సర్వే గోల
ఒకరు అన్నాడీఎంకేకే
మరొకరు డీఎంకేకు
తప్పని గందరగోళం
సర్వేల తీరుపై విమర్శలు
సాక్షి, చెన్నై: ఎన్నికల వేళ సాగుతున్న సర్వేల గోల తీవ్ర గందరగోళానికి దారి తీస్తోంది. సర్వేల లెక్కలు ఏ ప్రాతిపదికన పరిగణిస్తున్నారో ఏమోగానీ, ఆ వివరాల వెల్లడి తదుపరి రాష్ట్రంలో పెద్ద చర్చే సాగుతోంది. ఓ చానల్ సర్వే అన్నాడీఎంకేకు అనుకూలంగా, మరో చానల్ సర్వే డీఎంకేకు అనుకూలంగా వస్తుండడంతో గందరగోళం తప్పడం లేదు. ఇంతకీ రాష్ర్టంలో అధికారం చేపట్టేదెవరో అన్న ప్రశ్న తలెత్తక మానదు. కొన్నిచోట్ల సర్వేలు తలకిందులైన సందర్భాలు అనేకం. అందుకే తమిళనాట ఎన్నికల్లో ఓటరు నాడిపై ప్రతి మీడియాలోనూ చర్చ బయలు దేరింది. రాష్ట్రంలో మే 16వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల నామినేషన్ పర్వం ఈనెల 22 నుంచి ఆరంభం కానున్నది. ఇంకా రాజకీయ పక్షాలు మద్దతు, పొత్తు, సీట్ల కసరత్తుల్లోనూ ఉన్నాయి. బీజేపీ మాత్రం తొలి జాబితాను ప్రకటించింది. ఇక సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి 234 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాయి. ఇక, ప్రధాన పార్టీలు కసరత్తులతో జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఒక్క ప్రజా కూటమి మినహా తక్కిన పార్టీలు ఇంకా ప్రజల్లోకి ఓట్ల ప్రచారం నిమిత్తం బయలు దేర లేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవలి కాలంగా సాగుతున్న సర్వేలు మాత్రం ఓ వైపు చర్చను, మరో వైపు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు.
గందరగోళం : రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోనూ లయోల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఓటరు నాడిని పసిగట్టే విధంగా సర్వే సాగించడం జరుగుతున్నది. ఇటీవల సాగించిన సర్వే డీఎంకేకు అనుకూల వాతావరణం రాష్ట్రంలో ఏర్పడి ఉన్నదంటూ గణాంకాలతో సహా సర్వే వివరాల్ని ప్రకటించారు. తదుపరి మరెన్నో సర్వేలు రాష్ట్రంలో సాగాయి. రాష్ట్రానికి చెందిన ప్రముఖ చానళ్లు సైతం సర్వేలు సాగిస్తూ ఎవరికి వారు డీఎంకే అంటూ, అన్నాడీఎంకే అంటూ వివరాల్ని ప్రకటించే పనిలో పడ్డారు.
అదే సమయంలో ఇండియా టీవీ కోసం నెలన్నర క్రితం సీ ఓటర్స్ సంస్థ సర్వే సాగించి, అమ్మే మళ్లీ సీఎం అన్ని తేల్చింది. ఇంత వరకు సాగిన సర్వే వివరాలు ఓ వైపు తీవ్ర చర్చకు దారి తీసి ఉంటే, శుక్రవారం ఇండియా టీవీ ‘సీ’ ఓటర్స్ సర్వే అమ్మకు సీట్ల శాతాన్ని మరింతగా పెంచి వెల్లడించి ఉండడం విశేషం. సీ ఓటర్స్సంస్థ గతంలో డీఎంకేకు 101 వస్తుందని ప్రకటించి ఉంటే, ప్రస్తుతం 70కు సంఖ్యను తగ్గించి ఉండడం గమనార్హం. ఈ సర్వేలు ఏ ప్రాతిపదికన, ఎవరెవరి కోసం సాగుతున్నాయో ఏమోగానీ, సర్వే వివరాల తదుపరి వాటి గురించి చర్చించుకునే వాళ్లు అధికమే.
