సా...గుతున్న ఛానల్ ఆధునికీకరణ
మూసుకు పోతున్న కల్వర్టులు
పట్టించుకోని అధికారులు
పనుల్లోనూ జాప్యం
ఆందోళన చెందుతున్న రైతులు
గుడివాడ : గుడివాడ ఛానల్ ఆధునికీకరణ పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు సాగునీటిని సక్రమంగా అందించాలనే సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం డెల్టా ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టింది.
గుడివాడఛానల్ ఆధునికీకరణకు రూ. 80 కోట్లు కేటాయించారు. పనులు పూర్తి చేయటానికి మూడేళ్ల కాలపరిమితి దాటి ఏడాదిన్నర కావస్తున్న ఇంతవరకు 40శాతం పనులు కూడా పూర్తి కాకపోవటం విశేషం. ఈ పనులను పర్యవేక్షించటానికి గానూ పులిచింతల ప్రాజెక్టులో పనిచేసే ఇంజినీర్లును ఇక్కడ నియమించారు.
పనులు జరిగే సమయంలో కనీసం వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి లేకుండానే పనులు చేపడుతున్నారు. గుడివాడ ఛానల్‌కు బంటుమిల్లి రోడ్డు నుంచి దొండపాడు వెళ్లే రోడ్డులో రక్షణ గోడ నిర్మిస్తున్నారు. ఈ పనులను ఏడాది కాలంగా చేస్తున్నా కనీసం 50శాతం పనికూడా పూర్తి కాలేదు. ఈ ఏడాది కాలువలకు నీటి సరఫరా నిలిపి వేసి రెండు నెలలవుతున్నా పనులను మాత్రం హడావిడిగా ఇటీవలే ప్రారంభించారు.
అడ్డగోలుగా పనులు...
ఆధునికీకరణ పనులు ప్రణాళిక లేకుండా అడ్డగోలుగా నిర్వహిస్తున్నా అధికారులు మాత్రం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రక్షణ గోడ నిర్మాణం పేరుతో గుత్తే దారుడి వాహనాలు ఈరోడ్డుపై తిరగటం వల్ల రోడ్డు పూర్తిగా పాడైపోగా ఉన్న కల్వర్టులు కూలిపోయి సాగునీటి కాలువలకు అడ్డంగా పడిపోయాయని దొండపాడుకు చెందిన రైతులు చెబుతున్నారు. దీనిపై స్థానిక అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని అంటున్నారు. కల్వర్టులు, ఇప్పటికైనా అధికారులు స్పందించి గుడివాడ ఛానల్ ఆధునికీకరణ పనులను ప్రణాళికా బద్ధంగా నిర్వహించేలా చూడాలని స్థానిక రైతులు కోరుతున్నారు.