ఉత్కంఠ రేపుతున్న ‘చలో ఇందిరాపార్క్’
అజ్ఞాతంలోకి టీజేఏసీ, ఇతర ముఖ్య నేతలు.. సెల్ఫోన్లూ స్విచ్చాఫ్
- ఎలాగైనా ధర్నాచౌక్ చేరుకుంటామంటున్న టీజేఏసీ, అఖిలపక్షనేతలు
- మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ, అఖిలపక్ష నేతలు సోమవారం తలపెట్టిన ‘చలో ఇందిరాపార్క్’ కార్యక్రమం ఉత్కంఠను రేపుతోంది. చలో ఇందిరా పార్క్ పేరిట ధర్నా చౌక్ ఆక్రమణకు ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో టీజేఏసీ, అఖిలపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ, బీజేపీ, న్యూ డెమొక్రసీ లోక్‌సత్తా, ఆమ్ఆద్మీ వంటి పార్టీలతో పాటు వివిధ ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమను పోలీసులు అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో టీజేఏసీ, అఖిలపక్షనేతలు అప్రమత్త మయ్యారు. పోలీసులకు దొరకకుండా సోమవారం నాటి ధర్నాచౌక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో టీజేఏసీ, ఇతర పార్టీల ముఖ్య నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు.
టీజేఏసీ చైర్మన్ ప్రొఫెస ర్ కోదండరాం సహా జేఏసీ నేతలు సెల్ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. అయితే టీఆర్ఎస్ నేత ముఠా గోపాల్ నేతృత్వంలో పలువురు స్థానికులు ధర్నాచౌక్‌ను తరలించాలని పోటీగా కార్యక్రమాన్ని నిర్వహించడంతో రాజకీయంగా వేడిని రగిలిస్తోంది. ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌ను కొనసాగించాలం టూ ఇప్పటికే నెలరోజులుగా జేఏసీ, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతిపక్షాలు దీక్షలు నిర్వహించా యి. కలెక్టర్, రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం సమర్పించ డం, అమరవీరుల స్మారక స్తూపం దగ్గర మౌనదీక్ష వంటి కార్యక్రమాలను నిర్వహించాయి. చివరగా ధర్నాచౌక్ ఆక్రమణ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించినా సోమవారం ఉదయం 11 గంటలకు ధర్నాచౌక్‌కు చేరుకోవాలని విపక్ష నేతలు పిలుపునిచ్చారు. మిలియన్ మార్చ్, సాగరహారం వంటి కార్యక్రమాల స్ఫూర్తితో విజయవంతం చేయాలని నిర్ణయించారు.
సర్కారు కక్షతో వ్యవహరిస్తోంది: టీజేఏసీ, అఖిలపక్షాలు
ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన ప్రభుత్వం ప్రజలపై కక్షపూ రితంగా, దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తోందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ధర్నాచౌక్ పరిరక్షణకమిటీ కో కన్వీ నర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జి.నర్సింహారావు, సీపీఐ(ఎం–ఎల్) న్యూ డెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కె.గోవర్ధ న్ తదితరులు ఒక సంయుక్త ప్రకటనలో ఆరోపించా రు. ధర్నాచౌక్ పరిరక్షణకోసం గత రెండు నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు జరిగాయని, టీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందని పేర్కొన్నారు. వివిధ వర్గాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, ధర్నాచౌక్‌కు అనుకూలంగా ప్రకటనలు వెలువడుతున్నాయన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరా పార్క్ పరిసర కాలనీ వాసులు, ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్ పేరుతో కొంతమందిని రెచ్చగొట్టి పోలీసుల కనుసన్నల్లో పోటీ ధర్నా నిర్వహించారని వారు ఆరోపించారు. పోలీసులు చట్టాన్ని పక్కనబెట్టి ప్రభుత్వానికి డూడూ బసవన్నల్లాగా వ్యవహరిస్తున్న తీరును జేఏసీ, అఖిలపక్ష నేతలు ఖండించారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు నిర్వహించతలపెట్టిన ధర్నాచౌక్ ఆక్రమణకు పోలీసులు అనుమతించాలని, లేకుంటే ఇందిరాపార్క్ వద్ద ఆదివారం జరిగిన ధర్నా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగినట్టుగా తేలిపోతుందని అన్నారు. ప్రతిపక్షాల గొంతులను నొక్కడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి, పోలీసులకు కనువిప్పు కలిగేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ధర్నాచౌక్‌ను నగరంలోనే కొనసాగిం చాల్సిన ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి అనేక రీతులలో తెలియచేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.ప్రజల వినతులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.కార్యక్రమ నిర్వాహకులు వివిధ జిల్లాలనుంచి కూడా తమ కార్యకర్తలను విడతల వారీగా హైదరాబాద్‌కు తరలించినట్టు తెలుస్తోంది.
అష్ట దిగ్బంధంలో ధర్నాచౌక్
టీజేఏసీ, అఖిలపక్షం తలపెట్టిన ధర్నాచౌక్ ఆక్రమణ కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌ను అష్ట దిగ్బంధం చేశారు. ధర్నాచౌక్‌కు వచ్చే దారులన్నింటిని ముళ్ల కంచెలు, భారీ బారికేడ్లతో మూసి వేశారు. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. హైదరాబాద్‌లోని పోలీసులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 16 వందల మంది పోలీసులను భద్రత ఏర్పాట్ల కోసం రప్పించినట్టు సమాచారం.
ఆదివారం రోజంతా ఎన్టీఆర్ స్టేడియంలో పోలీసు బలగాలకు డీసీపీ, ఏసీపీల ఆధ్వర్యంలో ఆందోళనాకారులను అడ్డుకోవడంపై ప్రత్యేక డ్యూటీ మీట్‌ను నిర్వహించారు. ఆదివారం రాత్రే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌కు దారితీసే నలువైపులా సోమవారం ఉదయం ఆరు గంటల నుంచే పోలీసులు విధుల్లో చేరనున్నారని తెలుస్తోంది. పరిస్థితి విషమిస్తే ఎదుర్కోవడానికి రాపిడ్ యాక్షన్ ఫోర్సుతో పాటు వాటర్కెనాన్లను కూడా సిద్ధం చేస్తున్నారు.