ఎంజీఆర్‌కు ఘన నివాళి
హొసూరు/కెలమంగలం/క్రిష్ణగిరి : తమిళనాడు రాష్ట్ర అభివృద్దికి ఎంజీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని హొసూరు మున్సిపల్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి అన్నారు. క్రిష్ణగిరి జిల్లా వ్యాప్తంగా ఎంజీఆర్ వర్ధంతిని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు భక్తిశ్రద్ధలతో బుధవారం నిర్వహించారు. హొసూరులోని క్రిష్ణగిరి రోడ్డు కూడలిలో ఎంజీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘననివాళులర్పించారు. ఎంజీఆర్ ఆశయ సాధనలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు సేవలందిస్తుందని హొసూరు యూనియన్ చైర్పర్సన్ పుష్పాసర్వేష్ కొనియాడారు. హొసూరులో జరిగిన వర్దంతి వేడుకలలో పట్టణ అన్నాడీఎంకే కార్యదర్శి నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ రాము, అన్నాడీఎంకే నాయకుడు జయప్రకాష్, అన్నాడీఎంకే మున్సిపల్ కౌన్సిలర్లు మారేగౌడ, త్యాగరాజరెడ్డి, అన్నాడీఎంకే నాయకులు రామచంద్రప్ప, చిట్టి తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
బేరికెలో : హొసూరు తాలూకా బేరికెలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎం.జి. రామచంద్రన్ వర్ధంతి వేడుకలను అన్నాడీఎంకే నాయకుడు శరవణన్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రంలో బీద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎంజీఆర్ అని కాటినాయకనదొడ్డి పంచాయతీ అధ్యక్షుడు సారథి కొనియాడారు. బేరికె బస్టాండులో ఎంజీఆర్ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కెలమంగలంలో : డెంకణీకోట తాలూకా కెలమంగలంలో ఎంజీఆర్ వర్ధంతిని పట్టణ పంచాయతీ అధ్యక్షుడు సయ్యద్‌హస్సేన్ అధ్యక్షతన నిర్వహించారు. బస్టాండులో ఎంజీఆర్ చిత్రపటాన్నుంచి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ పంచాయతీ ఉపాధ్యక్షుడు మంజునాథ్, అన్నాడీఎంకే పట్టణ కార్యదర్శి తిమ్మరాయప్ప, బోడిసిపల్లి సహాకార సంఘ అధ్యక్షుడు సంపంగి, అన్నాడీఎంకే నాయకులు రాజేంద్రప్ప, దస్తగిరి, ఎస్.ఏ. గోపాలరెడ్డి, మంజునాథ్ పాల్గొన్నారు.
తళిలో : డెంకణీకోట తాలూకా తళిలో అన్నాడీఎంకే నాయకులు ఎంజీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తళి యూనియన్ అన్నాడీఎంకే కార్యదర్శి క్రిష్ణన్ అధ్యక్షతన తళి బస్టాండులో ఎంజీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. కార్యక్రమంలో రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డెంకణీకోటలో : డెంకణీకోట పట్టణ పంచాయతీ అధ్యక్షుడు నాగేష్ అధ్యక్షతన ఎంజీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగింది. పాత బస్టాండులో ఎంజీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అన్నాడీఎంకే నాయకులు సంపంగిరామరెడ్డి, డి.ఎస్. పాండ్యన్, అన్నాడీఎంకే కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రిష్ణగిరిలో : జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే కార్యదర్శి గోవిందరాజు అధ్యక్షతన ఎంజీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధ్యక్షుడు అర్జునన్, అన్నాడీఎంకే నాయకులు తెన్నరసు, కేశవన్, మున్సిపల్ చైర్మన్ తంగముత్తు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొని ఎంజీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఏనుగుల సంచారంతో పంటలు నష్టం
కెలమంగలం : డెంకణీ కోట తాలూకాలోని నగనూరు అటవీ ప్రాంతంలో మకాం వేసిన 15 ఏనుగులు మంగళవారం రాత్రి దళసూరు, ఆళళ్లి గ్రామ రైతుల పంటపొలాల్లో సంచరించడంతో రాగి పంటకు నష్టం వాటిల్లింది. మొత్తం ఐదు ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, అటవీశాఖ అధికారులు పరిహారం ఇప్పించాలని బాధిత రైతులు కోరారు.