చందామామ శంకర్! పిల్లలకు మాత్రం బొమ్మల మామ!
చాలా ఏళ్ల క్రితం మాట. దారులు గూగుల్ ని పరవని రోజులు, మొబైళ్ళు ఊబర్ ని పిలవని కాలాలు. " పెరియ ఓవియ శంకర్ వీటిర్కు సెల్లుమ్ వలి?" అని అడుగుతూ అడుగుతూ మదరాసులోని చందమామ శంకర్ గారి ఇల్లు చేరుకున్నాము మిత్రుడు విజయవర్దన్ గారూ, నేనూను. దాదాపు నాలుగయిదు గంటలు ఆయనతో గడిపాము. ఇదంతా పన్నెండు సంవత్సరాల క్రితపు మాట . అప్పుడు ఆయన దాదాపు తొంబయ్ సంవత్సరాలకు దగ్గరగా ఉన్నారు. తొంబయ్ అనేది ఒక సంఖ్య మాత్రమే అంతులేని ఆయన ఉత్సాహానికి, ఆరోగ్యానికి తగిలించడానికి ఏ అంకె లేదు. మానవుడు మిల మిలా మెరిసిపోతున్నారు. ఆరోగ్యకరమైన బుర్ర ఉన్న వారి శరీర లక్షణమది.
చందమామ, యువ, రామకృష్ణ ప్రభ పత్రికల్లో బొమ్మలు తప్పా ఈయన ది గ్రేట్ దేవి ప్రసాద్ రాయ్ చౌధురి శిష్యుడని, ఇంకా నూనుగుమీసాల ప్రాయంలో మహత్మా గాంధీ ఎదురుగా ఒక్కడు నిలబడి తగువుపెట్టుకున్నవాడని అప్పటికి తెలియనే తెలియదు. ఆ మిలాఖత్ అంతా మా ప్రెండ్ విజయ్ వర్దన్ గారు అప్పట్లో వీడియో ఎక్కించినట్లు కూడా గుర్తు నాకు. అది దొరికితే ఇంకా బావుణ్ణు. బోల్డన్ని కొత్త కబుర్లు వ్రాయవచ్చు. ఇప్పుడు చెప్పేదంతా, నా బుర్రలో మిగిలి ఉన్నా జ్ఞాపకాల గుర్తులే . చదువుకున్నదేమో పెయింటింగ్! జీవితాంతం రేఖా చిత్ర కళను గీచి దేశంలో ఉన్న అతి గొప్ప రేఖా చిత్రకారుల్లో ఒకడిగా నిలబడి చందమామ శంకర్ గా భారతదేశంలోని కొన్ని తరాల పిల్లలకు బొమ్మల మామ అయినవాడు.
చందమామ శంకర్’ గారిని అడిగితే ఆర్టిస్ట్ చిత్రా గారికి కడుపులో అల్సర్ అయ్యిందని, దాని వల్ల ఆయన మరణం సంభవించిందని చెప్పినట్లు నాకు గుర్తు. అప్పుడంతా ఆయనని చూసిన ఆనందంలో ఉన్నాము కాబట్టి ఏం అడిగింది! ఏం అడగాలి, మేము అడిగినది, ఆయన చెప్పింది అంతా రాసి పెట్టుకోవాలి అని కూడా నాకేమి కోరిక లేదు. ఆయనని చూడటమే ఒక భాగ్యంగా అక్కడికి వెళ్ళాము. నాకు ఉన్న కొరిక అల్లా, శంకర్ గారు, అటువంటి గొప్ప గొప్ప మానవులను, ఆయన అభిమానులుగా మనమందరం సత్కరించుకొవాలి , వారికి ఆ సత్కారం గొప్ప మధురానుభవంగా జీవితాంతం గుర్తు ఉండేలా చేయాలనే వెర్రి అత్యాశ మాత్రమే. ఇక్కడ మనం అనేది కేవలం మాటకు మాత్రమే బహువచనం. ముందు దారులు వేసి మన నడకకు అడుగు మెత్తగా పరిచినవారిని గౌరవించుకోవాలనే సంస్కారం ఎప్పుడు ఎంతగా చూసినా నాకు ఇక్కడెవరూ కనపడలేదు.
