ఎన్నిక లాంఛనమే | Election formal | Sakshi
Sakshi News home page

ఎన్నిక లాంఛనమే

Published Sat, Jul 5 2014 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

ఎన్నిక లాంఛనమే

ఎన్నిక లాంఛనమే

- నేడు జెడ్పీ చైర్మన్ పీఠాన్ని అధిష్టించనున్న బాపిరాజు
- ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు ఎంపి

ఏలూరు : జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం శనివారం కొలువు తీరనుంది. చైర్మన్ పీఠాన్ని తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ ముళ్లపూడి బాపిరాజు అధిష్టించనున్నారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించనున్నారు. జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, అత్యధికంగా 43 స్థానాలను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో బాపిరాజు ఎన్నిక లాంఛనం కానుంది. కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టనుండటంతో మూడేళ్ల ప్రత్యేకాధికారి పాలనకు తెరపడనుంది.

2011 జూలై 22న జిల్లా పరిషత్ పాలకవర్గం గడువు ముగియటంతో అప్పటి నుంచి కలెక్టర్ ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్నారు. కొత్త చైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారు కావడంతో కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో పులి శ్రీనివాసులు ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక వసతులతో నిర్మించిన జెడ్పీ నూతన సమావేశ మందిరంలో ఈ ఎన్నిక జరగనుంది.
 
ఎన్నిక జరిగేదిలా
జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జిల్లా పరిషత్  ప్రత్యేకాధికారి, కలెక్టర్ సిద్ధార్థజైన్ అధ్యక్షతన శనివారం జరగనుంది. ఉదయం 9 గంటలకు జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. 10 గంటలకు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11 గంటలకు వాటిని పరిశీలన చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు 46 మంది జెడ్పీటీసీ సభ్యులు తెలుగు అక్షర క్రమంలో వారి ఇంటిపేర్లు ఆధారంగా వరుసగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకుంటారు.
 
ఇండోర్  స్టేడియంలో అభినందన సభ
జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం వారిని సన్మానించేందుకు ఏలూరు ఇండోర్ స్టేడియంలో టీడీపీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతిని ధులు, నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.  
 
జెడ్పీ వైస్ చైర్మన్ పదవికి ఇద్దరు ఎంపిక
జిల్లా పరిషత్ ఉపాధ్యక్ష పదవులను రెండున్నరేళ్ల చొప్పున ఇద్దరు మహిళా జెడ్పీటీసీలకు కట్టబెట్టాలని జిల్లా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. మొదటి రెండున్నరేళ్ల కాలానికి కొయ్యలగూడెం జెడ్పీటీసీ చింతల వెంకటరమణను, అనంతర రెండున్నరేళ్ల కాలానికి ఆకివీడు జెడ్పీటీసీ మన్నె లలితాదేవిని ఎంపిక చేశారు. ఈ విషయంలో కొంత మార్పు జరిగే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల భోగట్టా.
 
కో-ఆప్షన్ సభ్యుల ఖరారు
జెడ్పీలో రెండు కో-ఆప్షన్ పదవులకు పేర్లను ఖరారు చేశారు. కాళ్ల మాజీ జెడ్పీటీసీ గేదెల జాన్ (ఎస్సీ), ఏలూరు మండలం శనివారపుపేటకు చెందిన షేక్ సులేమాన్‌లను ఈ పదవులకు ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement