బహిష్కరిస్తే అనుభవిస్తారు
- పీసీబీకి శుక్లా హెచ్చరిక
- డిసెంబర్లో సిరీస్ జరగదు
లక్నో: డిసెంబర్లో భారత జట్టు తమతో సిరీస్ ఆడకపోతే ఐసీసీ, ఏసీసీ ఈవెంట్స్‌లో వారిని బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు(సీపీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్‌పై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ధ్వజమెత్తారు. అదే జరిగితే వారు ఫలితం అనుభవిస్తారని ఘాటుగా స్పందించారు. అసలు డిసెంబర్ లో సిరీస్ జరిగే అవకాశాలు లేవని తేల్చి చెప్పా రు. ‘బీసీసీఐ లేక ఐసీసీని ఆయన హెచ్చరిస్తున్నారా? ఐసీసీ నిబంధనలకు పీసీబీ లోబడి ఉండాలి. లేకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అసలు వారి దేశంలో పర్యటించడానికి ఏ జట్టు ఆసక్తి చూపిస్తుందని. భారత ఆటగాళ్లకు పూర్తి రక్షణ కల్పించగలుగుతామని ఆయన హామీ ఇవ్వగలరా? ఇంగ్లండ్, ఆసీస్ జట్లే కాకుండా బంగ్లాదేశ్ కూడా అక్కడికి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఇక సిరీస్ గురించి ప్రభుత్వ అనుమతి కోరతాం. కానీ అంతకుముందు చాలా సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. కాబట్టి డిసెంబర్లో సిరీస్ జరిగే అవకాశం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.