కేశినేనిపై బాలయ్య అభిమానుల గుర్రు!
సాక్షి, విజయవాడ: టీడీపీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని శ్రీనివాస్(నాని) కాళేశ్వరీ ట్రావెల్స్ అధినేత చలసాని రవి మధ్య ప్రారంభమైన ఫ్లెక్సీల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. ఎన్టీఆర్ సొంత జిల్లాలోనే సినీనటుడు బాలకృష్ణ ఫొటోలను తీసివేయాలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కేశినేని నాని హుకుం జారీ చేయడాన్ని బాలయ్య అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
బాలయ్య ఫ్లెక్సీలు కానీ, ఫొటోలు కానీ తీయించి వేసే సాహసం ఇప్పటి వరకు జిల్లాలో ఏ తెలుగుదేశం నాయకుడు చేయలేదని, కేశినేని నాని ఏ అండ చూసుకుని ఈ విధంగా ఆదేశాలు జారీ చేశారని వారు ప్రశ్నిస్తున్నారు.
సామాజిక వర్గంలోనూ చర్చ.....
కేశినేని నాని, కాళేశ్వరీ రవి ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ముఖ్యంగా జిల్లాలో బలంగా ఉన్న ఈ సామాజికవర్గంలో ఉన్న ఈ ఇరువురు ముఖ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుకోవడం సామాజిక వర్గంలో కలకలం రేపింది. ‘తెలుగుదేశంలో ప్లెక్సీల లొల్లి’ అంటూ ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనం ఈ సామాజిక వర్గంలో చర్చనీయాశంగా మారింది. ఇప్పటికే ఇదే సామాజిక వర్గానికి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమాతో, గద్దె రామ్మోహన్‌కు సఖ్యత లేకపోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు.
చీలిపోతున్న ట్రాన్స్‌పోర్టు రంగం....
సీమాంధ్ర ప్రాంతంలో ట్రావెల్స్ యజ మానులంతా కేశినేని ట్రావెల్స్, కాళేశ్వరీ ట్రావెల్స్ అధినేతల కన్ను సన్నల్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య వ్యాపార పరంగా తప్ప వ్యక్తిగతంగా విభేధాలు లేకపోవడంతో ట్రాన్స్‌పోర్టు రంగంలోని వారంతా ఇద్దరితోనూ కలిసిమెలిసి ఉంటున్నారు.
ప్రస్తుతం కేశినేనినాని, కాళేశ్వరీ రవి మధ్య ఏర్పడిన వివాదం ముదరడంతో ట్రాన్స్‌పోర్టు రంగాన్ని కూడా కుదిపేస్తోంది. అయితే బాలకృష్ణ ఎప్పుడు వచ్చినా కేశినేని నానిని పట్టించుకోకుండా కాళేశ్వరీ రవితోనే ఉండటం కేశినేనికి ఆగ్రహం తెప్పించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.