రూ.100 కోట్ల రుణాల లక్ష్యం
– రేపటి నుంచి అందుబాటులో బ్యాంకు సేవలు
– విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు
అనంతపురం అగ్రికల్చర్ : సామాన్య, మధ్య తరగతి వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వచ్చే రెండేళ్లలో కనీసం రూ.100 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలిపారు. ఆదివారం నుంచి జిల్లా ప్రజలకు ‘విశాఖ’ బ్యాంకు సేవలు అందజేస్తామన్నారు. స్థానిక రాజురోడ్డులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ బ్యాంకు 45వ శాఖను ‘అనంత’లో లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
రిజర్వ్‌బ్యాంకు నియమ నిబంధనలకు లోబడి సహకార చట్టానికి అనుగుణంగా తమ బ్యాంకు సేవలందచేస్తుందన్నారు. దేశంలోనే మొదటి 20 అర్బన్ బ్యాంకుల జాబితాలో తమ బ్యాంకు స్థానం సంపాదించిందని గుర్తు చేశారు. అన్ని రకాల ఆధునాతన సేవలు, సులభమైన బ్యాంకింగ్ అందజేస్తామన్నారు. ఏ ప్రాంతంలో సేకరించిన డిపాజిట్లు ఆయా ప్రాంత ప్రజలు, ఖాతాదారుల అభ్యున్నతి కోసమే రుణం రూపంలో అందజేస్తామన్నారు. సెలవు రోజైనా ప్రతి ఆదివారం కూడా బ్యాంకు పనిచేస్తుందన్నారు. విశాఖ బ్యాంకు సీఈవో పీవీ నరసింహారావు, గుత్తి కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎస్కే అబ్దుల్ జిలానీ పాల్గొన్నారు.