chandipur test range
-
వీఎల్–ఎస్ఆర్ఎస్ఏఎం పరీక్ష సక్సెస్
బాలసోర్: ఒడిశా తీరం చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి శుక్రవారం చేపట్టిన వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ క్షిపణి (వీఎల్–ఎస్ఆర్ఎస్ఏఎం) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. నేవీ షిప్ నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి నిర్దేశించిన పరిమితుల ప్రకారం ఛేదించిందని అధికారులు తెలిపారు. ఈ ఆయుధ వ్యవస్థ అత్యంత సమీపంలోని వివిధ రకాల లక్ష్యాలను అడ్డుకుంటుందని, రాడార్ తదితరాలకు దొరక్కుండా తప్పించుకునే వాటిని కూడా ఎదుర్కొంటుందని వెల్లడించారు. ఈ క్షిపణి హై స్పీడ్ ఏరియల్ టార్గెట్‌ను ఛేదించడాన్ని అంచనా వేసేందుకు పలు ట్రాకింగ్ వ్యవస్థలను వినియోగించినట్లు చెప్పారు. ఈ ప్రయోగం డీఆర్డీవో, నేవీ ఉన్నతాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిందన్నారు. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన డీఆర్డీవో, నేవీలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ విజయంతో భారత నావికాదళం గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ నేవీ, డీఆర్డీవో బృందాల కృషిని ప్రశంసించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న బృందాలను డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్ రెడ్డి అభినందించారు. భారత నావికా దళం సామర్థ్యాన్ని ఈ ఆయుధ వ్యవస్థ ఇనుమడింప జేస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన ‘‘ఆత్మనిర్భర్ భారత్’’లో ఇది మరో మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. -
'నిర్ణయ్' క్షిపణి ప్రయోగం విజయవంతం
న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ రూపొందించిన బూస్టర్ ఇంజిన్ అమర్చిన 'నిర్భయ్' క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న పరీక్ష కేంద్రం నుంచి క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) బుధవారం ప్రకటించింది. ఈ క్షిపణి 1000 కిమీల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేధించగలదు. బుధవారం ఉదయం పదింటికి క్షిపణిని ప్రయోగించగా 15 నిమిషాలపాటు గాల్లో దూసుకెళ్లి 100 కి.మీ.ల దూరంలోని నిర్దేశత లక్ష్యాన్ని ధ్వంసం చేసిందని డీఆర్డీవో పేర్కొంది. ' 'నిర్భయ్' ప్రాజెక్టు గతంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఒక దశలో ఏకంగా ఈ ప్రాజెక్టునే పక్కనపెట్టేయాలని రక్షణ శాఖ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుల లేమి, పలు సాంకేతిక సమస్యలు ఇందుకు కారణాలయ్యాయి.. ఇటీవల గత ఏడాది అక్టోబర్‌లో సైతం క్షిపణిని ప్రయోగించాక ఎనిమిది నిమిషాల తర్వాత పరీక్షను అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఇన్ని అడ్డంకుల్ని తట్టుకుని తాజా పరీక్షలో 'నిర్భయ్' తన సత్తా చాటింది. పరీక్ష విజయవంతమవడంతో వీలైనంత త్వరగా సైన్యానికి అందించేలా దీన్ని సంసిద్ధం చేయాలని డీఆర్డీవో భావిస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్‌లో సైన్యంలోకి తీసుకున్నాక చైనా సరిహద్దుల్లో దీన్ని మోహరించే వ్రతిపాదనలూ ఉన్నాయి. భూతల లక్ష్యాలను చేధించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రయోగించే. క్రూయిజ్ క్షిపణి రకానికి చెందిన “నిర్భయ్” ఏకంగా 800 కేజీల పేలుడు పదార్దాలను మోసుకుపోగలదు. దాదాపు 0.7 మ్యాక్ స్పీడ్‌తో ఇది ప్రయాణిస్తుంది. అరు మీటర్ల పోడవు, 0.52 మీటర్ వెడల్పుండే ఈ క్షిపణిని గగనతల, సముద్ర, భూతలాల నుంచి ప్రయోగించవచ్చు. తొలి దశలో ఘన ఇంధనాన్ని తర్వాత ద్రవ ఇంధనాన్ని వాడుకునే మిస్సైల్ ఇది. జలాంతర్భాగంలో ప్రయాణించడంతోపాటు, అత్యంత తక్కువ ఎత్తుల్లో ప్రయాణించే వెసులుబాటు ఉండటంతో దీని జాడను శత్రు దేశాల రాడార్లు పసిగట్టలేవు. -
నిర్భయ్.. నాలుగోసారీ విఫలం
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిచేసిన నిర్భయ్ క్షిపణి ప్రయోగం నాలుగోసారి కూడా విఫలమైంది. అయితే ఈ విషయమై డీఆర్డీఓ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, బుధవారం ఒడిశాలోని చాందీపూర్‌లో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రయోగకేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. కానీ సాంకేతిక లోపాల కారణంగా ఇది విఫలమైందని సమాచారం. టేకాఫ్ వరకు బాగానే ఉన్నా.. అది వెళ్లాల్సిన మార్గం నుంచి అది పక్కకు పోయిందని అంటున్నారు. అది ఎక్కడైనా భూమ్మీద పడే ప్రమాదం ఉండటంతో.. దాన్ని మధ్యలోనే, ప్రయోగించిన కొద్ది నిమిషాలకే పేల్చేశారు. ఆరు మీటర్ల పొడవైన నిర్భయ్ క్షిపణి.. 1500 కిలోల బరువు ఉంటుంది. ఇది వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించేలా దీన్ని తయారుచేశారు. ఇది సంప్రదాయ, అణు వార్ హెడ్లను కూడా మోసుకెళ్లగలదు. తొలిసారి దీన్ని 2013 మార్చి 12న ప్రయోగించగా, 20 నిమిషాల తర్వాత విఫలమైంది. 2014 అక్టోబర్ 17న చేసిన రెండో ప్రయోగం కూడా అది తగినంత ఎత్తు వెళ్లలేక విఫలమైంది. ఆ తర్వాత 2015 అక్టోబర్ 16న మూడోసారి చేసిన ప్రయోగంలో అది 128 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత.. బంగాళాఖాతంలోకి పడిపోయింది. ప్రస్తుతం భారత అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మోస్ కూడా అణు వార్హెడ్లను తీసుకెళ్లగలదు. కానీ అది 290 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. దాంతో దీర్ఘశ్రేణి క్షిపణి అవసరం అవుతుందని దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.