జోగుళాంబ ఆలయంలో చండీహోమాలు
అలంపూర్రూరల్: అష్టాదశ శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో మహాలయ పౌర్ణమి(మాలపున్నమి)ని పురస్కరించుకుని శుక్రవారం సామూహిక చండీహోమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులకు దేవస్థానం వారు బ్రహ్మేశ్వర నిత్యాన్నదాన సత్రంలో భోజన సదుపాయం కల్పించారు. 57 మంది చండీహోమాలు నిర్వహించినట్లు దేవస్థాన జూనియర్ అసిస్టెంట్బ్రహ్మయ్య ఆచారి తెలిపారు.హోమాల ద్వారా రూ.42,750 ఆదా యం వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలాఉండగా, శుక్రవారం నుంచి ఆర్జిత సేవా టికెట్ ధరలయితే పెంచారు కానీ అర్చన మండపాన్ని మాత్రం విస్తరించలేదని, చాలీచాలని స్థలంలోనే నిల్చొని అర్చనలు చేసే పరిస్థితి నెలకొందని భక్తులు ఆవేదన వ్యక్తంచేశారు. సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరారు.
ఆలయంలో దర్బార్సేవ
జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం దర్బార్సేవ నిర్వహించారు. వారోత్సవ సేవలలో భాగంగా ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహానికి పూజా కార్యక్రమాలు, శ్రీచక్రార్చనలు నిర్వహించారు. అమ్మవారి లలిత సహస్త్ర నామాలు, శతనామాలు పఠించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తికి దశవిదహారతులు అందజేశారు.