హైకోర్టు వద్ద టెన్షన్.. టెన్షన్
హైదరాబాద్: తెలంగాణలో హైకోర్టు వివాదం రోజుకింత ముదురుతుంది. 11మంది న్యాయాధికారులపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు వచ్చే నెల 15వరకు సామూహిక సెలవులు పెట్టారు. దీంతోపాటు నేడు న్యాయవాదులు చలో హైకోర్టు పిలుపునివ్వడంతో వారితోపాటు న్యాయమూర్తులు కూడా కలిసి వెళ్లే అవకాశం ఉంది. చలో హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు తరలి వస్తున్నారని ఇప్పటికే న్యాయవాదుల జేఏసీ చెప్పడంతో హైకోర్టు వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.
ఇప్పటికే పలు మార్గాల గుండా న్యాయవాదులు హైకోర్టు వద్దకు భారీ సంఖ్యలో వస్తున్నారు. మదీనా వద్ద కొంతమంది న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే, మొన్న గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లుగానే ఈ రోజు కూడా న్యాయాధికారులు ర్యాలీగా వెళ్లి గవర్నర్కు వినతి పత్రం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా గత రోజులకంటే ఈ వివాదం మరింత ముదురుతోందని చెప్పవచ్చు. హైకోర్టులో న్యాయాధికారుల నియామకాలకు సంబంధించి ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ తరుపు న్యాయాధికారులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.