ఓపిక ఉన్నంత కాలం అటువంటి వ్యర్థ ప్రయత్నాలు చేసీ చేసీ ఇదిగో ఇప్పుడు ఇలా శుష్క వ్యాసాలు రాసుకునే స్థాయికి దిగింది జీవితం. ప్రాధమిక విద్య తరువాత బొమ్మలు నేర్చుకుందామని శంకర్ గారు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశం కోసం పరీక్ష కు హాజరయ్యారట. అక్కడ పెయింటింగ్ పరీక్షలో బొమ్మలు వేయడానికి తన దగ్గర సరైన సామాగ్రి లేక అక్కడే కాలేజీ ఆవరణ లో పడి ఉన్న పడి ఉన్న పాత ఎండి పోయిన కుంచెతో బొమ్మ వేశారట. ఆయన వేసిన బొమ్మ చూసి కాలేజీ ప్రిన్సిపల్ దేవి ప్రసాద్ రాయ్ చౌధురి గారి డంగై పోయి " ఉరేయ్ నాయనా, ఇది పెన్ అండ్ నైఫ్ టెక్నిక్, ఈ టెక్నిక్ లో బొమ్మలు వేసిన వాడికి తిరుగేముంది? ఇక్కడ చేరడానికి నీకు ఇక్కడ అడ్డం ఏముంది" అని కాలేజి లో సీట్ ఇచ్చేసారట. శంకర్ గారు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా అంటారు " నాయానా! అది టెక్నిక్ కాదూ నా మొహమూ కాదు. బ్రష్ చివరలన్ని రాలి పోయి మొండి అయి పోయింది.
అటువంటి దానితే గీస్తే ఎలా వస్తుందో అలానే గీశా నేను, అందులో నా ప్రతిభ ఏం లేదు, ఆ విషయం డి పి చౌధురి గారికి తెలీదు, నా భాగ్యం ఆయనవంటి గొప్ప గురువుదగ్గర చదువుకోడం" అంటూ చేతులెత్తి ఆకాశానికి దండం పెట్టుకున్నాడు. కాలేజిలో ఆయన చదువుకున్నది పెయింటింగ్. మరి ఇంత ప్రతిభావంతంగా లైన్ డ్రాయింగ్ ఎలా గీసారు అని అడిగిన మాటకు చందమామ లో చేరే వరకు రేఖ మీద సాధన చేసింది లేదు, అవసరార్థం అభ్యాసం చేసాను నా గీతకు గురువులు బర్న్ హోగార్త్, హాల్ ఫోస్టర్. బాపు గారి గురించి ఏమైనా చెప్పండి అని అడిగాను" ఆయన దర్శకుడుగా ఉండవలసిన అర్హతలు ఉన్న ఆర్టిస్ట్ బాబు, అలా అందరూ కాలేరు" మెచ్చుకోలుగా తల ఊపుతూ అన్నారు ఆయన. అదేంటో నాకు అర్థం కాలేదు. " మరి బాపు గారిని కలిసేవారా?" "లేదండి, కుటుంబరావు గారు ఆయన్నీ, మమ్మల్ని కలవనిచ్చేవారు కాదన్నాడు. బహుశా తెలుగు-తమిళ అనుకునే గొడవలు ఏమైనా వస్తాయని అనుకునే వారో ఏమిటో.
బాపు ఎప్పుడు వచ్చే వారో ఎలా వెళ్ళేవారో తెలీదు. వచ్చి కుటుంబరావు గారిని కలిసి అలానే కనపడకుండా వేరే వైపు నుండి వెళ్ళిపోయేవారు. వడ్డాది పాపయ్య గారిని కూడా మాతో పాటు ఉండనిచ్చే వారు కాదు. ఆయనకు ఒక ప్రత్యేకమైన గది, ఆయన దగ్గర అవీ ఇవీ చేసి పెట్టడానికి ఒక కుర్రవాడు ఉండేవాడు. నాకు పాపయ్య గారు అంటే చాలా ఇష్టం ఉండేది కానీ కార్యాలయంలో స్నేహం కుదరలేదు. ఒక రోజు రోడ్డు మీద పాపయ్య గారు ఒక పుస్తకాల కొట్టు దగ్గర బయట తాడుకు వేలాడ గట్టిన పుస్తకాలు తిరగేస్తూ కనపడ్డారు. పుస్తకాలు కొనకుండా అలా తిరగేసి నలిపేస్తు ఉన్నాడని కొట్టువాడు ఆయన్ని విసుక్కుంటున్నాడు. ఆ కొట్టువాడు నాకు బాగా పరిచయస్తుడే, నేను గబా గబా అక్కడికి వెల్లి "ఒరేయ్ ఆయన ఎవరనుకున్నావురా? నువ్వూ, నీ కుటుంబం ఈ రోజు నాలుగు ముద్దల అన్నం తింటున్నారు అంటే ఆ మహానుభావుడు వేసిన బొమ్మల పుస్తకాలు అమ్ముడు పోతున్నందుకే. ఆయన వడ్డాది పాపయ్య" అని చెప్పి మందలించారట.
