'నిహలానీ నిరంకుశుడు'
న్యూఢిల్లీ: భారత చలన చిత్ర సెన్సార్ బోర్డులో వైరుధ్యాలు బట్టబయలయ్యాయి. నిర్మాత అశోక్ పండిట్ సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహలానీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన క్రూరుడని, నిరంకుశ పాలన చేస్తారని వర్ణించారు. ఇదే బోర్డులోని మరో సభ్యుడు చంద్రప్రకాశ్ ద్వివేది కూడా బోర్డులోని పాలన యంత్రాంగం సరిగా లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిహలానిపై విమర్శలకు ఫేస్‌బుక్‌ను సాధనంగా వాడుకున్న పండిట్.. నిహలాని నియంతృత్వానికి అనుష్కశర్మ నటించిన ఎన్ హెచ్ 10 బాధితురాలిగా మిగిలిందన్నారు. ఈ చిత్రంలో కొన్ని సీన్లు తొలగించాలని సెన్సార్ బోర్డు షరతులు విధించడంతో ఆ చిత్రం విడుదల వారంపాటు ఆగి ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం విషయంలో బోర్డు క్రూరంగా వ్యవహరించిందని పండిట్ విమర్శించారు.