యువకుడి ఆత్మహత్య
అనంతపురం న్యూసిటీ: నగరంలోని పీటీసీ సమీపాన రైల్వేట్రాక్ వద్ద బుధవారం ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు... రజకనగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి చాకలి నాగరాజు కుమారుడు హరిప్రసాద్(22) వినాయక నిమజ్జన వేడుకలను తిలకించేందుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి మంగళవారం సాయంత్రం బయటకు వచ్చాడు. రాత్రి పది గంటల అనంతరం మల్లేశ్వరరోడ్డులోని మిత్రుడు ఓబుళపతి రూంకు వెళ్లి హరిప్రసాద్ ఏడ్చుకుంటూ కూర్చుండిపోయాడు. ఎందుకు ఏడుస్తున్నావని అడిగినా ఎటువంటి సమాధానమూ రాలేదు.
ఓబుళపతి బాత్రూమ్లోకి వెళ్లగానే హరిప్రసాద్ గదిలోంచి బయటకొచ్చేశాడు. కాసేపటి తర్వాత గమనించిన ఓబుళపతి వెంటనే అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. రాత్రంతా కుటుంబ సభ్యులు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. సెల్‌కు ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. బుధవారం ఉదయం పీటీసీ సమీపంలో హరిప్రసాద్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన రైల్వే హెడ్‌కానిస్టేబుల్ జగదీష్ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశాడు. హుటాహుటిన వారు ఘటనాస్థలానికి చేరుకుని బోరున విలపించాడు. నిమజ్జనానికి వెళ్లి వస్తానని ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోతివా అంటూ హరిప్రసాద్ తండ్రి చాకలి నాగరాజు రోదించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.