ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశ రాజధాని నగరంలో భారీ ర్యాలీ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో RJD నాయకుడు తేజస్వి యాదవ్.. ప్రధాని 'నరేంద్ర మోదీ'పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ హామీలు చైనా వస్తువుల లాంటివని, అవన్నీ కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఉద్దేశించినవని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. అలాంటి హామీల మాయలో ప్రజలు పడవద్దని కోరారు. దేశంలో ఇప్పుడు 'ప్రకటించని ఎమర్జెన్సీ' నెలకొందని ఆరోపించారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేయడానికి ప్రతిపక్షాలు అనుమతించవని నొక్కి చెప్పారు.
ప్రధాని మోదీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని ఆరోపించారు. హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విధానాన్ని అందరూ చూసారు. బీజేపీ బెదిరింపులకు మేము భయపడేది లేదు. ఒక సింహాన్ని మాత్రమే అరెస్ట్ చేశారు. మేము కూడా సింహలమే.. పోరాటానికి సిద్ధంగా ఉన్నామని యాదవ్ అన్నారు.
ప్రజలు తగిన గుణపాఠం చెబితే మోదీ అధికారంలోకి రారు. ఈ ఉదయం బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రదానం చేసే కార్యక్రమంలో.. రాష్ట్రపతి అద్వానీకి భారతరత్న ప్రదానం చేస్తున్నప్పుడు, మోడీ జీ అద్వానీ జీ పక్కన కూర్చున్నారు కానీ రాష్ట్రపతి గౌరవార్థం కూడా నిలబడలేదని అన్నారు.
దేశం నలుమూలల ఉన్న ఇండియా కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సోదరభావాన్ని కాపాడేందుకు కూటమి ఐక్యంగా ఉందని యాదవ్ అన్నారు. ప్రజలే నిజమైన గురువులు.. దేశాన్ని ఎవరు పాలించాలో మీరే నిర్ణయించుకోవాలని యాదవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment