చల్లూర్ గ్యాంగ్‌రేప్ నిందితులకు శిక్ష
- గొట్టె శ్రీనివాస్, ముద్దం అంజయ్యలకు 20 ఏళ్లు జైలు
- మరో నిందితుడి విచారణపై స్టే
- తీర్పు వెలువరించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు
కరీంనగర్ క్రైం/ కరీంనగర్ లీగల్/ వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూర్ దళిత యువతిపై గ్యాంగ్‌రేప్ నిందితులకు శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జి నాగరాజు శుక్రవారం తీర్పు వెలువరించారు. ముగ్గురు నిందితుల్లో గొట్టె శ్రీనివాస్(22), ముద్దం అంజయ్య(23)లకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ ఘటనపై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై కిరణ్‌తోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను నాటి ఎస్పీ జోయల్‌డేవిస్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై 22 మంది సాక్ష్యాలను విచారించారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జీ నాగరాజు శుక్రవారం తీర్పు చెప్పారు. గొట్టె శ్రీనివాస్, ముద్దం అంజయ్యలకు చెరో 20 ఏళ్లు జైలుశిక్షతోపాటు రూ.11,800 జరిమానా విధించారు. ఈ జరిమానాలో నుంచి బాధితురాలికి ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లిం చాలని తీర్పు వెలువరించారు. మూడో నిందితుడు ముద్దం రాకేశ్‌ను మొదట మైనర్‌గా, తర్వాత మేజర్‌గా నిర్ధారించారు. దీంతో నిందితుడు హైకోర్టును ఆశ్రయిం చాడు. తదుపరి విచారణపై హైకోర్టు స్టే విధించింది.
నాడు జరిగిందేమిటి..: వీణవంకలో ఉచిత పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ కేంద్రానికి హాజరవుతున్న యువతికి అదే క్యాంపునకు వస్తున్న శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన గొట్టె శ్రీనివాస్‌తోపాటు కల్వలకు చెందిన ముద్దం రాకేశ్, ముద్దం అంజయ్య పరిచయమయ్యారు. శంకరపట్నం మండలం కాచాపూర్ గుట్టల వద్ద 2016 ఫిబ్రవరి 10న శ్రీనివాస్(25), అంజయ్య(23), రాకేశ్(17)లు యువ తిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను రాకేశ్ సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఈ వీడియో కాస్త బయటికి రావడంతో గ్రామస్తులు ఫిబ్రవరి 24న నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఉరిశిక్ష కోసం హైకోర్టుకు: బాధితురాలి తండ్రి
‘నా కూతురుకు జరిగిన అన్యాయం మరో కూతురుకు ఎదురుకావద్దనే పోరాడినం. ఉరిశిక్ష కోసం హైకోర్టుకు వెళ్తా. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. దళిత బిడ్డకు అన్యాయం జరిగితే ఇట్లనే స్పందిస్తరా..’ అని బాధితురాలి తండ్రి ప్రభుదాస్ వాపోయాడు.