అధ్యక్షా.. సర్వం సమస్యలే !
- నేడు జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం
- మూడేళ్ల పాలనలో రైతులకు ముప్పుతిప్పలు
- సమస్యలపై గళం విప్పనున్న వైఎస్సార్సీపీ సభ్యులు
- చైర్మన్ చమన్ సారథ్యంలో చివరి సమావేశం
అనంతపురం సిటీ : జిల్లాలో ఎటుచూసినా సమస్యలు పేరుకుపోయాయి. పరిష్కారం చూపాల్సిన పాలకులు పట్టించుకోవడం లేదు. మూడు నెలలకోసారి జరిగే జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ప్రజాభివృద్ధికి, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన పాలకులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి సారీ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగుతోంది. ఈనెల 13న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ప్రజాభివృద్ధికి పైసా విదిల్చకుండా మూడేళ్ల పాలన అంతా కాలం గడుపుతూ వచ్చిన పాలకవర్గాన్ని నిలదీసేందుకు, ప్రజాసమస్యలే అజెండాగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులు సిద్ధమయ్యారు.
జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. వందలాది అడుగులలోతు బోరు వేసినా నీటి చెమ్మ కనిపించడం లేదు. నీరులేక పండ్లతోటలు ఎండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సిన వేరుశనగ .. కనీసం వేలాది హెక్టార్లు కూడా సాగు చేయని పరిస్థితి. 24 మండలాల్లో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని ప్రభుత్వానికి అధికారులు కూడా నివేదికలు పంపారు. గ్రామాల్లో తాగునీటికి కష్టాలు పడుతున్నారు. అరకొర దొరికే నీటిలోనూ ఫ్లోరైడ్ అధిక శాతం ఉండడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఆస్పత్రుల్లో వాంతులు, విరేచనాలు, విష జ్వరాలతో జనం అవస్థలు పడుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా పాఠ్యపుస్తకాల కొరత తీర్చడం లేదు.
తడారుతున్న పల్లె గొంతులు :
జిల్లాలోని 1003 గ్రామ పంచాయతీల్లో సగానికి పైగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్నాయి. వర్షాలు కురవక పోవడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. ప్రత్యామ్నాయ చర్యల పేరుతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు ఏ మూలకూ సరిపోవడంలేదని పల్లెల్లో రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారు. జిల్లాలో 24 మండలాల్లో తాగు నీటి కష్టాలున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ ప్రాంతాలకు మరిన్ని ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయిస్తామని చెప్పిన అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు.
గండి కోట రిజర్వాయర్ నుంచి తాగునీటి అవసరాలు తీర్చుకోవాల్సి ఉన్నా ..జేసీ నాగిరెడ్డి పథకం పనులు పూర్తి చేయక పోవడంతో 514 గ్రామాలకు చేరాల్సిన నీరు 14 గ్రామాలకే పరిమితమైంది. ఈ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులు అడుగడుగునా అడ్డు తగులుతుండటంతో పనులు ముందుకు సాగలేదు.ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు లెక్కలు చూపి
నిధులు కాజేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కూడేరు వద్దనున్న పీఏబీఆర్ తాగునీటి పథకం నుంచి నీటి సరఫరాకు అవకాశం ఉన్నా ..నీరు ఇవ్వకుండా అధికార పార్టీనేతలు అడ్డు తగులుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
చమన్ సారధ్యంలో చివరి సమావేశం :
మూడేళ్ల ఒప్పందానికి తెరపడింది. జిల్లా పరిషత్ చైర్మన్గా తన బాధ్యతల నుంచి చమన్ తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన సారధ్యంలో ఈ నెల 13న జరిగే సాధారణ సర్వసభ్య సమావేశంగా ఇది మిగిలి పోనుంది.