నగర ఎమ్మెల్యేల్లో ఒక్కరే గ్రాడ్యుయేట్
మిగతావారి విద్యార్హత 12వ తరగతి లోపే
సాక్షి, ముంబై: విద్యాభ్యాసం గురించి గొప్పలు చెప్పే నాయకులు నిజంగానే విద్యాధికులా అంటే జవాబు చెప్పడం కొంత కష్టమే మరి. ఎందుకో తెలుసా. ఆర్థిక రాజధాని పరిధిలోని పలు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగినవారి విద్యార్హత గరిష్టంగా 12వ తరగతి మాత్రమే. అయితే పశ్చిమ అంధేరీ నుంచి బరిలోకి దిగిన అమిత్ సాటం మాత్రమే డిగ్రీ చదివారు. పలు పార్టీల తరఫున బరిలోకి దిగిన వీరు నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో జతచేసిన అఫిడవిట్లలో పేర్కొన్న వివరాలతో ఈ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. చాందివలి నియోజక వర్గం నుంచి గెలిచిన నసీంఖాన్ ప్రాథమిక విద్యను పూర్తిచేసి పాఠశాలకు స్వస్తి చెప్పారు. గోరేగావ్ నుంచి గెలుపొంది బీజేపీ అభ్యర్థి విద్యాఠాకూర్ ఎనిమిదో తరగతి వరకే చదివారు.
అణుశక్తినగర్ నుంచి శివసేన అభ్యర్థి తుకారాం తొమ్మిదో తరగతి చదివారు. ములుండ్ లో విజయకేతనం ఎగురవేసిన సర్దార్ తారాసింగ్ పదో తరగతి తప్పినట్టు తన అఫిడవిట్లో పేర్కొన్నారు. తూర్పు అంధేరీ నుంచి శివసేన అభ్యర్థి రమేశ్ లట్కే, తూర్పు ఘాట్కోపర్ నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన ప్రకాశ్ మెహతా, చెంబూర్ నుంచి శివసేన తరఫున పోటీచేసిన ప్రకాశ్ ఫాతర్పేకర్, కలీనా నుంచి శివసేన టికెట్‌పై పోటీచేసిన సంజయ్ పోత్నిస్, కుర్లా నుంచి శివసేన అభ్యర్థి మంగేశ్ కుడాల్కర్ కేవలం పదో తరగతికే పరిమితమయ్యారు.
విఖ్రోలీ నియోజకవర్గం నుంచి శివసేన తరఫున పోటీచేసిన సునీల్ రావుత్ 12వ తరగతి, దిండోషి నుంచి శివసేన తరఫున బరిలో దిగిన మాజీ మేయర్ సునీల్ ప్రభు 12వ తరగతి, చార్కోప్ నుంచి బీజేపీ అభ్యర్థి యోగేష్ సాగర్ 11వ తరగతి చదివారు. నగరంలోని 36 శాసనసభ నియోజకవర్గాలకు 17 నియోజక వర్గాల నుంచి గెలుపొందిన అభ్యర్థులు పదో తరగతి లోపే చ దువుకున్నారని సమాచారం.