Chairman of zp
-
జెడ్పీలో కౌన్సెలింగ్ ప్రశాంతం
కడప ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం ప్రశాంతంగా జరిగింది. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలోని జెడ్పీ చైర్మన్ చాంబర్లో చైర్మన్ గూడూరు రవి, వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి, సీఈఓ మాల్యాద్రి కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. వీరితో పాటు రికార్డు అసిస్టెంట్లు, వాచ్మెన్, డ్రైవర్లనూ వారు కోరుకున్న చోటికి బదిలీ చేశారు. ఎంపీడీఓలకూ స్థాన చలనం కలిగించారు. ఈ ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. ఉద్యోగులతో జెడ్పీ కార్యాలయ ఆవరణం సందడిగా మారింది. వీడిన పీఠముడి: ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ తన చాంబర్లో ఉంటుందం టూ జెడ్పీ సీఈఓ మాల్రాది ఇటీవల ప్రకటించారు. ఇది చర్చనీయాంశమైంది. గతంలో బదిలీల ప్రక్రియను చైర్మన్ చాంబర్లోనే నిర్వహించారు. అందుకు విరుద్ధంగా ఈసారి కౌన్సెలింగ్ తన చాంబర్లో ఉంటుందంటూ సీఈఓ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఒక దశలో చైర్మన్, సీఈఓ ఇద్దరూ పంతానికి పోయినట్లు తెలిసింది. దీంతో బదిలీలు జరుగుతాయో లేదోనని ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు చైర్మన్ చాంబర్లోనూ శనివారం కౌన్సెలింగ్ నిర్వహించడంతో ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు. బదిలీ అయిన వారికి రెండు మూడురోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సీఈఓ తెలిపారు. -
దళితులు ఎదగకూడదనే..
- గద్వాల దళితులను డీకే అరుణ విస్మరించారు - కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఆమెకు లేదు.. - అట్టడుగు నుంచి వచ్చా.. జిల్లాను అభివృద్ధి చేస్తా - విలేకరుల సమావేశంలో జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్ గద్వాల: మూడు తరాలుగా గద్వాల ప్రజలు డీకే కుటుంబానికి అండగా నిలుస్తుంటే, ఎమ్మెల్యే అరుణ మాత్రం ఈ ప్రాంత దళితులు పైస్థాయి పదవులకు ఎదగకుండా ప్రయత్నిస్తున్నారని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ విమర్శించారు. గద్వాల జెడ్పీటీసీ స్థానానికి ధన్వాడ నుంచి వెంకయ్యను తీసుకురావడం చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుందన్నారు. గద్వాలలో ఆమె పక్షాన దళితులు లేరా? అని సూటిగా ప్రశ్నించారు. జెడ్పీచైర్మన్‌గా ఎన్నికైన ఆయన ఆదివారం తొలిసారిగా గద్వాల టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికవడాన్ని అడ్డుకునేందుకు అరుణ శతవిధాలుగా ప్రయత్నించారని అన్నారు. గద్వాల ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలని భాస్కర్ విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తేనే నెట్టెంపాడు నీళ్లు వస్తాయని అరుణ ప్రచారం చేసి ప్రజలను నమ్మించారని, ఇప్పుడు నెట్టెంపాడు నీటిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందించి, ఆమెకు సంబంధలేదన్న వాస్తవాన్ని తెలిసేలా చేస్తానన్నారు. అట్టడుగువర్గాల అభివృద్ధే ధ్యేయం తాను పెదరికంలో పుట్టి ఈ స్థాయికి వచ్చానని, జిల్లాలో అట్టడుగువర్గాల ప్రజలకు సంక్షేమఫలాలు అందేలా కృషిచేస్తానని అన్నారు. గతంలో పనిచేసిన జెడ్పీచైర్మన్ల కన్నా ఎక్కువగానే పనిచేసి చూపుతానన్నారు. జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యుల సహకారంతోనే జెడ్పీచైర్మన్‌గా ఎన్నికయ్యానని అన్నారు. తనకు మంచి అవకాశమిస్తూ సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని, వారి ఆశయం మేరకు పనిచేస్తానన్నారు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి అరుణ లేదని జెడ్పీచైర్మన్ భాస్కర్ హితవు పలికారు. అరుణ జీర్ణించుకోలేకపోయారు: కృష్ణమోహన్‌రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా టీఆర్ఎస్ అభ్యర్థి బండారి భాస్కర్‌ను గెలిపించడంలో అన్ని పార్టీల సభ్యులు సహకరించారని టీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బి.కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గద్వాల దళితుడు జెడ్పీచైర్మన్ కావడాన్ని డీకే అరుణ జీర్ణించుకోలేక అడ్డుకోడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. సమాజ్‌వాది పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో పనిచేశారని, తన భర్త ఎన్టీఆర్‌తో గెలిచి నాయకుడినే మార్చలేదా? అని గుర్తుచేశారు. సమావేశంలో గద్వాల ఎంపీపీ సుభాన్, ధరూరు సింగిల్ విండో అధ్యక్షులు సీసల వెంకటరెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ కేశవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, కాంళ్లే, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నిక లాంఛనమే
- నేడు జెడ్పీ చైర్మన్ పీఠాన్ని అధిష్టించనున్న బాపిరాజు - ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు ఎంపిక ఏలూరు : జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం శనివారం కొలువు తీరనుంది. చైర్మన్ పీఠాన్ని తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ ముళ్లపూడి బాపిరాజు అధిష్టించనున్నారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించనున్నారు. జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, అత్యధికంగా 43 స్థానాలను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో బాపిరాజు ఎన్నిక లాంఛనం కానుంది. కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టనుండటంతో మూడేళ్ల ప్రత్యేకాధికారి పాలనకు తెరపడనుంది. 2011 జూలై 22న జిల్లా పరిషత్ పాలకవర్గం గడువు ముగియటంతో అప్పటి నుంచి కలెక్టర్ ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్నారు. కొత్త చైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారు కావడంతో కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి జెడ్పీ ఇన్చార్జి సీఈవో పులి శ్రీనివాసులు ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక వసతులతో నిర్మించిన జెడ్పీ నూతన సమావేశ మందిరంలో ఈ ఎన్నిక జరగనుంది. ఎన్నిక జరిగేదిలా జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ సిద్ధార్థజైన్ అధ్యక్షతన శనివారం జరగనుంది. ఉదయం 9 గంటలకు జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. 10 గంటలకు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11 గంటలకు వాటిని పరిశీలన చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు 46 మంది జెడ్పీటీసీ సభ్యులు తెలుగు అక్షర క్రమంలో వారి ఇంటిపేర్లు ఆధారంగా వరుసగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకుంటారు. ఇండోర్ స్టేడియంలో అభినందన సభ జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం వారిని సన్మానించేందుకు ఏలూరు ఇండోర్ స్టేడియంలో టీడీపీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతిని ధులు, నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ పదవికి ఇద్దరు ఎంపిక జిల్లా పరిషత్ ఉపాధ్యక్ష పదవులను రెండున్నరేళ్ల చొప్పున ఇద్దరు మహిళా జెడ్పీటీసీలకు కట్టబెట్టాలని జిల్లా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. మొదటి రెండున్నరేళ్ల కాలానికి కొయ్యలగూడెం జెడ్పీటీసీ చింతల వెంకటరమణను, అనంతర రెండున్నరేళ్ల కాలానికి ఆకివీడు జెడ్పీటీసీ మన్నె లలితాదేవిని ఎంపిక చేశారు. ఈ విషయంలో కొంత మార్పు జరిగే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల భోగట్టా. కో-ఆప్షన్ సభ్యుల ఖరారు జెడ్పీలో రెండు కో-ఆప్షన్ పదవులకు పేర్లను ఖరారు చేశారు. కాళ్ల మాజీ జెడ్పీటీసీ గేదెల జాన్ (ఎస్సీ), ఏలూరు మండలం శనివారపుపేటకు చెందిన షేక్ సులేమాన్‌లను ఈ పదవులకు ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.