ప్రస్తుతం ఇండియా టీవీ - సీఓటర్స్ సర్వే అమ్మకే పట్టం అంటూ 130 స్థానాల్లో జయ కేతనం తథ్యం అని ప్రకటించింది. డీఎంకే 70 సీట్లతో సర్దుకోవాల్సిందేనని సూచిస్తూ, మిగిలిన వాళ్లు 34తో సరి పెట్టుకోవాలని సర్వేలో పేర్కొంది. బీజేపీకి డిపాజిట్లు గల్లంతు తప్పదని సూచించింది. అదే సమయంలో అమ్మకు కాదు, డిఎంకేకు అధికారం అంటూ న్యూస్ నేషన్ అనే టీవీ చానల్ సర్వే సాగించినట్టు ఆ పార్టీ అనుకూల పత్రికలో కథనం వెలువడడం గమనార్హం. అమ్మకు ఈ సారి పతనం తథ్యం అని ఆ సర్వే వివరాలు వెల్లడించి ఉన్నారు.
డిఎంకేకు 107 నుంచి 111, అన్నాడీఎంకేకు 103 నుంచి 107 లోపు స్థానాలు, డీఎండీకే - ప్రజా కూటమికి 14 నుంచి 17లోపు సీట్లు దక్కుతాయని వివరించి ఉన్నారు. డీఎంకే ఓటింగ్ శాతం 34, అన్నాడీఎంకేకు 28, ప్రజా కూటమికి 19 దక్కుతాయని సూచించారు. ఈ సర్వేలు కాస్త గందరగోళానికి దారి తీస్తుండడంతో విమర్శలు గుప్పించే వాళ్లు కూడా పెరుగుతున్నారు. ఎవరికి వారు వారికి అనుకూలంగా చానల్స్ ద్వారా సర్వేలు చేయించుకుని ఓటరును దారి మళ్లించే యత్నం చేస్తున్నారని ఆరోపించే వాళ్లు పెరిగారు.
అదే సమయంలో ఈ సర్వేల రాతల్ని మార్చే రీతిలో ఓటరు నాడి ఉండొచ్చన్న సంకేతాలు ఉన్నాయి. మే 19వ తేదీ ఫలితాల లెక్కింపు తదుపరి జార్జ్ కోటలో అమ్మ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేనా లేదా, ఆసుపత్రిగా మారిన ఓమందూరు ఎస్టేట్లోని భారీ సౌధం మళ్లీ సచివాలయంగా మార్చే రీతిలో కరుణానిధి పీటం ఎక్కేనా అన్న ది తేలనుంది. అంత వరకు ఈ సర్వేలన్నీ ఓ మాయే అని వ్యాఖ్యానించే వాళ్లూ ఉన్నారు.
విమర్శలు : తాజా సర్వేల గురించి పీఎంకే సీనియర్ నేత ఏకే మూర్తి వ్యాఖ్యానిస్తూ ఇవన్నీ బూటకంగా వ్యాఖ్యానించారు. పీఎంకే రెండు వందల స్థానాల్లో గెలవడం తథ్యం అని, సర్వేల్ని తలకిందులు చేసే రీతిలో ఓటరు తీర్పు ఇవ్వబోతున్నాడని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ పేర్కొంటూ, ఈ సర్వే కొత్తగా తీసింది కాదని వ్యాఖ్యానించారు.
ఎప్పడో తీసిన సర్వేను ఇప్పుడు బయట పెట్టి ఉన్నారని, ఈ లోపు రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు వచ్చాయని వివరించారు. ఇక, రాష్ట్రంలో మార్పు అన్నది తథ్యం అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇక సర్వేలకు కోడ్ అడ్డు రానున్నది. ఇందుకు తగ్గ ఆదేశాలను ఎన్నికల యంత్రాంగం ప్రకటించడం గమనార్హం. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి మే 16 వరకు ఎలాంటి సర్వేలు చేపట్టేందుకు వీలు లేదని, ప్రచురించేందుకు అవకాశం లేదంటూ ఈసీ కొరడా ఝుళిపించేందుకు సిద్ధం కావడం విశేషం.