Chanting Om
-
సూర్యుడు ఓం అంటున్నాడు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న వీడియోలు నకిలీవా?, ఒరిజినల్‌వా అని తేల్చుకోలేని పరిస్థితి ఉంది. కొందరు సెలబ్రిటీలు సైతం తమ ట్విట్టర్ ఖాతాల్లో నకిలీ వీడియోలను పోస్ట్ చేసి నెటిజన్ల ట్రోల్స్ బారిన పడిన వారు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ. ఇంతకీ విషయమేమిటంటే.. ‘సూర్యుడు ఓం అని పలుకుతున్నాడు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దాన్ని రికార్డు చేసింది’ అని ఆమె ఒక వీడియోను ట్విట్టర్ ఖాతా ద్వారా శనివారం పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ ట్వీట్‌ను 7వేల మందికి పైగా రీట్వీట్ చేయడంతో పాటు వందల మంది దానిపై స్పందించారు. అయితే వాస్తవానికి ఇదో నకిలీ వీడియో. ఇది భారత వాట్సాప్ గ్రూపుల్లో చాలాకాలాంగా సర్క్యులేట్ అవుతోంది. అందులో ఎలాంటి ఓం వినిపించదు. దీంతో పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ‘‘సూర్యుడు.. ‘వాహ్ మోదీజీ.. వాహ్’ అని అనడం కూడా ప్రారంభిస్తాడు’’ అంటూ కిరణ్ బేడీపై వ్యంగ్య వ్యాఖ్యలు కనిపించాయి. అసలు సంగతి ఏంటంటే ‘సూర్యుడు నిశ్శబ్దంగా ఉండడు. సూర్యుడి గుండెచప్పుడు వినడం ద్వారా శాస్త్రవేత్తలు దానిలోని సౌర పదార్థాల ప్రవాహాలను, తరంగాలను, అలజడులను మరింత విస్తృతంగా శోధిస్తున్నారు. దీంతో గతంలో తెలియని అనేక సౌర రహస్యాలను తెలుసుకునేందుకూ వీలు ఏర్పడింది’ అని 2018లో నాసా ఒక ట్వీట్ చేసింది. -
యోగా చేసేటప్పుడు ఆ 'మంత్రం' కంపల్సరీ కాదు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న నిర్వహించే యోగా కార్యక్రమంలో 'ఓమ్'ను, ఇతర వైదిక మంత్రాలను పాఠించడం తప్పనిసరి కాదని, ఈ విషయంలో ఎవరి అభిమతం మేరకు వారు వ్యవహరించవచ్చునని కేంద్ర ఆయూష్ మంత్రిత్వశాఖ తాజాగా స్పష్టం చేసింది. అంతర్జాతీయో యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే 45 నిమిషాల యోగా కార్యక్రమంలో 'ఓమ్'తోపాటు ఇతర వైదిక మంత్రాలను మొదటగా పాఠించాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీచేసినట్టు కథనాలు వచ్చాయి. ఈ సర్క్యులర్ వివాదాస్పదమయ్యే అవకాశముందని పేర్కొన్నాయి. సిక్కులు, బౌద్ధులు, ముస్లింలు 'ఓమ్' అని పాఠించడం మతపరంగా ఇబ్బందిగా భావిస్తారని, దీనిని తప్పనిసరి చేయరాదని జేడీయూ నేత కేసీ త్యాగీ కేంద్రానికి సూచించారు. ఈ నేపథ్యంలో ఆయూష్ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ కుమార్ గనెరివాలా మాట్లాడుతూ 'యోగా కార్యక్రమం ప్రారంభానికి ముందు 'ఓమ్' అని పాఠించడం తప్పనిసరి కాదు. ఇది స్వచ్ఛంద అంశమే. ఎవరైనా కావాలంటే మౌనంగా ఉండవచ్చు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఈ విషయంలో మీడియా కథనాలు యోగా దినోత్సవాన్ని వివాదాస్పదం చేయాలని చూస్తున్నాయి. 'ఓమ్' మంత్రం యోగాలో సమగ్రభాగం. ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పాఠించాలని ఎలాంటి నిబంధనలు లేవు' అని చెప్పారు.