రైల్వే వల్లే పోర్టుకు నష్టం
- తగినన్ని గూడ్సు వ్యాగన్లను ఇవ్వట్లేదు
- పార్లమెంటరీ కమిటీకి కృష్ణబాబు నివేదన
- పోర్టులో పర్యటించిన కమిటీ సభ్యులు
సాక్షి, విశాఖపట్నం: రైల్వేశాఖ తగినన్ని గూడ్సు వ్యాగన్లను సరఫరా చేయకపోవడం వల్ల విశాఖ పోర్టులో రవాణా వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పోర్టు చైర్మన్ ఎం.కృష్ణబాబు కేంద్ర వాణిజ్యశాఖ అనుబంధ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. సకాలంలో వ్యాగన్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఎగుమతులు, దిగుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా డాక్టర్ చందన్ మిత్రా నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులు సోమవారం పోర్టు, కంటైనర్ టెర్మినల్, షిప్‌యార్డు, ఫిషింగ్‌హార్బర్‌లో పర్యటించారు.
ప్రత్యేకంగా బోటులో వెళ్లి ఇన్నర్, అవుటర్ హార్బర్ ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి సౌకర్యాలు, సమస్యలను పోర్టు చైర్మన్ ఎం.కృష్ణబాబు, ఎంపీ కంభంపాటి హరిబాబు వారికి వివరించారు. హుద్‌హుద్ తుపానుతో దెబ్బతిన్న బోట్లకు చేస్తున్న మరమ్మతులను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ బృందంలో ఎంపీలు శాంతారామ్ నాయక్, జితేంద్ర చౌదరి, కేఆర్పీ ప్రభాకరన్, సుధార్ గుప్తా, బోధ్‌సింగ్ భగత్, చరణ్‌జిత్‌సింగ్ సింగ్రోరి, జాయ్ అబ్రహాం ఉన్నారు. పోర్టు యాజమాన్యం, ఎగుమతిదారులు, బెర్తుల నిర్వాహకులు, కార్మికులతో పాటు కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో పార్లమెంటరీ కమిటీ సాయంత్రం నోవాటెల్ హోటల్లో సమావేశమైంది.
ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ చందన్ మిత్రా మాట్లాడుతూ విశాఖతో పాటు ముంబై, చెన్నై, కలకత్తా తదితర మేజరు పోర్టుల్లో సైతం సరకు రవాణాలో జాప్యం జరుగుతోందన్నారు. పోర్టులను ఆధునికీకరించడం ద్వారా వాటి సామర్థ్యాన్ని పెంపొందించవచ్చని చెప్పారు. విశాఖ పోర్టు అభివృద్ధి, ఎదుర్కొంటున్న సమస్యలపై చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు వివరించారు. 2020 సంవత్సరం నాటికల్లా దాదాపు పది కోట్ల టన్నుల సరుకు ఎగుమతి, దిగుమతి సామర్ధ్యాన్ని సాధిస్తుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద శాటిలైట్ పోర్టు నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నామని, దీనిద్వారా బల్క్ కార్గో ఎగుమతులు నిర్వహిస్తామని వివరించారు. అయితే విశాఖ పోర్టులో సరుకుల రవాణాకు రోజుకు 20 గూడ్సురైళ్లు అవసరం కాగా సగమే అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు.
విజయనగరం-రాయ్‌పూర్ రైల్వే లైన్ సామర్థ్యం పెంచాలని, సత్వరమే విద్యుదీకరణ పనులు చేపట్టాలని అన్నారు. దీనికి ఎంపీ కంభంపాటి హరిబాబు స్పందిస్తూ ఈ విషయమై ఈనెల 27న నగరానికి వస్తున్న రైల్వే మంత్రి సురేష్‌ప్రభుతో చర్చిస్తామని చెప్పారు. డివిజినల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ స్పందిస్తూ అలమండ, కోరుకొండ మీదు విజయనగరం వరకు మూడో లైన్ జూలై నెల నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అలాగే వచ్చే నవంబరు నాటికి రాయగడ రైల్వేలైను విద్యుదీకరణ పనులు విజయనగరం వరకు పూర్తవుతాయని వెల్లడించారు. స్టీల్డోర్స్ అసోసియేషన్ ప్రతినిధి కృష్ణకుమార్, వేదాంత సంస్థ యాజమాన్యం ప్రతినిధులు, పోర్టు ఉద్యోగుల సంఘం ప్రతినిధి డీకే శర్మ, కస్టమ్స్ శాఖ చీఫ్ కమిషనర్ దీప బి.దాస్‌గుప్తా మాట్లాడారు. సీఐఐ తరఫున ఆర్వీఎస్ రాజు, పలువురు కార్మిక సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.