ఆ షాపతను కొట్టు దిగి కిందికి వచ్చి పాపయ్య గారి కాళ్ళకు దండం పెట్టుకున్నాట్టా. ఇక ఎప్పుడు పాపయ్య గారు అటు వచ్చినా ఒక కుర్చీ వేసి కావలసిన పుస్తకాలు ఆయన ముందు ఉంచేవారని చెప్పుకుంటూ పోయారు. పాపయ్య గారికి చేపలు అంటే చాలా ఇష్టమని , ఇక్కడ మంచి చేపలు ఎక్కడ దొరుకుతాయని అడిగారట. శంకర్ గారు మద్రాసు పైన్ ఆర్ట్స్ కాలేజీలో చదివేటప్పుడే ఒకసారి గాంధి గారు మద్రాసుకు వచ్చారుట ఒక బహిరంగ సభ నిమిత్తం. ఈ బొమ్మలేసే కుర్రాళ్ళతో ఆయనకు పనిపడింది. వారు ఆ సభా ప్రాంగణాన్ని, ఆ మైదానాన్ని, ఆ గోడలను రంగులతో, రంగ వల్లులతో, తోరణాలతో తమ సమస్త చిత్రకళతో అలంకరించారు. పనంతా అయిపోయింది. ఈ చిత్రకళా రత్నాలకు గాంధి గారి ఆటోగ్రాఫ్ కావాలి. చిన్న దేహాలు ముక్కలు చెక్కలు చేసుకుని మరీ బాపు సేవకు అంకితం అయ్యారు కదా, "అదెంత పనర్రా పిల్లలూ రండ్రండి నా దగ్గరకు" అని బోసినవ్వుతో పిలుస్తారనుకున్నారు. సంతకం కోసం సందేశం తీసుకెళ్ళిన పెద్ద మనిషితో అన్నారుట.
"నా సంతకం అయిదు రూపాయలు. అటు నోటు ఇచ్చి ఇటు దస్తఖత్ అందుకోవచ్చు" అని బాపు మాట. పిల్లలకు వళ్ళు మండింది. ఎండనక నీడనెరుగక ఇంత పని చేసాం కదా, మాకు ఇవ్వాల్సిందిపోయి పైగా మా దగ్గరే ఎదురు వసూలా? అని అన్నిరంగుల పిల్లలు ఒకే ఎర్ర రంగై పోయి నానా గోల చేస్తే " ఇలా గోల కూడదురా , మీలో మీ తరుపున ఎవరో ఒకరు రండి, పెద్దాయనతో మాట్లాడండి" అని కాలేజీ ప్రిన్సిపాల్ గారు నచ్చచెప్పారు. పిల్లల తరపున యువ నాయకుడు శంకర్. ఆటో ఇటో తేలిపోవాలి అనుకుంటూ గాంధీ గారి గదిలో చేరారుట. శంకర్ గారు ఇలా అన్నారు "లోపల ఆ గదిలో ఆ మధ్య కూచుని ఉన్నాడండీ మహాత్ముడు. పచ్చని శరీర ఛాయ, పోతపోసిన బంగారు విగ్రహం వంటి మనిషి . నా కోపం గీపం, మనిషిని ఎగిరెగిరి పడ్డం అదంతా ఎలా పోయిందో నాకు తెలీదు. చేతులు రెండూ ఒకటై ఆయనకు నిలువెల్లా దండం అవ్వడం మాత్రం ఎరుగుదును" గాంధి గారు ఆయనతో అన్నారుట.
"బాబూ నేను మిమ్మల్ని డబ్బు ఆడిగానంటే నాకోసమనా? ఈ దేశానికి స్వాతంత్రం కావాలి ఆ ఉద్యమానికి ధనం అవసరం! ఆ ధనం కోసమని అమ్ముకోడానికి నాకు నేనే మార్గం" అంతా ఐపోయాకా నా బుద్ది తక్కువ బుర్రకు ఒక అనుమానం వచ్చి ఇలా అడిగా "మరే శంకర్ గారు, బాపు మహాత్ముడు పచ్చని పసిమి అయితే ఆ ఫోటోల్లో ఆలా నల్లగా ఉంటారే?" అని. " లేదు నాయనా ఆయన ఈశ్వరుడి సాక్షిగా పచ్చని మనిషి. కాంతులీనే దేహం" . తరువాత బల్బు వెలిగింది. మనం చూసిన గాంధి అల్లా , పాత ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫిల్ముల్లో, పాత పత్రికల్లోని తెలుపూ తెలుపూ ఫోటోగ్రాఫుల్లోనే కదా ఆ రెండు రంగుల ముద్రణ ముందు ఎర్రని ఎరుపయినా , పచ్చని పసిమయినా నలుపూ తెలుపేగా! పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన ఇంకో సంగతి శంకర్ గారి స్నేహితుడు ఒకాయన- పెద్ద స్థాయికి చేరుకున్న అధికారితో మాటా మాటా మాట్లాడుతూ శంకర్ గారు తన బొమ్మల జీవితం కన్నా తన మిత్రుడు ఆర్థికంగా చాలా బావున్నారని అసంతృప్తి వెల్లడిస్తే ఆయన ఒక విషయం చెప్పారట.
