రేప్ బాధితురాలిపై షాకింగ్ కామెంట్లు
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నారు. అత్యాచార బాధితురాలిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు మంటపుట్టిస్తున్నాయి.
ఛండీగఢ్లో ఓ ఆటోడ్రైవర్, అతని స్నేహితుల చేతిలో 22 ఏళ్ల ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఈ అంశం అక్కడ తీవ్ర చర్చనీయాంశం కాగా, ఆ నియోజకవర్గ ఎంపీ అయిన కిరణ్ ఓ జాతీయ మీడియాతో బుధవారం మాట్లాడారు. ‘‘ఆటోలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అలాంటప్పుడు అప్రమత్తంగా ఉండి ఆ యువతి ఆటో ఎక్కాల్సింది కాదు. అమ్మాయిలూ అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
మగపిల్లలను జాగ్రత్త చేయటం మాట అటుంచి.. అమ్మాయిలకు కూడా తగిన సూచనలు చేయాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉందని ఆమె తెలిపారు. తాను ముంబైలో ఉన్న రోజుల్లో టాక్సీల్లో ప్రయాణించేదానన్ని.. ఆ సమయంలో వాటి నంబర్లను రాసుకోవటం అలవాటు చేసుకున్నానని ఆమె చెప్పారు. మీడియా కూడా ఇలాంటి సమయాల్లో అత్యుత్సాహం ప్రదర్శించకుండా.. జాగ్రత్తలు చర్యలను.. పోలీసుల టోల్ ఫ్రీల్ నంబర్లను విరివిగా ప్రచారం చేయాలని ఆమె సూచించారు.
అయితే ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడటంతో ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తేలేదని ఆమె చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. మహిళలను చైతన్యవంతం చేసేందుకే తాను అలా మాట్లాడానే తప్ప.. కించపరిచే ఉద్దేశం తనకు లేదని కిరణ్ చెప్పుకొచ్చారు. అనవసరంగా ఆ ప్రకటనను రాజకీయం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.