రెండో పెళ్లి చేసుకున్నఇన్స్పెక్టర్పై వేటు
హైదరాబాద్: ఓ కేసు విషయమై తన వద్దకు వచ్చిన మహిళను లోబరుచుకుని, రెండో పెళ్లి చేసుకున్న ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు ఆయన పై ఈ మేరకు ఉన్నతాధికారులు చర్య తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలివీ... ధీరావత్ హుస్సేన్ చాదర్ఘాట్ పోలీస్స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. అయితే, చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ సత్తయ్య సెలవుపై వెళ్లిన సమయంలో హుస్సేన్ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ కేసులో అతని భార్య ఇన్స్పెక్టర్ హుస్సేన్ను ఆశ్రయించింది. ఆమె భర్తను ఆస్పత్రిలో చేర్పించటంతో పాటు వైద్యం అందేలా చేసేందుకు ఇన్స్పెక్టర్ సాయపడ్డాడు. క్షతగాత్రుడు ఆస్పత్రిలో చాలాకాలం ఉండాల్సి రావటంతో అతని భార్యతో ఇన్స్పెక్టర్ చనువు పెంచుకున్నాడు. ఇన్స్పెక్టర్కు పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్న ఆ వివాహితను పెళ్లి చేసుకుని మరో ఇల్లు తీసుకుని అక్కడ కాపురం పెట్టాడు. ఈ సంగతి తెలిసిన మొదటి భార్య అతనితో గొడవ పెట్టుకుంది. అయితే, సదరు ఇన్స్పెక్టర్ ఆమెతో తెగదెంపులు చేసుకుని రెండో భార్య వద్దే ఉంటున్నాడు. దీంతో ఆమె ఇన్ స్పెక్టర్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిని సీరియస్గా పరిగణించిన అధికారులు విచారణ చేపట్టగా వాస్తమేనని రూఢీ అయింది. దీంతో నాలుగు రోజుల క్రితం ఇన్స్పెక్టర్ ధీరావత్ హుస్సేన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.