విభజన హామీల సాధన కోసం కలిసి పోరాడాలి
విభజన హామీల సాధన కోసం కలిసి పోరాడాలి
Published Tue, Apr 18 2017 10:36 PM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
వేసవి తరువాత ప్రత్యేక కార్యాచరణ
విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని
తాళ్లరేవు (ముమ్మిడివరం) : కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయాలంటే అన్ని పక్షాలు కలిసి పోరాడాలని విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీలోని బాపనపల్లిలో పేరిచర్ల రాజగోపాల్‌రాజు ఫార్మ్‌హౌస్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుందన్నారు. ఉత్తరాదిలో ఓ రాష్ట్రానికి రూ.43వేల కోట్లు ఇచ్చి, మన రాష్ట్రానికి మాత్రం రూ.2500 కోట్లు ముష్టి వేశారన్నారు. ఏపీలో జిల్లాకు 50 కోట్లు ఇచ్చి చట్టబద్ధత తీసుకొచ్చాం పండగ చేసుకోండి అనడం ఎంతవరకు న్యాయమన్నారు. తెలంగాణాలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలకు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున ఇచ్చారని, అయితే ఆంధ్రాలో కేవలం రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ఇచ్చారన్నారు. ఇక కేంద్రం రాష్ట్రానికి చేసిందేంటని ప్రశ్నించారు. పోలవరంపై సరైన స్పష్టత లేదని, పోలవరం ప్రాజెక్టుకు రూ.ఏడు వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, రూ.1900 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కీం నుంచి ఇచ్చామంటున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నింటికీ కేంద్రమే నిధులు ఇవ్వాలన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.7500 కోట్లు హడ్కో ద్వారా అప్పు ఇప్పిస్తామని కేంద్రం చెబుతోందని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అప్పులతో కట్టాల్సిన పరిస్థితి ఏంటన్నారు. హైదరాబాద్ నుంచి రావాల్సిన ఉమ్మడి నిధులు సుమారు రూ.32 వేల కోట్లు రావాలని అంటున్నారని అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. దీనిపై ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్‌నుంచి నీళ్లు రావాలంటే తెలంగాణా ప్రభుత్వం విడుదల చేయాలి. దానిని సెంట్రల్ కమిటీకి అప్పగించమంటే దానిపై స్పందించడం లేదన్నారు. 2018లోపు మన రాష్ట్రంలో పోర్టును అభివృద్ధి చేయాలని విభజన చట్టంలో ఉంటే ఒక్క రూపాయి ఇవ్వకపోగా, రూ.25 వేల కోట్లతో తమిళనాడులో మూడో పోర్టు కొల్లేచల్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం దారుణమన్నారు. విభజన చట్టం 108వ అధికరణం ప్రకారం రాష్ట్రపతికి ఉన్న అధికారాలు జూన్ 1తో అయ్యిపోతున్నా, ఏ ఒక్కరూ స్పందించడం లేదన్నారు. తెలుగువాళ్ల మధ్య ఐక్యత లేకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాలలో వెనక్కిపోతుందన్నారు. ఇప్పటికైనా ఎంపీలు భయం వదిలి పోరాడితే విభజన చట్టంలో ఉన్న హామీలు అన్నీ నెరవేరతాయన్నారు. ప్రత్యేక హోదాపై భవిష్యత్ కార్యాచరణ చేస్తున్నామని, దీనిలో భాగంగా పలు గీతాలు, పుస్తకాల ద్వారా చైతన్యం చేస్తామన్నారు.
Advertisement