతాన్ని స్వీకరించారు. హిందూ సమాజంలో అమానవీయంగా విలయతాండవం చేసిన అస్పృశ్యత వంటి రుగ్మత లకు నిరసనగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇతర మతాలకు మారవలసిందిగా ఎందరో ఆయనను ప్రలోభ పెట్టారు. అయితే ఈ మతాలకు మారడం అంటే భారతదేశ సంస్కృతి నుండి దూరం కావడమే అనే అద్భుత ప్రకటన చేశారు. దీనికి యావత్ భారతదేశం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాల్సిందే. వివేకానందుడు 1898 జూన్ 10 నాడు తన మిత్రుడు మహమ్మద్ సర్ఫరాజ్ హుసేన్‌కు రాసిన లేఖను డిస్కవరీ ఆఫ్ ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ ఉటంకించారు. ఎంతో విశ్లేషణాత్మకమైన ఉత్తరంలో మన మాతృభూమికి హిందూ, ముస్లిం అనే రెండు గొప్ప మతాల కూడలిలో... వేదాంతం బుద్ధి అయితే, ఇస్లాం శరీరం అని రాశారు. దీన్ని అర్థం చేసుకొని హిందువులు, ముస్లిములు ఐక్యంగా ఉండి మళ్ళీ ఈ దేశ ఉజ్జ్వల భవిష్యత్తును రాబోయే తరాలకు అందించాలని కోరారు. 1995 డిసెంబర్ 11న సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పులో హిందూ అన్న పదానికి సంబంధించిన అయోమయాన్ని తొలగించి స్పష్టమైన తీర్పునిచ్చింది. హిందూ, హిందుత్వ, హిందూయిజం అన్న పదాలకు నిర్దిష్టమయిన అర్థాన్ని చెప్పలేమని, అయితే ఆ పదం నుంచి భారతీయ సంస్కృతీ పరంపరను, వారసత్వ సంపదను వేరుచేసి సంకుచిత మతానికి పరిమితం చేయలేమని, అది ప్రజల జీవన విధానమని స్పష్టం చేసింది. హైదరాబాదులో ఒక సమావేశంలో సాంస్కృతిక జీవన విధానాన్ని సమర్థిస్తూ ఆర్చ్ బిషప్ ఎస్. అరుళప్ప ‘జన్మతః నేను భారతీయుడిని. సంస్కృతిపరంగా నేను హిందువును. విశ్వాసం రీత్యా క్రైస్తవుడిని’ అని హర్షధ్వానాల మధ్యన ప్రకటించారు. స్వామి వివేకానందునికి ఇష్టమైన సూక్తి – ‘‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’’. యువత వేగవంతంగా ముందుకు తీసుకుపోవలసిన స్పూర్తిని రామానుజాచార్యుల వారి విగ్రహావిష్కరణ ఇస్తుందని ఆశిద్దాం. - సీహెచ్ విద్యాసాగర రావు మహారాష్ట్ర మాజీ గవర్నర్ -
‘అశ్రు నయనాలతో బాలుకి నివాళులు’
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు అనే వార్త అటు సెలబ్రిటీలను ఇటు అభిమానులను కంటతడిపెట్టిస్తోంది. తన అద్భుత స్వరంతో ఎన్నో మైమరిపించే పాటలను అందించిన బాలుకి ప్రతి ఒక్కరూ అశ్రునయనాలతో తుది విడ్కోలు పలుకుతున్నారు. ఈ క్రమంలో గాన గంధర్వుడు బాలు అస్తమయం వార్త తనను తీవ్ర ధ్రిగ్భాంతికి గురి చేసిందని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించారు. (బాలుతో చిన్నప్పటి నుంచి పరిచయం: ఉప రాష్ట్రపతి) ‘యావత్ భారతావనికి తన గానామృతంతో మైమరపింపజేసిన బాలు గారి మరణ వార్త విషాదకరం. ఇకపై మీ గొంతు ముగబోతుంది అన్న చేదు వార్త యావత్ భారతావని జీర్ణించుకోలేక పోతుంది.. ఇకపై మీరు పాడిన పాటలు జ్ఞాపకాలలో మిమ్మల్ని చూసుకుంటాం.. అశ్రు నయనాలతో ఆయనకి నివాళి తెలుపుతున్నాను.’ అని ట్వీట్ చేశారు. (బాలు మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి) బాలు గారి లోటు ఎన్నటికీ పూడ్చలేనిది గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం దురదృష్టకరమని మంత్రి హరీష్ రావు తెలిపారు. సినీ లోకానికి వారు చేసిన సేవలు వెలకట్టలేనివని, అనేక భాషలలో పాటలుపాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బాలు గారు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల సానుభూతి తెలియ జేశారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాన్నారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. (బాలు మృతిపై ప్రధాని దిగ్భ్రాంతి ) ఆయన లేరనే వార్త