కాశ్మీర్‌పై ఖాకీల డేగకన్ను
మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం
శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశ్మీర్లో పర్యటించడాన్ని వ్యతిరేకిస్తూ హురియత్ కాన్ఫరెన్స్‌లోని రెండు వర్గాలు గురువారం బంద్‌కు పిలుపునివ్వటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా నగరంలో భద్రతను మరింత పెంచారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేసేందుకు నగరంలో డజను ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. నగరంలోకి వచ్చిపోవడానికి ఉండే పలు మార్గాల్లో ప్రత్యేక చెకింగ్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. దీపావళి రోజున శ్రీనగర్‌లో పర్యటించనున్నట్లు మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీ ఎన్నికలకు మేం రెడీ: బీజేపీ
జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా తమకు ఓకేనని, తాము పోటీకి సిద్ధంగా ఉన్నామని బీజేపీ ప్రకటించింది. ‘‘ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మేం పోటీ చేయడానికి సిద్ధమే’’ అని బీజేపీ నాయకుడు జితేందర్ సింగ్ బుధవారమిక్కడ చెప్పారు.