chalasani
-
చలసాని సాహిత్య సర్వస్వం
‘తాళాలు లేని ఇళ్లు, పరీక్షలు లేని చదువులు, పోలీసుల అవసరం లేని సమాజం ఏర్పాటు చేసుకుందామని’ కల కనేవారట చలసాని ప్రసాద్. దానికోసం ఆయన ‘మార్క్సిస్టు’, ‘రాజకీయాల్లో స్టాలినిస్టు’ అయ్యారు. ‘నా అయిదో ఏట (1937) నుంచే నేను కమ్యూనిస్టునే’ అని ప్రకటించుకున్నారు. ‘ఆయనకు ఎంత పెద్ద లైబ్రరీ ఉన్నదో అంతకన్న పెద్ద స్నేహ ప్రపంచం ఉన్నది. బహుశా జీవితకాలంలో ఈ రెండు ప్రపంచాలలో తేలియాడే ఆనందాన్ని అనుభవించడానికే అనుకుంటాను తన తర్వాత మిగిలే రచన మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు,’ అంటారు వరవరరావు. బహుశా అందువల్లే, (తక్కువగా) రచయితా, (ఎక్కువగా) చదువరీ అయిన చలసాని ఆ రాసిన ‘కొన్ని’ వ్యాసాలూ, ముందుమాటలూ, సంపాదక లేఖలూ, వెల్లడించిన అభిప్రాయాలూ, స్పందనలూ, చేసిన–ఇచ్చిన ఇంటర్వ్యూలూ, వేసిన కరపత్రాలూ కూడా కలిపి అన్నింటినీ ‘చలసాని ప్రసాద్ సాహిత్య సర్వస్వం–1’గా తెచ్చింది విరసం. శ్రీశ్రీతో తన అనుబంధం ‘ఎన్ని పుస్తకాలకైనా సరిపోనిది’ అంటారు ప్రసాద్. ‘కమ్యూనిస్టులు రాసేది ప్రచార సాహిత్యం అయితే, కమ్యూనిస్టు వ్యతిరేకులు రాసేది ప్రచార సాహిత్యం కాదా?’ అని ఇస్మాయిల్‌ను విమర్శిస్తారు. విరసం పీపుల్స్‌వార్ పార్టీ ఆదేశాల ప్రకారం నడిచే అనుబంధ సంస్థ కాదనీ, అది అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమాఖ్యలో అంతర్భాగమనీ సంఘ కార్యదర్శిగా ప్రకటిస్తారు. రావిశాస్త్రి రచనల్లో అధిక వర్ణన ఉంటుందన్న రా.రా. అభిప్రాయంతో ‘తీవ్రంగా’ విభేదిస్తారు. ‘రష్యన్ నవల ఏది చదువుతున్నా అసలు సాహిత్యమంటే ఇదేననిపిస్తుంది. మిగతావి చప్పగా, పిప్పిగా ఉంటాయి’ అని చలం దగ్గర రష్యన్ సాహిత్యం మీద అభిప్రాయం తీసుకుంటారు. ‘సాహిత్యంలో రాజకీయాల ప్రవేశం ఎంతవరకుండాలి?’ అంటే, ‘జీవితంలో ఉన్నంతమేరకు’ అని సమాధానం చెబుతారు. ‘జీవితంలో, రాజకీయాల్లో, నిర్మాణాల్లో, సిద్ధాంతాల్లో తలెత్తే ఏ వాద వివాదానికైనా, అన్వేషణకైనా, అర్థానికైనా ఆయన సాహిత్యంలోంచి ఏదో ఒక ఉటంకింపు తీసి మన చేతికి అందించేవాడు’ అంటారు పాణి. అలాంటి చలసానిని ‘సమగ్రం’గా కాకపోయినా(‘ప్రసంగాలు, పాఠాలు, లేఖలు, ముఖ్యంగా కవిత్వం’ ఈ సంకలనంలో లేవు) చాలా మేరకు అర్థం చేయించే పుస్తకం! సాహిత్యం డెస్క్ -
విభజన హామీల సాధన కోసం కలిసి పోరాడాలి
వేసవి తరువాత ప్రత్యేక కార్యాచరణ విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని తాళ్లరేవు (ముమ్మిడివరం) : కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయాలంటే అన్ని పక్షాలు కలిసి పోరాడాలని విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీలోని బాపనపల్లిలో పేరిచర్ల రాజగోపాల్‌రాజు ఫార్మ్‌హౌస్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుందన్నారు. ఉత్తరాదిలో ఓ రాష్ట్రానికి రూ.43వేల కోట్లు ఇచ్చి, మన రాష్ట్రానికి మాత్రం రూ.2500 కోట్లు ముష్టి వేశారన్నారు. ఏపీలో జిల్లాకు 50 కోట్లు ఇచ్చి చట్టబద్ధత తీసుకొచ్చాం పండగ చేసుకోండి అనడం ఎంతవరకు న్యాయమన్నారు. తెలంగాణాలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలకు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున ఇచ్చారని, అయితే ఆంధ్రాలో కేవలం రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ఇచ్చారన్నారు. ఇక కేంద్రం రాష్ట్రానికి చేసిందేంటని ప్రశ్నించారు. పోలవరంపై సరైన స్పష్టత లేదని, పోలవరం ప్రాజెక్టుకు రూ.ఏడు వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, రూ.1900 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కీం నుంచి ఇచ్చామంటున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నింటికీ కేంద్రమే నిధులు ఇవ్వాలన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.7500 కోట్లు హడ్కో ద్వారా అప్పు ఇప్పిస్తామని కేంద్రం చెబుతోందని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అప్పులతో కట్టాల్సిన పరిస్థితి ఏంటన్నారు. హైదరాబాద్ నుంచి రావాల్సిన ఉమ్మడి నిధులు సుమారు రూ.32 వేల కోట్లు రావాలని అంటున్నారని అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. దీనిపై ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్‌నుంచి నీళ్లు రావాలంటే తెలంగాణా ప్రభుత్వం విడుదల చేయాలి. దానిని సెంట్రల్ కమిటీకి అప్పగించమంటే దానిపై స్పందించడం లేదన్నారు. 2018లోపు మన రాష్ట్రంలో పోర్టును అభివృద్ధి చేయాలని విభజన చట్టంలో ఉంటే ఒక్క రూపాయి ఇవ్వకపోగా, రూ.25 వేల కోట్లతో తమిళనాడులో మూడో పోర్టు కొల్లేచల్కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం దారుణమన్నారు. విభజన చట్టం 108వ అధికరణం ప్రకారం రాష్ట్రపతికి ఉన్న అధికారాలు జూన్ 1తో అయ్యిపోతున్నా, ఏ ఒక్కరూ స్పందించడం లేదన్నారు. తెలుగువాళ్ల మధ్య ఐక్యత లేకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాలలో వెనక్కిపోతుందన్నారు. ఇప్పటికైనా ఎంపీలు భయం వదిలి పోరాడితే విభజన చట్టంలో ఉన్న హామీలు అన్నీ నెరవేరతాయన్నారు. ప్రత్యేక హోదాపై భవిష్యత్ కార్యాచరణ చేస్తున్నామని, దీనిలో భాగంగా పలు గీతాలు, పుస్తకాల ద్వారా చైతన్యం చేస్తామన్నారు.