దళితులు ఎదగకూడదనే..
- గద్వాల దళితులను డీకే అరుణ విస్మరించారు
- కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఆమెకు లేదు..
- అట్టడుగు నుంచి వచ్చా.. జిల్లాను అభివృద్ధి చేస్తా
- విలేకరుల సమావేశంలో జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్
గద్వాల: మూడు తరాలుగా గద్వాల ప్రజలు డీకే కుటుంబానికి అండగా నిలుస్తుంటే, ఎమ్మెల్యే అరుణ మాత్రం ఈ ప్రాంత దళితులు పైస్థాయి పదవులకు ఎదగకుండా ప్రయత్నిస్తున్నారని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ విమర్శించారు. గద్వాల జెడ్పీటీసీ స్థానానికి ధన్వాడ నుంచి వెంకయ్యను తీసుకురావడం చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుందన్నారు. గద్వాలలో ఆమె పక్షాన దళితులు లేరా? అని సూటిగా ప్రశ్నించారు.
జెడ్పీచైర్మన్‌గా ఎన్నికైన ఆయన ఆదివారం తొలిసారిగా గద్వాల టీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికవడాన్ని అడ్డుకునేందుకు అరుణ శతవిధాలుగా ప్రయత్నించారని అన్నారు. గద్వాల ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలని భాస్కర్ విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తేనే నెట్టెంపాడు నీళ్లు వస్తాయని అరుణ ప్రచారం చేసి ప్రజలను నమ్మించారని, ఇప్పుడు నెట్టెంపాడు నీటిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందించి, ఆమెకు సంబంధలేదన్న వాస్తవాన్ని తెలిసేలా చేస్తానన్నారు.
అట్టడుగువర్గాల అభివృద్ధే ధ్యేయం
తాను పెదరికంలో పుట్టి ఈ స్థాయికి వచ్చానని, జిల్లాలో అట్టడుగువర్గాల ప్రజలకు సంక్షేమఫలాలు అందేలా కృషిచేస్తానని అన్నారు. గతంలో పనిచేసిన జెడ్పీచైర్మన్‌ల కన్నా ఎక్కువగానే పనిచేసి చూపుతానన్నారు. జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యుల సహకారంతోనే జెడ్పీచైర్మన్‌గా ఎన్నికయ్యానని అన్నారు. తనకు మంచి అవకాశమిస్తూ సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని, వారి ఆశయం మేరకు పనిచేస్తానన్నారు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి అరుణ లేదని జెడ్పీచైర్మన్ భాస్కర్ హితవు పలికారు.
అరుణ జీర్ణించుకోలేకపోయారు: కృష్ణమోహన్‌రెడ్డి
జిల్లా పరిషత్ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ అభ్యర్థి బండారి భాస్కర్‌ను గెలిపించడంలో అన్ని పార్టీల సభ్యులు సహకరించారని టీఆర్‌ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి బి.కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గద్వాల దళితుడు జెడ్పీచైర్మన్ కావడాన్ని డీకే అరుణ జీర్ణించుకోలేక అడ్డుకోడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. సమాజ్‌వాది పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో పనిచేశారని, తన భర్త ఎన్టీఆర్‌తో గెలిచి నాయకుడినే మార్చలేదా? అని గుర్తుచేశారు. సమావేశంలో గద్వాల ఎంపీపీ సుభాన్, ధరూరు సింగిల్ విండో అధ్యక్షులు సీసల వెంకటరెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ కేశవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, కాంళ్లే, తదితరులు పాల్గొన్నారు.