తీవ్రంగా కలచి వేసింది ‘4 దశాబ్దాల కాలంలో 40 వేలకు పైగా పాటలు పాడి గాన గంధర్వుడిగా అనేక మంది అభిమానులను పొందారని మంత్రి తలసాని శ్రీనివస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ‘100కు పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. పాటల దిగ్గజం బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. గాయకుడిగా, నటుడిగా చలనచిత్ర రంగానికి అనేక సేవలు అందించారు. బాలు మృతితో చలనచిత్ర రంగం ఒక ప్రఖ్యాత గాయకుడిని కోల్పోయింది. బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం.’’ అని తెలిపారు. గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. ‘గాయకుడు ఎస్పీ బాలు గారి మరణం అత్యంత బాధాకరం. పాటల ప్రపంచంలో ఆయన గాన గంధర్వుడు. అనేక భారతీయ భాషల్లో పాడిన అద్భుత గాయకుడు. వారి మరణం యావత్తు దేశానికి, పాటల ప్రియులకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ అని పేర్కొన్నారు. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం హాట్ టాపిక్‌గా మారింది. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలసిన మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు రాబోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు అంటే ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌నే కొనసాగిస్తారా? లేదా అధ్యక్ష పదవి ఆశిస్తున్న బండి సంజయ్‌కి ఇస్తారా? అన్న చర్చ జోరందుకుంది. దీనిపై లక్ష్మణ్‌ను వివరణ కోరగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని జాతీయ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. మరోవైపు పార్టీకి పూర్తి స్థాయి సమయం వెచ్చించే అవకాశం లక్ష్మణ్‌కే ఉన్నందున ఆయనకే ఇస్తారన్న చర్చ జరుగుతోంది. సంజయ్‌కి ఇస్తే ఎంపీగా నియోజకవర్గంపై దృష్టి సారించడం కష్టమవుతుందని, కరీంనగర్లో టీఆర్ఎస్ను, మంత్రులను ఎదుర్కొనే సత్తా ఉన్న నేత జిల్లో లేకుండా పోతారని, పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి సారించే పరిస్థితి ఉండదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ పార్టీ కనుక హిందుత్వ ఎజెండాను మాత్రమే ప్రధానంగా తీసుకుంటే సంజయ్‌కే పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇటు మాజీ మంత్రి డీకే అరుణ కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఆమె తన ప్రయత్నాలు ముమ్మ రంచేశారు. ఈ ముగ్గురిలో ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తారన్నది పది రోజుల్లోగా తేలనుంది. మరోవైపు వచ్చే వారం రోజుల్లో 25 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించే అవకాశం ఉందని, ఆ కసరత్తు సాగుతోందని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు -
హైదరాబాద్ దేశ రెండో రాజధాని కావొచ్చు: మాజీ గవర్నర్
హైదరాబాద్ : ఒకానొక సందరర్భంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారనే ఊహాగానాలు కొంతకాలం పాటు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి ప్రతిపాదలేవి కేంద్రం దగ్గర లేవని కేంద్ర మంత్రులు వివరణ ఇవ్వడంతో ఆ పుకార్లకు తెరపడింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అక్కడి ప్రజలు ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కాలుష్య తీవ్ర దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో అక్కడ నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే భారతరత్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నట్టుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని వ్యాఖ్యానించారు. తెలుగు వర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. డా. శ్రీధర్ రెడ్డి రచించిన 'శ్రీధర్ కవితా ప్రస్థానం' అనే కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో విద్యాసాగర్ రావు ప్రసంగిస్తూ ఈ విధంగా స్పందించారు. గతంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పని చేసిన విద్యాసాగర్ రావు ఈ రకమైన కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
