బంగారం కోసం వృద్ధురాలి హత్య
నిడదవోలు : పట్టణంలో మంగళవారం జరిగిన వృద్ధురాలి హత్య కలకలం రేపింది. బంగారం కోసం దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీంతో పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని రామ్నగర్ అయ్యప్పస్వామి గుడి సమీపంలో పన్నీరు చక్రవేణి (75) అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసముంటుంది. ఆమెకు భర్త, పిల్లలు ఎవరూ లేరు. బంధువులు పంపిన సొమ్ముతోపాటు చిన్నపాటి చీటీల వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న చక్రవేణి పీక నులిమి హతమార్చారు. ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో ఓ గుర్తుతెలియని మహిళ గాజు ముక్కలు గదిలో పడ్డాయి. వీటిని పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం దుండగులు వృద్ధురాలి చెవికి ఉన్న దుద్దులను బలవంతంగా లాక్కున్న గుర్తులు కనిపించాయి. వాటితోపాటు టేబుల్ సరుగులో ఉన్న సుమారు ఐదు కాసుల బంగారపు తాడు, గాజులు తీసుకుని దుండగులు పరారయ్యారు. వేకువజామునే నిద్రలేచే అలవాటు ఉన్న వృద్ధురాలు ఉదయం 8 గంటలైనా బయటకు రాకపోవడంతో ఆ వీధి పక్కనే ఉన్న బంధువులు వచ్చి తలుపు తెరచి చూశారు. దీంతో మంచంపై విగతజీవిగా పడి ఉన్న వృద్ధురాలు కనిపించింది. సమాచారం అందుకున్న కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ, పట్టణ ఎస్సై భగవాన్ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఏలూరు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. జాగిలం స్థానికంగా ఉన్న రెండు ఇళ్ల వద్ద కలియతిరిగి సిమెంట్ రోడ్డు మీదుగా నిడదవోలు – పంగిడి ప్రధాన రోడ్డు మీదుగా వెళ్లింది. ఏలూరు నుంచి వచ్చిన వెలిముద్రల నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బాగా తెలిసిన వాళ్లే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇద్దరు అనుమానితులను పోలీసు స్టేషన్లో విచారిస్తున్నట్లు సమాచారం. నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.