ఖైదీలపై యువకుల దాడి...
చంచల్గూడ: తమకు మొదట పెట్రోల్ పోయాలని ఇద్దరు యువకులు ఖైదీలను దుర్భాషలాడి వారిపై దాడికి దిగిన సంఘటన మంగళవారం రాత్రి చంచల్గూడ పెట్రోల్ బంకులో చోటు చేసుకుంది. ఖైదీలతో అనుచితంగా ప్రవర్తించిన యువకులపై డబీర్పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు.
చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ బి. సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పాతబస్తీకి చెందిన ఇద్దరు యువకులు సయ్యద్ అబ్దుల్ గఫర్, మహ్మద్ అహ్మద్ అలీ పెట్రోల్ కోసం వచ్చారు. వారు క్యూ పాటించకుండా మొదట తమకే పెట్రోల్ పోయాలని ఖైదీ రాములును దుర్భాషలాడి అతని చేతిలో పెట్రోల్ గన్ను లాక్కునే ప్రయత్నం చేయగా ఖైదీలు వారించారు. ఈ క్రమంలో యువకులు ఖైదీలపై దాడికి దిగారు. యువకులను సిబ్బంది వెనక్కు పంపారు. ఖైదీలు దాడి చేసినట్లు యువకులు, ఖైదీల విధులకు ఆటంకం కలింగిచారని జైలు అధికారులు డబీర్పురా పీఎస్లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు.