రోడ్డెక్కిన ప్రగతి రథ చక్రాలు
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది రోజుల విరామం తర్వాత ఆర్టీసీ బస్సు రోడ్డెక్కింది. బుధవారం సాయంత్రం ఫిట్మెంట్పై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటన చేసిన అనంతరం అధికారికంగా సమ్మె విరమిస్తున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. కానీ తాము డిమాండ్ చేసిన దానికంటే ఒక శాతం అధికంగా ప్రభుత్వం ఫిట్మెంట్ మంజూరు చేయటంతో సంబరాల్లో మునిగిపోయిన కార్మికులు బస్సులను రోడ్డెక్కించే విషయాన్ని పట్టించుకోలేదు. కొన్ని డిపోలకు సాయంత్రమే చేరుకున్న అధికారులు సమ్మె ముగిసినందున వెంటనే విధుల్లో చేరాల్సిందిగా కార్మికులకు ఫోన్ల ద్వారా సమాచారమందించారు.
దీంతో రాత్రికి గాని కొందరు విధుల్లోకి రాలేదు. రాత్రి కాస్త పొద్దుపోయిన తర్వాత దూరప్రాంతాల బస్సులను అధికారులు ప్రారంభించారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బస్సులను జిల్లాలకు పంపే విషయంపై దృష్టి సారించారు. హైదరాబాద్లో సిటీ బస్సులు కూడా పొద్దపోయిన తర్వాతనే మొదలయ్యాయి. గురువారం ఉదయం నుంచి అన్ని బస్సులను తిప్పుతామని అధికారులు తెలిపారు.