తన ఉద్యోగ బాధ్యత నిమిత్తం ఈయన ఒక అతి మారుమూల గిరిజన ప్రాంతానికి వెళ్లవలసి వచ్చిందని కాకులూ, చీమలు చొరబడని ఒక పల్లె వంటి పల్లె లో ఆవులు కాచుకునే కుర్రాడొకడికి ఒక పుస్తకం ఎలా దొరికిందో తెలీదు కానీ దొరికిందట. వాడు ఆ పుస్తకాన్ని చెట్టు తొర్రలో దాచుకుని, అప్పుడప్పుడూ ఆ పుస్తకాన్ని తీసి అందులో ఉన్న బొమ్మలని చూసి మురిసి పోతున్నాడట. ఈయన వెళ్ళి చదువు రాని కుర్రవాడు ఆ పుస్తకం లో ఏమి చూసి అంత మైకం ఎక్కించుకుంటున్నాడు అని చూస్తే ఆ పుస్తకం పేరు చందమామ, పిల్లాడు మైకం ఎత్తించుకున్న ఆ బొమ్మల రేఖామాంత్రికుడు పేరు శంకర్. "నేను ప్రజల దృష్టిలో ఒక హోదా గల అధికారిని మాత్రమే, నువ్వు అలాంటి లక్షలాది పిల్లల మనసు తొర్రలలో ఆనందానివిరా శంకరా" అన్నాడని చెబుతూ ఎంత సంతోషపడ్డారో ఆ మహా చిత్రకారులు.(చదవండి: 'మా తెలుగు తల్లికి' రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకలు)
నేను కలిసేనాటికి కనీసం ఆయనకు తొంబయ్ సంవత్సరాల వయసు. ఎంత లేదనుకున్నా అంతకు మునుపు డెబ్బయ్ సంవత్సరాలుగా బొమ్మలు వేస్తూ వస్తున్నారు. ఆయన బొమ్మల ఒరిజనళ్ళు చూద్దామని ఉంది. ఆయన మమ్మల్ని లోపలి గదిలో కి తీసుకెళ్ళారు. అక్కడ ఎప్పటిదో ఒక పాత బొమ్మ, కొండమీద తపస్సు చేసుకుంటున్న మహర్షి ఇంక్ డ్రాయింగ్ అది. చిక్కని రేఖలు, తిన్నని హేచింగ్, "ఈ బొమ్మ అనుకునట్టుగా కుదరలేదు నాయనా అందుకని పాడయి పోయిన ఈ బొమ్మ మాత్రము ఇక్కడ అట్టి పెట్టుకున్నా. వేసిన బొమ్మలన్నీ సంస్థకు ఇచ్చేశా" కర్మ యోగము అంటే ఏమిటో అర్థమయ్యింది.
పని చేస్తున్నంత వరకే ఆయన ఒక చిత్రకారుడు. పని పూర్తయ్యాక ఆయన చిత్రకారుడు కాదు, ఆ పని ఆయనదీ కాదు. ఆయన మొహంలో ఉన్న కాంతికి అర్థం తను చేసిన పనిది కాదు. తను ఏమి అవునో తెలిసిన ఎరుకది. ఆయన పెక్కు శంకరులు. మేము ఆ రోజు కలిసింది ఆనాటి ఒక శంకరుడిని మాత్రమే, ఆ శంకరుడు ఎవరు అన్నది కాదు ప్రశ్న. అసలు నేను ఎవరిని. నన్ను నేను ఎన్ని రకాలుగా వదిలించుకుంటాను అన్నదే నేను వెతుక్కోవలసిన జవాబు. ఆ రోజు ఆ శంకరుడి సతీమణి గిరిజమ్మ చేతి కాఫీ తాగాము. ఎన్నదగిన భాగ్యము . మా మిత్రుడు విజయవర్దన్ గారు తన పాత కలెక్షన్ లోనుండి ఆ నాటి వీడియో వెతికి తీస్తే మరిన్ని మాటలు పంచుకోవచ్చు. ఏదో ఒక రోజు.
-అన్వర్,
ఆర్టిస్ట్, సాక్షి