కాలింగ్ బెల్ కొట్టి..ఇంట్లోకి చొరబడి..
మణికొండ: చైన్‌స్నాచర్లు రోడ్ల పక్కన ఏమరుపాటుగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడతారు. అందుకు భిన్నంగా ఇంట్లో ఉన్న మహిళలోని గొలుసును చోరీ చేసిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్లో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్షాకోట్ గ్రామం సన్సిటీలోని విజయ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో మంజుల నివసిస్తుంది. దీనికి సమీపంలోనే ఓ జిరాక్స్‌సెంటర్ నడుపుతుంది. ప్రతిరోజూ మాదిరిగానే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి తిని కొద్ది సేపు పడుకునే ప్రయత్నం చేసింది. అంతలోనే కాలింగ్ బెల్ పలుమార్లు మోగటంతో నిద్రమత్తులోనే వచ్చి డోరు తీసింది. మొహానికి మాస్క్ ధరించిన ఓ ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. ఆమె గట్టిగా అరవంటంతో పక్కఫ్లాట్లోని వ్యక్తి అతని వెంబడించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.