త్వరలో పశుదాణా కర్మాగార నిర్మాణం
ఘంటసాల: పాలకు అధిక ధర, బోనస్లు చెల్లించడంలో కృష్ణామిల్క్ యూనియన్ భారత దేశంలోనే మొదటిస్థానంలో ఉందని కృష్ణామిల్క్యూనియన్ చైర్మన్ మండవ జానకి రామయ్య అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీకోట ముత్యాలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో జిల్లా పాలకవర్గం అధ్యక్షతన మండవకు అభినందన సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2009 నుంచి యూనియన్ అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో అధునాతన పశువుల దాణా కర్మాగారాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. 2009–16 వరకు ఏడు సంవత్సరాల్లో రూ.207 కోట్లు బోనస్లు పంపిణీ చేయగా 2015–16లో మూడు దఫాలుగా రూ.62 కోట్లు చెల్లించినట్లు వివరించారు. రూ.33 కోట్లతో ప్రారంభమైన యూనియన్ నేడు రూ.500 కోట్లకు పైగా టర్నోవర్కు చేరిందంటే అందరి సహకారంతోనే సాధ్యమైందన్నారు. పాడిరైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకోట ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.