2న మండలి చైర్మన్ ఎన్నిక
స్వామిగౌడ్ పేరు దాదాపు ఖరారు
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 1న నామినేషన్లు స్వీకరించి.. 2వ తేదీన చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. మండలికి చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ను ఎన్నుకోవడం దాదాపు ఖాయమైపోయింది. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మె ల్సీలపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్, టీడీపీలు కోరుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా మండలి చైర్మన్ ఎన్నికను పూర్తి చేయాలనే ఆలో చనలో ఉన్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అనంతరం రాత్రికే చైర్మన్ ఎన్నికకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రారంభంకానున్న శాసన మండలి సమావేశాల తొలిరోజునే చైర్మన్‌ను ఎన్నుకోను న్నారు. కాగా తెలంగాణ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా టీఆర్ఎస్ నేత కొప్పుల హరీశ్వర్‌రెడ్డి నియామకం దాదాపు ఖరారైనట్లు సమాచారం. తెలంగాణ శాసనమండలి సమావేశాలు వచ్చేనెల 2న ప్రారంభం కానున్నాయి.
గవర్నర్‌తో కేసీఆర్ భేటీ..
శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్ సుమారు అరగంటపాటు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఏర్పాటుచేయనున్న ప్రణాళికా, అభివృద్ధి సలహా బోర్డులపై చర్చించినట్టు తెలిసింది.