విషాదం మిగిల్చిన సరదా.. నీటమునిగి నలుగురు మృతి, మరొకరి గల్లంతు
గుర్ల/బాపట్ల, న్యూస్‌లైన్: విహారయాత్ర విషాదం మిగిల్చింది. విజయనగరం, గుంటూరు జిల్లాల్లో గురువారం నీట మునిగి నలుగురు విద్యార్థులు మరణించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు. విజయనగరం జిల్లా చింతలపేటకు చెందిన గీత (14), సుంకరి భవాని (13), తాళ్లపూడి మౌనిక (14)లతో సహా 40 మంది పిల్లలు పాఠశాలకు సెలవు కావడంతో సమీపంలోని మామిడితోటకు పిక్నిక్కు వెళ్లారు. బంతాట ఆడుతుండగా బంతి పక్కనే ఉన్న చంపావతి నదిలోకి వెళ్లింది.
భవాని బ ంతి తీస్తూ ప్రమాదవశాత్తు నీళ్లలోకి పడిపోయింది. సహాయంగా వచ్చిన గీత, వీళ్లిద్దరి కోసం వచ్చిన మౌనిక కూడా నదిలో మునిగిపోయారు. గ్రామస్తులు వచ్చేసరికే ఆ ముగ్గురు బాలికలు మృతిచెందారు. మరో ఘటనలో గుంటూరు హిందూ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న 13 మంది విద్యార్థులు సూర్యలంకలో సముద్ర స్నానం చేస్తుండగా అలల తాకిడికి ఎం.శ్రీనివాసరావు, ఎం.సురేంద్ర, వి.గౌతమ్, సురేష్, ఆర్వేటి మణికుమార్ (21) కొట్టుకుపోయారు. మణికుమార్ మృతదేహం తీరానికి కొట్టుకు రాగా, మిగిలిన వారిని మెరైన్ సిబ్బంది రక్షించారు. సురేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.