బీజేపీలో చేరిన మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు సోమవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభ సమయంలో గవర్నర్‌గా సరైన రీతిలో వ్యవహరించడం తెలుగు వారికి గర్వకారణమని లక్ష్మణ్ అన్నారు. కాగా, తాను మళ్లీ పార్టీలో చేరడం మరపురాని సంఘటన అని విద్యాసాగర్‌రావు అన్నారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేత
సాక్షి, ముంబై: గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్‌రావును తోపులాటకు ఘటనలో సస్పెండైన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎట్టకేలకు ఊరల లభించింది. వారిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ హరీభావ్ బాగ్డే మంగళవారం ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత నవంబరు 12వ తేదీన జరిగిన మొదటిరోజు సమావేశానికి హాజరయ్యేందుకు గవర్నర్ వచ్చారు. అక్కడే అసెంబ్లీ హాలు మెట్లపై కూర్చున్న కొందరు శివసేన ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావ్...చలే జావ్ అంటూ గట్టిగా నినదిం చారు. మరికొందరు ఆయన కారును అడ్డుకున్నారు. ఎట్టకేలకు కారు దిగి లోపలికి వస్తుండగా గవర్నర్‌ను కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చుట్టుముట్టడంతో అది తోపులాటకు దారితీసింది. ఈ తోపులాటలోఆయన చేతికి స్వల్ప గాయమైంది. ఈ ఘటనకు బాధ్యులైన వీరేంద్ర జగ్తాప్, రాహుల్ బోంద్రే, జైకుమార్ గోరే, అబ్దుల్ సత్తార్, అమర్ కాళేలపై అప్పట్లో సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం జరిగిన సమావేశంలో వారిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కొందరు కాంగ్రెస్ సభ్యులు బాగ్డేను కోరారు. అందరి అభిప్రాయాలను సేకరించిన తరువాత సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా రాధాకృష్ణ సాక్షి, ముంబై: శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు రాధాకృష్ణ విఖే పాటిల్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని నాగపూర్‌లో శాసనసభలో మంగళవారం స్పీకర్ హరీభావు బాగ్డే ప్రకటించారు. విధానమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్సీపీకి చెందిన ధనంజయ్ ముండే సోమవారం ఎంపికైన విషయం తెలిసిందే. ఎట్టకేలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన రెం డు వారాలకు ఉభయ సభలకు ప్రతిపక్ష నాయకులు లభించారు. బుధవారం ఈ సమావేశాలు ముగియనున్నాయి. కాగా ప్రతిపక్ష నాయకుడిగా విఖే పాటిల్ పేరు ప్రకటించగానే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన గ్రూపు నాయకుడు, మంత్రి ఏక్‌నాధ్ షిండే, ఎన్సీపీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, సీనియర్ నాయకుడు గణపత్రావ్ దేశ్‌ముఖ్ తదితరులు ఆయనను అభినందించారు. ఇదిలాఉండగా ప్రతిపక్ష పదవి కోసం ఎన్సీపీ తరఫున ఆర్.ఆర్.పాటిల్ పేరు సిఫారసు చేశారు. ఈ విషయమై న్యాయసలహా తీసుకున్న స్పీకర్ వెంటనే విఖే పాటిల్ పేరు ఖరారు చేశారు. తరువాత ఆయన పేరు అధికారికంగా ప్రకటించగానే శాసనసభా మందిరం చప్పట్లతో మార్మోగింది. ఈ సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పదవి కీలక మని, దీన్ని విఖే పాటిల్ సమర్ధంగా నిర్వర్తిస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి వివాదాలకు తావీయకుండా తాను కూడా పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా విఖేపాటిల్ హామీ ఇచ్చారు. కాగా విఖే పాటిల్ పేరు ఖరారు కావడంతో అహ్మద్‌నగర్ జిల్లా నాయకుడికి మరో పదవి దక్కినట్లయింది. -
మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని
మరో మూడు రాష్ట్రాలకూ కొత్త గవర్నర్లు న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంళవారం ఆదేశాలు జారీచేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగర్‌రావును, రాజస్థాన్ గవర్నర్‌గా కల్యాణ్ సింగ్‌ను, కర్ణాటక గవర్నర్‌గా వజూభాయ్ వాలాను, గోవా గవర్నర్‌గా మృదు లా సిన్హా నియమితులయ్యారు. గవర్నర్ల నియామకానికి కేంద్రం ప్రతిపాదించిన పేర్లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితుడైన తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు కరీంనగర్ జిల్లా కు చెందిన నేత. గత ఎన్డీఏ హయాంలో వాజ్‌పేయి కేబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్ గవర్నర్‌గా నియమితుడైన సీనియర్ బీజేపీ నేత 82 సంవత్సరాల కల్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారు. కర్ణాటక కొత్త గవర్నర్ 76ఏళ్ల వజూభాయ్ వాలా గుజరాత్ బీజేపీ సీనియర్ నేత. ఇక గోవా గవర్నర్‌గా నియమితురాలైన మృదుల సిన్హా బీజేపీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు. మహారాష్ట్ర గవర్నర్ శంకర నారాయణన్ రాజీనామా, రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వా కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ పదవీ విరమణ కావటం, గోవా గవర్నర్ పదవినుంచి వైదొలగిన వీబీ వాంచూల స్థానాల్లో వీరు నియమితులయ్యారు. షీలా దీక్షిత్ రాజీనామా కేరళ గవర్నర్ పదవికి షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను ఢిల్లీలో కలుసుకున్న మరుసటిరోజునే షీలా దీక్షిత్ రాజీనామా సమర్పించారు. ఆమె రాజీనామా లేఖను రాష్ట్రపతి సచివాలయం కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. తాను సోమవారమే రాజీనామాచేశానని, దీనిపై ఇంతకు మించి మాట్లాడదలుచుకోలేదని షీలా దీక్షిత్ అన్నారు. అంచెలంచెలుగా గవర్నర్ స్థాయికి.. సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న చెన్నమనేని విద్యాసాగర్ రావు తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన,.. బీజేపీలోఅంచెలంచెలుగా ఎదిగారు. 69ఏళ్ల విద్యాసాగర్ రావు వృత్తిరీత్యా న్యాయవాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. 1985, 1989, 1994లో కరీంనగర్ జిల్లా మెట్పల్లి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. 1985 నుంచి 1998 వరకు ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో ఆయన బీజేపీ పక్షనేతగా వ్యవహరించారు. కరీంనగర్ లోక్‌సభ స్థానంనుంచి 1998, 1999లో ఎన్నికై, వాజ్‌పేయి కేబినెట్లో స్థానం సాధించారు. 1999లో ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యుడుగా పనిచేసిన విద్యాసాగర్ రావు, 1972లో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కాలేజీలో ఏబీవీపీ విభాగం అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1975లో ఎమర్జెన్సీ కాలంలో అంతర్గత భద్రతా నిర్వహణా చట్టం(మీసా)కింద ఆయన అరెస్టయ్యారు. ఆ తర్వాత జనసంఘ్‌లో, బీజేపీలో కీలకపాత్ర పోషించారు. గోదావరిలో నీటి వృధాను అరికట్టేందుకు సేద్యపునీటి ప్రాజెక్టు నిర్మించాలంటూ 1998లో పాదయాత్ర నిర్వహించారు.