ఇంటి వద్దకే అపోలో వైద్య సేవలు
రూ. 50 కోట్లతో హోమ్‌కేర్ యూనిట్
త్వరలో అన్ని ప్రధాన పట్టణాలకూ విస్తరణ
మూడు నెలల్లో 10,000 పడకల మార్కు
అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ గ్రూపు నుంచి సరికొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. చికిత్సానంతరం హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దనే వైద్యసేవలను అందించేలా హోమ్‌కేర్ సేవలను ప్రారంభిస్తున్నట్లు అపోలో గ్రూపు ప్రకటించింది. ప్రస్తుతం చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని, త్వరలో అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతాలకు విస్తరిస్తామని అపోలో గ్రూపు ఫౌండర్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి చెప్పారు. శనివారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. దీనివల్ల రోగులకు చికిత్స వ్యయం తగ్గి, తొందరగా కోలుకుంటారన్నారు. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత హాస్పిటల్లో ఉంటే రోజుకు సగటున రూ. 10,000 అవుతుందని, కానీ అదే ఇంటివద్ద అంతే నాణ్యమైన సర్వీసులను రూ. 3,500కే పొందవచ్చన్నారు.
ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ ఆక్యుపెన్సీ రేషియో 80 శాతంగా ఉండి చాలా మందికి చికిత్స అందించలేకపోతున్నామని, ఈ హోమ్‌కేర్ వల్ల మరింత మందికి చికిత్స అందించే వెసులుబాటు కలుగుతుందన్నారు. రూ.50 కోట్లతో ఏర్పాటు చేసిన అపోలో హోమ్ హెల్త్త్కేర్ ప్రత్యేక కంపెనీ అని తెలిపారు. రూ. 1,400 కోట్లతో నిర్మించిన 4 ఆస్పత్రులు మూడు నెలల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. విశాఖ, ముంబై, బెంగళూరు, గువాహటిల్లో వీటిని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి అందుబాటులోకి వస్తే అపోలో పడకల సంఖ్య 10,000 మార్కును అధిగమిస్తుందన్నారు.