చలసాని సాహిత్య సర్వస్వం
‘తాళాలు లేని ఇళ్లు, పరీక్షలు లేని చదువులు, పోలీసుల అవసరం లేని సమాజం ఏర్పాటు చేసుకుందామని’ కల కనేవారట చలసాని ప్రసాద్. దానికోసం ఆయన ‘మార్క్సిస్టు’, ‘రాజకీయాల్లో స్టాలినిస్టు’ అయ్యారు. ‘నా అయిదో ఏట (1937) నుంచే నేను కమ్యూనిస్టునే’ అని ప్రకటించుకున్నారు. ‘ఆయనకు ఎంత పెద్ద లైబ్రరీ ఉన్నదో అంతకన్న పెద్ద స్నేహ ప్రపంచం ఉన్నది. బహుశా జీవితకాలంలో ఈ రెండు ప్రపంచాలలో తేలియాడే ఆనందాన్ని అనుభవించడానికే అనుకుంటాను తన తర్వాత మిగిలే రచన మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు,’ అంటారు వరవరరావు.
బహుశా అందువల్లే, (తక్కువగా) రచయితా, (ఎక్కువగా) చదువరీ అయిన చలసాని ఆ రాసిన ‘కొన్ని’ వ్యాసాలూ, ముందుమాటలూ, సంపాదక లేఖలూ, వెల్లడించిన అభిప్రాయాలూ, స్పందనలూ, చేసిన–ఇచ్చిన ఇంటర్వ్యూలూ, వేసిన కరపత్రాలూ కూడా కలిపి అన్నింటినీ ‘చలసాని ప్రసాద్ సాహిత్య సర్వస్వం–1’గా తెచ్చింది విరసం.
శ్రీశ్రీతో తన అనుబంధం ‘ఎన్ని పుస్తకాలకైనా సరిపోనిది’ అంటారు ప్రసాద్. ‘కమ్యూనిస్టులు రాసేది ప్రచార సాహిత్యం అయితే, కమ్యూనిస్టు వ్యతిరేకులు రాసేది ప్రచార సాహిత్యం కాదా?’ అని ఇస్మాయిల్‌ను విమర్శిస్తారు. విరసం పీపుల్స్‌వార్ పార్టీ ఆదేశాల ప్రకారం నడిచే అనుబంధ సంస్థ కాదనీ, అది అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమాఖ్యలో అంతర్భాగమనీ సంఘ కార్యదర్శిగా ప్రకటిస్తారు. రావిశాస్త్రి రచనల్లో అధిక వర్ణన ఉంటుందన్న రా.రా. అభిప్రాయంతో ‘తీవ్రంగా’ విభేదిస్తారు. ‘రష్యన్ నవల ఏది చదువుతున్నా అసలు సాహిత్యమంటే ఇదేననిపిస్తుంది. మిగతావి చప్పగా, పిప్పిగా ఉంటాయి’ అని చలం దగ్గర రష్యన్ సాహిత్యం మీద అభిప్రాయం తీసుకుంటారు. ‘సాహిత్యంలో రాజకీయాల ప్రవేశం ఎంతవరకుండాలి?’ అంటే, ‘జీవితంలో ఉన్నంతమేరకు’ అని సమాధానం చెబుతారు.
‘జీవితంలో, రాజకీయాల్లో, నిర్మాణాల్లో, సిద్ధాంతాల్లో తలెత్తే ఏ వాద వివాదానికైనా, అన్వేషణకైనా, అర్థానికైనా ఆయన సాహిత్యంలోంచి ఏదో ఒక ఉటంకింపు తీసి మన చేతికి అందించేవాడు’ అంటారు పాణి. అలాంటి చలసానిని ‘సమగ్రం’గా కాకపోయినా(‘ప్రసంగాలు, పాఠాలు, లేఖలు, ముఖ్యంగా కవిత్వం’ ఈ సంకలనంలో లేవు) చాలా మేరకు అర్థం చేయించే పుస్తకం!
సాహిత్యం డెస్క్